Share News

ఒలింపిక్స్‌కు 28 మంది భారత అథ్లెట్లు

ABN , Publish Date - Jul 05 , 2024 | 06:13 AM

ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన ప్లేయర్ల జాబితాను వరల్డ్‌ అథ్లెటిక్స్‌ (డబ్ల్యూఏ) విడుదల చేసింది. ఆటోమేటిక్‌ క్వాలిఫికేషన్‌, ర్యాంక్‌ల ఆధారంగా రూపొందించిన లిస్ట్‌లో 28 మంది భారత అథ్లెట్లకు చోటు దక్కింది...

ఒలింపిక్స్‌కు 28 మంది భారత అథ్లెట్లు

న్యూఢిల్లీ: ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన ప్లేయర్ల జాబితాను వరల్డ్‌ అథ్లెటిక్స్‌ (డబ్ల్యూఏ) విడుదల చేసింది. ఆటోమేటిక్‌ క్వాలిఫికేషన్‌, ర్యాంక్‌ల ఆధారంగా రూపొందించిన లిస్ట్‌లో 28 మంది భారత అథ్లెట్లకు చోటు దక్కింది. కాగా, పారిస్‌ బెర్త్‌ పట్టేసిన 11 మంది మహిళల్లో తెలుగు ప్లేయర్లు జ్యోతి యర్రాజి, జ్యోతిక శ్రీ దండి కూడా ఉండడం విశేషం. లాంగ్‌ జంపర్‌ జస్విన్‌ ఆల్‌డ్రిన్‌కు కూడా కొంత ఆలస్యంగా ఈ జాబితాలో చేరే అవకాశం ఉంది. ఒలింపిక్‌ అర్హత మార్క్‌ను అందుకొన్న లాంగ్‌ జంపర్‌ శ్రీశంకర్‌ గాయపడడంతో.. అతడి స్థానంలో జస్విన్‌కు భారత అథ్లెటిక్స్‌ సమాఖ్య (ఏఎ్‌ఫఐ) అవకాశం కల్పించనుంది. 100 మీటర్ల హర్డిల్స్‌లో అర్హత సాధించిన తొలి భారత స్ర్పింటర్‌గా జ్యోతి ఘనత సాధించింది. మహిళల 4్ఠ400 రిలే జట్టులో జ్యోతికకు చోటు దక్కింది. జావెలిన్‌ త్రో వరల్డ్‌ చాంపియన్‌ నీరజ్‌ చోప్రా, కిశోర్‌ జనా నేరుగా అర్హత సాధించారు.


అథ్లెట్లతో మోదీ భేటీ: పారిస్‌ విశ్వ క్రీడల్లో తలపడే షూటర్లు, ఆర్చర్లు, ట్రాక్‌, ఫీల్డ్‌ అథ్లెట్లు, సహాయ సిబ్బందితో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం భేటీ అయ్యారు. క్రీడల మంత్రి మన్‌సుఖ్‌ మాండవ్య, క్రీడా శాఖ సహాయ మంత్రి రక్షా ఖడ్సే, భారత ఒలింపిక్‌ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక టోక్యో ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత నీరజ్‌ చోప్రా, పారిస్‌ బరిలో దిగుతున్న తెలంగాణ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌, రెండుసార్లు విశ్వక్రీడల పతక విజేత పీవీ సింధుతో మోదీ వర్చువల్‌గా సంభాషించారు.

Updated Date - Jul 05 , 2024 | 06:13 AM