Share News

NRI: సౌదీ డిఫెన్స్ షోలో భారత నారీ శక్తి

ABN , Publish Date - Feb 08 , 2024 | 08:42 PM

సౌదీ అరేబియాలో జరుగుతున్న ప్రపంచ రక్షణ షో కార్యక్రమంలో భారత త్రివిధ దళాలు పాల్గొంటున్నాయి.

NRI: సౌదీ డిఫెన్స్ షోలో భారత నారీ శక్తి

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: నారి శక్తి .. నరేంద్ర మోదీ సర్కారు జపిస్తున్న నూతన రాగం ఇది. గణతంత్ర దినోత్సవ వేడుకలలో త్రివిధ దళాలలో జాతికి సేవలందిస్తున్న మహిళామణులతో కవాతు నిర్వహించిన సర్కారు భారతీయ నారీ ప్రతిభను ఇక అంతర్జాతీయంగా కూడ చాటుతుంది.

తాజాగా సౌదీ అరేబియాలో జరుగుతున్న ప్రపంచ రక్షణ షో కార్యక్రమంలో భారత త్రివిధ దళాలు పాల్గొంటున్నాయి. నాలుగు రోజుల పాటు జరిగే ఈ రక్షణ ప్రదర్శనలో కేంద్ర రక్షణ సహాయ మంత్రి అజయ్ భట్ పాల్గొన్నారు. భారతీయ ప్రతినిధి బృందంలో మంత్రితో పాటు భారత సేనకు చెందిన కల్నల్ పోనుగ్ డోమింగ్, నౌకాదళా లెఫ్ట్నెనెంట్ కమాండర్ అన్ను ప్రకాశ్, వాయుసేన స్క్వాడ్రన్ లీడర్ భావన కాంత్ అనే ముగ్గురు మహిళ అధికారిణులు ఉన్నారు.

2.jpg


భారతీయ రక్షణ దళాలకు చెందిన ఈ ముగ్గురు మహిళమూర్తులను కేంద్ర మంత్రి ప్రత్యేకించి విదేశీ అతిథులతో పాటు భారతీయ మహిళలకు పరిచయం చేసారు. జాతికి సేవలందిస్తున్న త్రివిధ దళాలలో పని చేస్తున్న మహిళలతో సమావేశం కావడం సంతోషం కల్గించిందని రియాధ్ నగరంలో నివసించే అనంతపురం జిల్లా వాస్తవ్యురాలు చేతన అన్నారు. పెళ్ళయి సౌదీ అరేబియాకు రాక ముందు అమె యన్.సి.సి శిక్షణ పొంది ఉత్తమ కంటింజెంట్ కమాండర్ ఆవార్డును కూడా గవర్నర్ నుండి అందుకొన్నారు.

భారతీయ రక్షణ ప్రతినిధి బృందంతో తెలుగు ప్రవాసీయులు చేతన, ముజ్జమ్మీల్ షేఖ్, సూర్య తదితరులు ఉన్నారు.

ఈ ప్రదర్శన సందర్భంగా భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మైల్ అనే సంస్థ సౌదీ అరేబియాకు 225 మిలియన్ డాలర్ల ఆయుధ సామగ్రి ఎగుమతి చేయడానికి కంట్రాక్టు పొందిందని భారతీయ అధికారులు వెల్లడించారు. సౌదీ అరేబియా విజన్ 2030, భారత్ ఆత్మనిర్భర్‌లకు అనుగుణంగా ఈ ఒప్పందం కుదిరిందని రక్షణ మంత్రి అజయ భట్ వ్యాఖ్యానించారు.

Updated Date - Feb 08 , 2024 | 08:47 PM