Share News

NRI: కుటుంబపెద్దను కోల్పోయిన తోటి మహిళను ఆదుకున్న సౌదీ తెలుగు మహిళలు

ABN , Publish Date - Feb 04 , 2024 | 02:37 PM

కుటుంబపెద్దను కోల్పోయిన మహిళను సౌదీలోని తెలుగు మహిళలు ఆదుకున్నారు. ఆమెకు ఆర్థిక సాయం అందించారు.

NRI: కుటుంబపెద్దను కోల్పోయిన తోటి మహిళను ఆదుకున్న సౌదీ తెలుగు మహిళలు

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: కుటుంబ పెద్దగా తన భార్య, పిల్లలకు మెరుగయిన జీవితం కోసం భర్త ఎడారి బాట పట్టినా ఇంటి బాధ్యతను పూర్తిగా తన భుజాలపై మోస్తూ అసలయిన బ్రతుకు బండిని మోసేది మాత్రం భార్యే! అందుకే అంటారు భర్తకు సర్వాధారం భార్యయే ధర్మార్ధకామసాధనకు ఉపకరణంబు. ఎడారినాట అకస్మాత్తుగా భర్త మరణించడంతో తన కుటుంబం గురించి ఆందోళన చెందుతున్న ఒక వితంతువుకు తోటి తెలుగు మహిళలు అండగా నిలిచారు.

జగిత్యాల జిల్లాకు చెందిన రఫీయోద్దీన్ కమాల్ అనే వ్యక్తి అప్పులకు తోడుగా సరైన ఉద్యోగం లేక ఆందోళనతో అనారోగ్యం పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించగా అతనిపై ఆధారపడ్డ అతని భార్య, కూతురు, చిన్న పిల్లల పరిస్థితి గురించి చలించిపోయిన జెద్దాలోని శాంతి, రామలక్ష్మి, సుజాత అనే ముగ్గురు మహిళలు తమ వంతుగా విరాళాన్ని ప్రకటించారు. తెలుగు ప్రవాసీ సంఘం సాటాలో క్రీయాశీలకంగా పాల్గొనే ఈ ముగ్గురు మహిళామణులు ముందడుగు వేయగా కులం, మతం, ప్రాంతం అనే వివక్షలకు అతీతంగా తెలుగు ప్రవాసీయులందరూ కలిసి ఆ వితంతువు కుటుంబానికి లక్షన్నర రూపాయాల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.


2.jpgమృతుడి కూతురు భవిష్యత్తు ఏమిటని ఆలోచించిన కవిత పోకూరి, సింధూరీలు ఈ మొత్తాన్ని ఆమెకు అందించాలని ప్రతిపాదించగా మహిళా విభాగం అధ్యక్షురాలు సుచరిత అంగీకరించారు. ఈ మొత్తాన్ని జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ శ్రీలత చేతుల మీదుగా మృతుడి భార్య, బిడ్డకు కలెక్టరేట్ కార్యాలయంలో శనివారం అందించే విధంగా ఏర్పాట్లు చేశారు.

తనకు ఆర్థిక సహాయం చేసిన వారెవరూ కూడా తెలియదని, అయినా మానవతా దృక్పథంతో తనను ఆదుకొన్నారని మృతుని భార్య సుమేరా కొనియాడింది.

ప్రాంతాలు, కుల, మతాలకు అతీతంగా సౌదీ అరేబియాలోని తెలుగు ప్రవాసీయులకు తమకు వీలయినంత తోడ్పాటు అందిస్తున్నట్లుగా సాటా ప్రతినిధులు వి.మల్లేశన్, ముజ్జమ్మీల్ షేఖ్, రంజీత్, సైమన్ పీటర్, రఫీక్‌లు తెలిపారు.

1.jpg

Updated Date - Feb 04 , 2024 | 03:58 PM