Share News

NRI: మాతృభూమికి చేరుకునే ప్రయత్నంలో ఎడారి చెరసాలలో ప్రాణం విడిచిన ఎన్నారై

ABN , Publish Date - Feb 04 , 2024 | 07:15 PM

వీసా నిబంధనల ఉల్లంఘన ఆరోపణలపై సౌదీ అరేబియాలో జైలు పాలైన ఓ తెలంగాణ వ్యక్తి చివరకు అనారోగ్యంతో అసువులు బాసాడు.

NRI: మాతృభూమికి చేరుకునే ప్రయత్నంలో ఎడారి చెరసాలలో ప్రాణం విడిచిన ఎన్నారై

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: సుదీర్ఘ ప్రవాస జీవితంలో సవాలక్ష సమస్యలు..చివరకు వీసా ఉల్లంఘన నేరంపై అరెస్టయి స్వదేశానికి చేరుకునే ప్రయత్నంలో ఉండగా అసువులు బాసిన ఓ తెలంగాణ ప్రవాసీ ఉదంతం వెలుగులోకి వచ్చింది.

​సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం వడ్లూరు గ్రామానికి చెందిన చిలుమల కొమరయ్య అనే ప్రవాసీ గత ఇరువై సంవత్సరాలకు పైగా సౌదీ అరేబియాలో డ్రైవర్‌గా పని చేస్తున్నారు. గత కొంత కాలంగా యజమానితో సమస్య ఏర్పడటంతో వీసా రెన్యువల్ కాలేదు. వీసా గడువు ముగియడంతో పాస్‌పోర్టు కూడా రెన్యూవల్ కాలేదు. దేశంలో అక్రమంగా ఉంటున్న కొమరయ్య సరైన ఉద్యోగం లేక విరక్తి చెందాడు. ఈ క్రమంలో అతని ఆరోగ్యం కూడా దెబ్బ తినడంతో స్వదేశానికి వెళ్ళే ప్రయత్నాలు ప్రారంభించాడు.

ఈ క్రమంలో వీసా తనిఖీల సందర్భంగా పోలీసులకు చిక్కడంతో జైలుపాలయ్యాడు. జైల్లో ఉండగా ఆరోగ్యం కూడా దెబ్బతింది. తన ఆరోగ్యం దెబ్బతింటోందని ఆయన చివరిసారిగా నవంబర్ 10న తన భార్యకు ఫోన్ చేసి చెప్పిన తర్వాత కొమరయ్య నుండి ఎలాంటి సమాచారం లేదు. తన భర్త గురించి ఆమె రెండు నెలలుగా తీవ్రంగా ప్రయత్నించింది. ఈ క్రమంలో తన భర్తను జైలు నుండి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ నవంబర్ 11న మరణించాడని కొద్ది రోజుల క్రితం తెలిసింది.

కొమరయ్య తన వద్ద నుండి పారిపోయాడంటూ అతని మృతదేహాన్ని పంపించడానికి యజమాని నిరాకరించాడు. తాము పేదలమని మృతుడి భార్య తన నిస్సహాయస్థితిని తెలియజేయగా భారతీయ కాన్సులేట్ తన ఖర్చుతో త్వరలో మృతదేహాన్ని స్వదేశానికి పంపించడానికి ఏర్పాట్లు చేస్తోంది. మృతదేహాన్ని దేశం నుండి బయటకు (భారత్) పంపించడానికి అవసరమైన ఆమోదం కోసం గవర్నర్ వద్ద ఫైలు పంపించామని అధికార వర్గాలు వెల్లడించాయి.

Updated Date - Feb 04 , 2024 | 07:28 PM