Share News

Ram Mandir: మోదీ నాయకత్వంతో రామమందిరం సాధ్యమైంది.. న్యూజిలాండ్ మంత్రుల ప్రశంస

ABN , Publish Date - Jan 21 , 2024 | 07:16 PM

అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం నేపథ్యంలో న్యూజిలాండ్ మంత్రులు ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు.

Ram Mandir: మోదీ నాయకత్వంతో రామమందిరం సాధ్యమైంది.. న్యూజిలాండ్ మంత్రుల ప్రశంస

ఎన్నారై డెస్క్: అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం నేపథ్యంలో న్యూజిలాండ్ మంత్రులు ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. మోదీ కృషి, నాయకత్వం కారణంగానే 500 ఏళ్ల ఎదురు చూపుల తరువాత రామ మందిర నిర్మాణం సాధ్యమైందని అన్నారు.

‘‘జై శ్రీరాం.. రామ మందిర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని భారత్‌లోని ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు. రాజసం ఉట్టిపడుతున్న రామ మందిరాన్ని వెయ్యేళ్ల పాటు నిలిచుండేలా నిర్మించారు. 500 ఏళ్ల ఎదురుచూపుల తరువాత మోదీ నాయకత్వంతోనే రామమందిర నిర్మాణం సాధ్యమైంది. ప్రపంచవ్యాప్తంగా ఎదురువుతున్న సవాళ్ల నడుమ దేశ ప్రజలను ముందుకు నడిపే శక్తియుక్తులు మోదీకి చేకూరాలని ఆశిస్తున్నా’’ అని న్యూజిలాండ్ రెగ్యులేషన్ శాఖ మంత్రి డేవిడ్ సీమోర్ మీడియాతో వ్యాఖ్యానించారు.


ఎథ్నిక్ కమ్యూనిటీస్ శాఖ మంత్రి మెలిసా లీ కూడా మోదీని ప్రశంసల్లో ముంచెత్తారు. మోదీ కృషి నాయకత్వం ఫలితమే రామమందిరమని వ్యాఖ్యానించారు. ‘‘రామమందిర ప్రారంభోత్సవం నేపథ్యంలో భారతీయులతో సహా ప్రపంచవ్యా్ప్తంగా ఉన్న భారత సంతతి వారందరికీ నా శుభాకాంక్షలు. ప్రధాని మోదీ కృషి కారణంగానే రామమందిర పునరుద్ధరణ జరిగింది. మోదీ ఎన్నోసార్లు ప్రధానిగా ఎన్నికయ్యారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న మోదీ లక్ష్యాన్ని ఈ విజయాలు ప్రతిబింబిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మోదీకి పేరుప్రఖ్యాతులు ఉన్నాయి. దేశం కోసం ఆయన ఎన్నో చేస్తున్నారు’’ అని మెలిసా వ్యాఖ్యానించారు.

మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా భారత సంతతి వారు కూడా రామమందరి ప్రారంభోత్సవం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అనేక దేశాల్లో భారతీయుల వేడుకలు అంబరాన్నంటుతున్నాయి. తాజాగా సిడ్నీలో శనివారం ఎన్నారైలు 100 కార్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. పలు చోట్ల బాణసంచా కాల్చారు.

Updated Date - Jan 21 , 2024 | 07:20 PM