Share News

NRI: భావి తరాల కోసం ఏపీలో ప్రభుత్వమార్పిడికి ఎన్నారైలు కృషి చేయాలి: జనసేన

ABN , Publish Date - Feb 04 , 2024 | 08:30 PM

భావి తరాల భవిష్యత్తు కోసం రాష్ట్రంలో ప్రభుత్వ మార్పిడి దిశగా ప్రతి ఒక్కరితో ప్రవాసీయులందరూ కలిసికట్టుగా కృషి చేయాలని జనసేన సౌదీ అరేబియా శాఖ పిలుపునిచ్చింది.

NRI: భావి తరాల కోసం ఏపీలో ప్రభుత్వమార్పిడికి ఎన్నారైలు కృషి చేయాలి: జనసేన

  • జగన్ ఓటమికై గల్ఫ్ నుండి జనసేన మహిళ వాలంటీర్లు

  • టీడీపీతో కలిసి ముందుకు వెళ్ళాలని సూచన

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: భావి తరాల భవిష్యత్తు కోసం రాష్ట్రంలో ప్రభుత్వ మార్పిడి దిశగా ప్రతి ఒక్కరితో కలిసి ప్రవాసీయులందరూ కృషి చేయాలని జనసేన సౌదీ అరేబియా శాఖ పిలుపునిచ్చింది. రానున్న ఎన్నికలలో ప్రచారం చేయడానికి ఎంపిక చేసిన నియోజకవర్గాలలో మహిళ వాలంటీర్లతో సహా ప్రవాసీయులను పంపించాలని కూడా నిర్ణయించింది.

​జనసేన ప్రాబల్య ప్రాంతంగా భావించే ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన ప్రవాసీయులు పెద్ద సంఖ్యలో సౌదీ అరేబియా, ఇతర గల్ఫ్ దేశాలలోని పారిశ్రామిక, పెట్రోలియం, నౌకాయాన రంగాలలో పని చేస్తున్నారు. సౌదీ అరేబియాలోని పారిశ్రామిక నగరమైన జుబేల్‌లో జరిగిన జనసేన విస్తృత స్థాయి సమావేశంలో విశాఖపట్నం నగరంతో పాటు ఉత్తరాంధ్రలో వీలయినంత ఎక్కువ స్థానాలలో పోటీ చేయాలని వక్తలు అభిప్రాయపడ్డారు. తెలుగుదేశంతో కలిసి ముందుకు వెళ్తూ రాష్ట్రాన్ని కాపాడవల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.

​విశాఖపట్టణం నగర జనసేన అధ్యక్షుడు, ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొని పార్టీ విధానాన్ని వివరించారు. కార్యక్రమాన్ని జనసేన సౌదీ అరేబియా కన్వీనర్లు జి.భాస్కర్ రావు, నగేశ్, చింతల సీతరామమూర్తిలు నిర్వహించగా అంకాబత్తుల గౌరీ శంకర్, అప్పాజీ, గణేశ్, చక్రధర్, వాజీద్‌లు నియోజకవర్గాల వారీగా సమన్వయం చేస్తూ రానున్న ఎన్నికలలో ప్రచారం చేయడానికి ప్రత్యేకంగా మహిళలు, ప్రవాసీయులను పంపించాలని నిర్ణయించారు.

Updated Date - Feb 04 , 2024 | 08:33 PM