Share News

NRI: అమెరికాలో భారత సంతతి పీహెచ్‌డీ విద్యార్థి ఆత్మహత్య

ABN , Publish Date - Feb 08 , 2024 | 06:03 PM

అమెరికాలో భారత సంతతి పీహెచ్‌డీ విద్యార్థి మృతి కేసులో మిస్టరీ వీడింది. అతడు ఆత్మహత్య చేసుకున్నట్టు పోస్ట్‌మార్ట్ నివేదికలో వెల్లడైంది.

NRI: అమెరికాలో భారత సంతతి పీహెచ్‌డీ విద్యార్థి ఆత్మహత్య

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో భారత సంతతి పీహెచ్‌డీ విద్యార్థి మృతి కేసులో మిస్టరీ వీడింది. అతడు ఆత్మహత్య చేసుకున్నట్టు పోస్ట్‌మార్ట్ నివేదికలో వెల్లడైంది. అమెరికా పౌరుడౌన సమీర్ కామత్ పర్‌డ్యూ యూనివర్సిటీలో (Purdue University) పీహెచ్‌డీ చేసేవారు. ఫిబ్రవరి 5న ఇండియానాలోని విలియమ్‌స్పోర్ట్ ప్రాంతంలోని క్రోస్ గ్రోవ్‌ వనంలో పోలీసులు అతడి మృతదేహాన్ని గుర్తించారు. అనంతరం, జరిగిన పోస్ట్‌మార్టంలో అతడు ఆత్మహత్య చేసుకున్నట్టు వెలుగులోకి వచ్చింది. మృతుడి తలపై తుపాకీతో స్వయంగా కాల్చుకున్నట్టు గాయం ఉందని నివేదికలో తేలింది (Indian-Origin Student In US Kills Himself ).

పర్‌డ్యూ యూనివర్సిటీ వివరాల ప్రకారం, సమీర్ కామత్ మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ చేస్తున్నారు. మసాచుసెట్స్ రాష్ట్రానికి చెందిన అతడు యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్ ఆమ్రెస్ట్ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్స్ పట్టా పొందారు. 2021లో పర్‌డ్యూ యూనివర్సిటీలో చేరారు. 2025లో ఆయన పీహెచ్‌డీ పూర్తి కావాల్సి ఉండగా ఇంతలోనే ఈ ఘోరం జరిగింది.

అమెరికాలో ఇటీవల కాలంలో పలువురు భారతీయ విద్యార్థుల వరుస మరణాలు అక్కడి భారతీయుల్లో కలకలం రేపుతున్నాయి. ఇటీవలే లిండర్ స్కూల్ ఆఫ్ బిజినెస్ విద్యార్థి శ్రేయాస్ రెడ్డి ఒహాయోలోని సిన్సినాటీలో మరణించారు. గత వారం రోజుల వ్యవధిలోనే వివేక్ సైనీ, నీల్ ఆచార్య అనే ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. జనవరి 30న పర్‌డ్యూ కాంపస్‌లో నీల్ ఆచార్య మృతదేహాన్ని గుర్తించగా, జార్జియాలోని లిథోనియా ప్రాంతంలో వివేక్ సైనీని దారుణంగా చంపేశారు. జనవరి 20న అకుల్ ధవన్ అనే భారతీయ విద్యార్థి మృతదేహాన్ని యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయి సమీపంలో గుర్తించారు.

Updated Date - Feb 08 , 2024 | 06:08 PM