Share News

USA: అమెరికాలో మరో భారతీయుడి హత్య.. అర్ధరాత్రి రెస్టారెంట్ బయట దారుణం..

ABN , Publish Date - Feb 10 , 2024 | 03:03 PM

వాషింగ్టన్‌లోని ఫిబ్రవరి 2న గుర్తుతెలియని వ్యక్తి దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డ భారత సంతతి వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇటీవల మృతి చెందారు.

USA: అమెరికాలో మరో భారతీయుడి హత్య.. అర్ధరాత్రి రెస్టారెంట్ బయట దారుణం..

ఎన్నారై డెస్క్: అమెరికాలో (USA) భారత సంతతి వ్యక్తుల వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి. తాజాగా మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. డౌన్‌టౌన్ వాషింగ్టన్‌లోని (Washington DC) ఫిబ్రవరి 2న గుర్తుతెలియని వ్యక్తి దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఓ భారత సంతతి వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇటీవల మృతి చెందారు. స్థానికంగా ఉన్న రెస్టారెంట్ వద్ద ఈ దాడి జరిగింది. మృతుడిని పోలీసులు వివేక్ చందర్ తనేజాగా గుర్తించారు.

ఘటన జరిగిన రోజు పోలీసులకు ఓ రెస్టారెంట్ బయట గొడవ జరుగుతున్నట్టు సమాచారం అందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు తనేజా తలపై తీవ్రగాయాలతో కనిపించారు. వెంటనే తనేజాను ఆసుపత్రికి తరలించగా ఆయన చికిత్స పొందుతూ ఫిబ్రవరి 7న మరణించారు (Indian-origin man killed in US after being hit in head during argument).


శ్వేతసౌధానికి కొద్ది దూరంలో ఓ జపనీస్ రెస్టారెంట్ వద్ద నిందితుడితో తనేజాకు వివాదం తలెత్తిందని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో ఆగంతుకుడు తనేజాను నేలపై పడేసి తలపై కొట్టాడని చెబుతున్నారు.

నిందితుడు ఉన్న సీసీటీవీ కెమెరా ఫుటేజీని పోలీసులు విడుదల చేశారు. నిందితుడి జాడ, వివరాలు తెలిపిన వారికి 25 వేల డాలర్లు రివార్డు ఇస్తామని ప్రకటించారు.

ఎవరీ తెనేజా..

వాషింగ్టన్ డీసీలోని అలెగ్జాండ్రియా అనే సబర్బన్ ప్రాంతంలో తనేజా ఉంటున్నారు. సిస్టమ్స్ ఇంజినీర్ అయిన తనేజా డైనమో టెక్నాలజీస్ సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరు. సంస్థకు ప్రసిడెంట్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. డైనమో టెక్నాలజీస్.. అమెరికా ప్రభుత్వానికి టెక్నాలజీ సర్వీస్ ప్రొవైడర్‌గా ఉంది. పలు పబ్లిక్, ప్రైవేట్ సంస్థలకు తనేజా టెక్నికల్ కన్సల్టింగ్ సేవలు అందించారు.

ఇటీవల షికాగోలో ఓ హైదరాబాదీ విద్యార్థిపై కూడా కొందరు దోపిడీదారులు దాడి చేశారు. అంతకుమును, జార్జియా లిథోనియా నగరంలో మాదకద్రవ్యాలకు బానిసైన ఓ వ్యక్తి భారతీయ విద్యార్థి వివేక్ శైనీపై దారుణంగా దాడి చేసి హత్య చేశాడు. ఈ ఘటనలపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

Updated Date - Feb 10 , 2024 | 03:09 PM