Share News

Canada: విదేశీయులకు మరో షాకిచ్చిన కెనడా!

ABN , Publish Date - Feb 05 , 2024 | 04:30 PM

దేశంలోని విదేశీయులకు కెనడా ప్రభుత్వం మరో షాకిచ్చింది. విదేశీయులు కెనడాలో స్థిరాస్తులు కొనకుండా గతంలో విధించిన నిషేధాన్ని మరో రెండేళ్ల పాటు పొడిగించామని ఆదివారం ప్రకటించింది.

Canada: విదేశీయులకు మరో షాకిచ్చిన కెనడా!

ఇంటర్నెట్ డెస్క్: దేశంలోని విదేశీయులకు కెనడా (Canada) ప్రభుత్వం మరో షాకిచ్చింది. విదేశీయులు కెనడాలో స్థిరాస్తులు కొనకుండా గతంలో విధించిన నిషేధాన్ని (Foreign Ownership Ban Extension) మరో రెండేళ్ల పాటు పొడిగించామని ఆదివారం ప్రకటించింది. ఇళ్ల ధరల పెరుగుదలతో సతమతమవుతున్న కెనడా పౌరులకు సాంత్వన చేకూర్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది.

కెనడాలో ప్రస్తుతం నివాస సముదాయాల కొరత నెలకొంది. విదేశీయుల సంఖ్య పెరిగిపోవడంతో ఇళ్లకు డిమాండ్ విపరీతంగా పెరిగిందని ప్రభుత్వం చెబుతోంది. దీనికి తోడు ధరల పెరుగుదల కారణంగా ఇళ్ల నిర్మాణాలు కూడా నెమ్మదించడంతో అక్కడ నివాస సదుపాయాలు కొరత ఏర్పడిందని చెబుతోంది.


ఇళ్ల ధరలను తగ్గించేందుకు అందుబాటులో ఉన్న అన్ని పరిష్కారాలను అమలు చేస్తామని కెనడా ఉప ప్రధాని క్రిస్టియా ఫ్రీలాండ్ ఆదివారం తెలిపారు. విదేశీయుల స్థిరాస్తి కొనుగోళ్లపై విధించిన నిషేధం వచ్చే ఏడాది ముగియనున్న నేపథ్యంలో దాన్ని మరో రెండేళ్ల పాటు పొడిగించినట్టు తెలిపింది.

విదేశీయుల స్థిరాస్తి కొనుగోళ్లతో సామాన్య కెనడా పౌరులకు ఇళ్లు దక్కకుండా పోతున్నాయన్న ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో విదేశీయుల సంఖ్యను కట్టడి చేసేందుకు కెనడా ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. స్టడీ పర్మిట్లు, వర్క్ పర్మిట్లు జారీపై పరిమితి విధించింది.

Updated Date - Feb 05 , 2024 | 04:30 PM