Share News

NRI: కెనడాలో బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న ఐదుగురు భారత సంతతి వ్యక్తుల అరెస్టు!

ABN , Publish Date - Feb 08 , 2024 | 09:46 PM

స్థానిక వ్యాపారులను బెదిరిస్తూ డబ్బు వసూళ్లకు ప్రయత్నించిన ఐదుగురు భారత సంతతి వ్యక్తులను కెనడా పోలీసులు తాజాగా అరెస్టు చేశారు.

NRI: కెనడాలో బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న ఐదుగురు భారత సంతతి వ్యక్తుల అరెస్టు!

ఎన్నారై డెస్క్: స్థానిక వ్యాపారులను బెదిరిస్తూ డబ్బు వసూళ్లకు పాల్పడ్డ ఐదుగురు భారత సంతతి వ్యక్తులను కెనడా పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. బెదిరింపులు, అక్రమఆయుధాలు కలిగి ఉండటం తదితర నేరాల కింద కేసు నమోదు చేశారు. అరెస్టైన వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు.

నిందితులను గగన్ అజిత్ సింగ్, అన్మోల్‌దీప్ సింగ్, హష్మీత్ కౌర్, ఇయమ్‌జోత్ కౌర్, అరుణ్‌దీప్ థిండ్‌గా గుర్తించారు. పీల్ రీజినల్ ఎక్స్‌టార్షన్ ఇన్వెస్టిగేటివ్ టాస్క్ ఫోర్స్, ఒంటారియో ప్రావిన్షియల్ పోలీసుల సాయంతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు బుధవారం పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు. నిందితులు బ్రాంప్టన్, మిస్సిసాగా ప్రాంతాలకు చెందిన వారని వివరించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గతేడాది డిసెంబర్‌లో దక్షిణాసియాకు చెందిన కొందరు వ్యాపారులు పోలీసులను ఆశ్రయించారు. తమను కొందరు బెదిరిస్తున్నారని, డబ్బులు ఇవ్వకపోతే కుటుంబసభ్యులపై దాడి చేస్తామంటూ బెదిరించారని ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

నిందితులు మొత్తం 29 సార్లు బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారన్నారు. కొన్ని సందర్భాల్లో షాపుల్లో కాల్పులు జరిపారని కూడా తెలిపారు. ఆ సమయంలో షాపుల్లో ఎవరూ లేకపోవడంతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని తెలిపారు. బాధితులను ఫోన్ లేదా వాట్సాప్‌ కాల్స్ ద్వారా నిందితులు సంప్రదించి బెదిరింపులకు దిగేవారని తెలిపారు.

Updated Date - Feb 08 , 2024 | 09:49 PM