Share News

జెన్‌ కథ జ్ఞానోదయం

ABN , Publish Date - Apr 26 , 2024 | 12:16 AM

టిబెట్‌లో ఒక బౌద్ధ సన్యాసి ఉండేవాడు. అతను విపరీతమైన జ్ఞానతృష్ణ కలిగినవాడు. ఎక్కడైనా జ్ఞాని ఉన్నాడని తెలిస్తే... ఆ ప్రదేశం ఎంత దూరంలో ఉన్నా... తక్షణం అతణ్ణి కలుసుకోవడానికి వెళ్ళేవాడు.

జెన్‌ కథ జ్ఞానోదయం

ఆ జ్ఞాని బోధను వినాలని ఆత్రుతపడేవాడు. ఒక రోజు అలాంటి జ్ఞాని సమీప గ్రామానికి వచ్చాడని తెలిసింది. అది సూర్యాస్తమయ సమయం. తన వెంట ఏదైనా తీసుకువెళ్ళాలనే ఆలోచనైనా లేకుండా... ఆ సన్యాసి బయలుదేరాడు.

చాలాసేపు నడిచి, నడిచిన సన్యాసి అలసిపోయాడు. అతని గొంతు ఎండిపోతోంది. ఇంతలో చీకటి పడింది. ఆకాశంలో అక్కడక్కడ నక్షత్రాలు మెరుస్తున్నాయి. అది జన సంచారం లేని ప్రదేశం. ఏదీ తినకుండా, తాగకుండా నడుస్తూ ఉండడం వల్ల అతనికి శోష వచ్చినట్టయింది. చీకట్లో అటూ ఇటూ వెతికాడు. ఎక్కడా పండ్లు కానీ, నీరు కానీ, తనకు సాయం చేసేవారు కానీ కనిపించలేదు.


అతను నేల మీద మోకరిల్లి, ఆకాశం వైపు చూసి, చేతులు జోడించి... ‘‘భంతే! ఒంటరిగా ఉన్నాను. అలసిపోయాను. దాహంగా ఉంది. నీవే దిక్కు. నన్ను కాపాడు. లేకపోతే నేను మరణిస్తాను. సత్యాన్ని తెలుసుకోకుండానే కన్ను మూస్తే... నా జీవితం వ్యర్థమవుతుంది. కరుణించు. నన్ను కాపాడు’’ అని బుద్ధ భగవానుణ్ణి ప్రార్థించాడు.

అతను అటు ఇటూ కదులుతూ ఉంటే... చేతికి ఏదో తగిలింది. మూతపడుతున్న కళ్ళను శక్తికొద్దీ తెరచి చూశాడు. అది బంగారు పాత్రలా ఉంది. అందులో నీరు ఉంది. ‘బుద్ధ భగవానుడు కరుణాసాగరుడు’ అనుకుంటూ అందులోని నీటిని తాగేశాడు. దప్పిక తీరింది. తృప్తిగా, హాయిగా అక్కడే నిద్రపోయాడు.


మరుసటిరోజు సూర్యుడి వెచ్చటి కిరణాలు అతణ్ణి నిద్రలేపాయి. ముందురోజు జరిగింది గుర్తుకువచ్చింది. అతను లేచి, చుట్టూ చూశాడు. అక్కడ బంగారు పాత్రా లేదు, నీరూ లేదు. కొద్దిరోజుల కిందట మరణించిన మనిషి కపాలం ఉంది. బహుశా ఏదో క్రూరజంతువు దాడిలో మరణించిన మనిషిలా అనిపించింది. అక్కడక్కడ రక్తపు మరకలు ఉన్నాయి. కుళ్ళిన మాంసం ముక్కలు ఉన్నాయి.

అవి కీటకాలతో నిండి ఉన్నాయి. తను రాత్రి తాగింది ఆ కపాలంలోని నీళ్ళనేనని అతనికి అర్థమయింది. అతను ఆశ్చర్యానికి, ఆందోళనకు గురయ్యాడు. తనకు బాగా దాహంగా ఉండడం వల్ల, రాత్రి చీకటిగా ఉండడం వల్ల అదొక బంగారు పాత్రలా, అందులోని జలం మంచి నీళ్ళలా అనిపించి తాగేశాడు.


పగటి వెలుగులో నిజం తెలుసుకున్న అతనికి కడుపులో వికారం మొదలైంది. వాంతి చేసుకున్నాడు. కాసేపు నిశ్చలంగా కూర్చున్నాడు. అతనిలో అనేక ఆలోచనలు కదలాడాయి. తనకు జ్ఞానోదయమైనట్టు, విశ్వరహస్యం తెలుసుకున్నట్టు అనుభూతికి లోనయ్యాడు.

జిజ్ఞాస తీవ్రమైనప్పుడు ఏదో ఒక విధంగా జ్ఞానజ్యోతి వెలుగుతుంది. అజ్ఞానంలో ఉన్నప్పుడు అందంగా, ఆకర్షణీయంగా, విలువైనవిగా కనిపించినవన్నీ జ్ఞానోదయం అయిన వెంటనే జుగుప్సాకరంగా, నిస్తేజంగా, నిర్జీవంగా, నిష్పలమైనవిగా గోచరిస్తాయి. అందుకే సాధారణ జనులు సంపదలను, పదవులను, బంధుత్వాలను అంటిపెట్టుకొని ఉంటే... జ్ఞానులు వాటన్నిటినీ తృణీకరిస్తారు. సత్యాన్ని, జ్ఞానాన్ని మాత్రమే అనుక్షణం అనుసరిస్తారు, అనుభవిస్తారు.

రాచమడుగు శ్రీనివాసులు

Updated Date - Apr 26 , 2024 | 12:16 AM