Share News

జకాత్‌ అంటే

ABN , Publish Date - Mar 22 , 2024 | 04:09 AM

ఇస్లాంలోని సమస్త ఆరాధనల్లో నమాజ్‌కు ఎంత ప్రాధాన్యం ఉందో జకాత్‌కు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. ఈ రెండిటిలో ఏ ఒక్కదాన్ని నిరాకరించినా..

జకాత్‌ అంటే

ఇస్లాంలోని సమస్త ఆరాధనల్లో నమాజ్‌కు ఎంత ప్రాధాన్యం ఉందో జకాత్‌కు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. ఈ రెండిటిలో ఏ ఒక్కదాన్ని నిరాకరించినా.. అది ఇస్లాం పట్ల అవిశ్వాసంగానే పరిగణన పొందుతుంది. వీటిలో ఒకటి లేకపోతే రెండోదానికి ఏమాత్రం విలువ ఉండదు. ‘‘విశ్వాసి అయిన ముస్లిం నమాజ్‌ చేస్తున్నప్పటికీ... ఏటా జకాత్‌ చెల్లించకపోతే ఆ నమాజ్‌ వల్ల అతనికి ఎలాంటి ప్రయోజనం చేకూరదు. అలాగే ఏటా జకాత్‌ చెల్లిస్తున్నా... జీవితాంతం నమాజ్‌ చెయ్యకపోతే... అతను చేసిన జకాత్‌ బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. సత్యాన్ని విశ్వసించి, సదాచార సంపన్నులై నమాజ్‌ నిర్వహిస్తూ, జకాత్‌ నెరవేర్చేవారికి పరలోకంలో ఎలాంటి భయం, దుఃఖం ఉండదు’’ అని అంతిమ దివ్యగ్రంథమైన ఖుర్‌ఆన్‌ స్పష్టం చేస్తోంది. ‘‘విశ్వాసులు ఒకరికొకరు స్నేహితులు, శ్రేయోభిలాషులు. వారు ప్రజలకు మంచి విషయాలు బోధిస్తారు. చెడ్డ విషయాల నుంచి వారిస్తారు. నమాజ్‌ చేస్తారు. జకాత్‌ చెల్లిస్తారు. అల్లాహ్‌ పట్ల, ఆయన ప్రవక్త పట్ల వినయవిధేయతలతో మసలుకుంటారు. వారిపై దైవ కారుణ్యం వర్షిస్తుంది’’ అని చెబుతోంది.

జకాత్‌ అంటే ‘పవిత్రత, పరిశుద్ధత’ అనే అర్థాలు ఉన్నాయి. రంజాన్‌ మాసానికి సంబంధించిన పరిభాషలో చెప్పాలంటే... ధనికుడైన వ్యక్తి పవిత్రుడయ్యే ఉద్దేశంతో ఏడాదికి ఒకసారి తన సంపద నుంచి రెండున్నర శాతం చొప్పున పేదల కోసం, ధర్మ కార్యాల కోసం చేసే ధన, కనక, వస్తు రూప దానాలను ‘జకాత్‌’ అంటారు. ‘‘జకాత్‌ చెల్లింపును ముస్లింలకు అల్లాహ్‌ విధిగా నిర్దేశించాడు. దీన్ని ధనికుల నుంచి వసూలు చేసి, నిరుపేదలకు అందజేయడం జరుగుతుంది’’ అని హదీస్‌ గ్రంథం పేర్కొంది. దివ్య ఖుర్‌ఆన్‌, హదీస్‌ గ్రంథాల ప్రకారం... జకాత్‌ పేద ప్రజల హక్కు అని స్పష్టంగా తెలుస్తోంది. ఇస్లాం సౌధానికి ఉండే అయిదు మూల స్తంభాలలో... విశ్వాస ప్రకటన, నమాజ్‌ తరువాత మూడో స్తంభంగా జకాత్‌ పరిగణన పొందుతోంది. దివ్య ఖుర్‌ఆన్‌లో కనీసం 32 చోట్ల హదీస్‌ ప్రస్తావన ఉంది. ఇది కూడా జకాత్‌కు ఎంత ప్రాముఖ్యత ఉందో తెలియజేస్తోంది. జకాత్‌ చెల్లించనివారు ఋజు మార్గాన్ని (సక్రమమైన మార్గాన్ని) పొందలేరనీ, ఒక వేళ పొందినా అందులో స్థిరంగా ఉండలేరనీ కూడా ఖుర్‌ఆన్‌ బోధనలు చెబుతున్నాయి. జకాత్‌ చెల్లించని ముస్లింలపై ఖలీఫా హజ్రత్‌ అబూబకర్‌ యుద్ధానికి సిద్ధమయ్యారు. దీన్నిబట్టి జకాత్‌ ఎంత ముఖ్యమైన కార్యమో తెలుస్తోంది. సంపద నుంచి జకాత్‌ తియ్యకుండా... అందులోనే కలిపి ఉంచితే... అది ఆ సంపదను నాశనం చేస్తుందని దైవ ప్రవక్త మహమ్మద్‌ హెచ్చరించారు.

మహమ్మద్‌ వహీదుద్దీన్‌

Updated Date - Mar 22 , 2024 | 04:09 AM