Share News

కంటెంట్‌తో ఫిదా చేస్తోంది

ABN , Publish Date - Mar 24 , 2024 | 03:24 AM

‘కంటెంట్‌ ఉన్నోడికి కటౌట్‌ చాలు’... పవన్‌కల్యాణ్‌ ‘గబ్బర్‌సింగ్‌’లో బ్రహ్మానందం డైలాగ్‌. పక్కనున్న కటౌట్‌ అలాంటిదే. ఫుడ్‌, ట్రావెల్‌ కంటెంట్‌లో ఈమెను కొట్టినవారు దేశంలోనే లేరు. అందుకే ప్రధాని మోదీ నుంచి ఇటీవల ‘బెస్ట్‌ ట్రావెల్‌ క్రియేటర్‌’ అవార్డు అందుకుంది. ఒక రిక్షా కార్మికుడి కూతురు... ఉన్నత చదువులు చదివి... దేశదేశాలు తిరుగుతూ...

కంటెంట్‌తో ఫిదా చేస్తోంది

‘కంటెంట్‌ ఉన్నోడికి కటౌట్‌ చాలు’...

పవన్‌కల్యాణ్‌ ‘గబ్బర్‌సింగ్‌’లో బ్రహ్మానందం డైలాగ్‌. పక్కనున్న కటౌట్‌ అలాంటిదే.

ఫుడ్‌, ట్రావెల్‌ కంటెంట్‌లో ఈమెను కొట్టినవారు దేశంలోనే లేరు.

అందుకే ప్రధాని మోదీ నుంచి ఇటీవల ‘బెస్ట్‌ ట్రావెల్‌ క్రియేటర్‌’ అవార్డు అందుకుంది.

ఒక రిక్షా కార్మికుడి కూతురు... ఉన్నత చదువులు చదివి... దేశదేశాలు తిరుగుతూ...

భారతీయ సంస్కృతిని, వారసత్వాన్ని ఘనంగా ప్రపంచానికి పరిచయం చేస్తోంది.

‘కర్లీ టేల్స్‌’ యూట్యూబ్‌ చానల్‌ కామియా జాని కథ ఇది...

ఎన్నో ప్రత్యేకతలు...

చదువుతూనే ఫ్రీలాన్స్‌ జర్నలిస్ట్‌గా 2006లో కెరీర్‌ ప్రారంభించిన కామియా... ఆ తరువాత పలు ప్రముఖ టీవీ చానళ్లలో రిపోర్టర్‌గా, యాంకర్‌గా పని చేసింది. ఉద్యోగంలో భాగంగా విభిన్న రంగాలు, వ్యక్తులు, ప్రాంతాలకు సంబంధించి ఎన్నో పరిశోధనాత్మక కథనాలు రాసింది. కార్పొరేట్‌ లైఫ్‌స్టయిల్‌, ట్రావెలింగ్‌, పర్సనల్‌ ఫైనాన్స్‌, ఆరోగ్యం, ఫిట్‌నెస్‌... ఒకటని లేదు... ఏ విషయం అయినా అద్భుతమైన కంటెంట్‌ ఇవ్వడం ఆమె ప్రత్యేకత. ఈ అనుభవమే కామియాకు ఎన్నో అంశాలపై పట్టు రావడానికి కారణమైంది. సంకోచం లేకుండా ఎక్కడికైనా వెళ్లగలగడం, అనర్గళంగా, సూటిగా మాట్లాడగలగడం... ఇలా ఎన్నో ప్రత్యేకతలు సంతరించుకుంది.

ఢిల్లీలోని భారత మండపం. సృజనకు రెక్కలు తొడిగినవారు... వినోదంతో విజ్ఞానాన్ని పంచేవారు... పర్యావరణ, సమాజ హితం కోసం తమ వంతు పాత్ర పోషిస్తున్నవారు... వివిధ రంగాల్లో రాణిస్తూ... సానుకూల మార్పు దిశగా చైతన్యం రగిలిస్తున్న ఇరవై మూడు మంది అక్కడ ఆశీనులయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ పేరు పేరునా వారిని పలుకరిస్తూ... భుజం తట్టారు. వారందరికీ ‘నేషనల్‌ క్రియేటర్స్‌ అవార్డు’లు అందించి, అభినందించారు. ఆ ఇరవై మూడు మందిలో ఒకరే 32 ఏళ్ల కామియా జాని. ‘బెస్ట్‌ ట్రావెల్‌ క్రియేటర్‌’గా అవార్డు అందుకున్న ఆమె... ఆ క్షణం ఎంతో భావోద్వేగానికి లోనైంది. తను ఎక్కడ మొదలైంది? ఎక్కడికి వచ్చి నిలబడింది! ఒక్కసారిగా తన గతం కళ్లముందు తిరిగింది ఆమెకు.

పేద కుటుంబం నుంచి..: ముంబయికి చెందిన కామియాకు మొదటి నుంచీ కొత్త ప్రదేశాల గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి. ఆమె తండ్రి మోహన్‌ రిక్షా కార్మికుడు. తల్లి పూనమ్‌ గృహిణి. కూతురు ఉత్సాహాన్ని గ్రహించిన ఆమె... ఉన్నంతలో ప్రోత్సహిస్తూ వచ్చారు. తల్లి ప్రోద్బలం, అండతోనే కామియా చదువుపై శ్రద్ధ పెట్టింది. పాఠశాల విద్యాభ్యాసం పూర్తయ్యాక ‘ఆర్‌డీ నేషనల్‌ కాలేజీ’లో మాస్‌ మీడియా చదివింది. తరువాత ‘జీజే అద్వానీ కాలేజీ’లో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసింది. చదువుకొనే రోజుల్లో అవకాశం దొరికినప్పుడల్లా కొత్త ప్రాంతాలు చుట్టివచ్చేది. ఏదైనా ఊరుకు వెళితే అక్కడి సంస్కృతి, సంప్రదాయాలు, ఆహారపు అలవాట్ల గురించి తెలుసుకోవడం అలవాటుగా మారింది. రొటీన్‌కు భిన్నమైన జీవితాన్ని గడపాలనేది కామియా ఆకాంక్ష.

యూట్యూబ్‌ చానల్‌తో..: 2016లో కామియా జీవితం ఊహించని మలుపు తిరిగింది. ట్రావెలింగ్‌పై ఉన్న మక్కువతో ‘కర్లీ టేల్స్‌’ పేరిట యూట్యూబ్‌ చానల్‌ ప్రారంభించింది. ఫుడ్‌, ట్రావెలింగ్‌కు సంబంధించి వీడియోలు పోస్ట్‌ చేయడం మొదలుపెట్టింది. అలా నెలలు తిరక్కుం డానే చానల్‌ పాపులర్‌ అయిపోయింది. 30 లక్షల మంది ఈ చానల్‌ను సబ్‌స్ర్కైబ్‌ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 15 లక్షలమంది, ఫేస్‌బుక్‌లో 36 లక్షలమంది ఫాలో అవుతున్నారు. 2019లో ‘ది మోస్ట్‌ ఇన్‌ఫ్లుయన్షియల్‌ కంటెంట్‌ మార్కెటింగ్‌ ప్రొఫెషనల్‌’ అవార్డు గెలుచుకున్న కామియా... తన చానల్‌ను ఒక కంపెనీగా మార్చేసింది.

దానికి తనే చీఫ్‌ ఎడిటర్‌. సినీ, రాజకీయ, క్రీడారంగ ప్రముఖులు ఎందరితోనో కలిసి భోజనం చేసి, వారికి ఇష్టమైన రుచులను నెటిజనులకు పరిచయం చేసింది. అలాగే దేశంలోని ప్రముఖ దేవాలయాలను, అక్కడి ఆచారాలను చూపించింది. ఇప్పటికి 40 దేశాల్లో 123 నగరాలు చుట్టివచ్చిన ఆమె... ‘మిగిలిన ప్రపంచాన్ని కూడా త్వరలోనే చూపిస్తా’ అని తన అభిమానులకు చెబుతోంది.

Updated Date - Mar 24 , 2024 | 03:24 AM