Share News

యోగే అత్యున్నతుడు

ABN , Publish Date - May 24 , 2024 | 05:23 AM

‘‘తపస్వికన్నా, శాస్త్ర జ్ఞాని కన్నా, కర్మలను ఆచరించేవాడికన్నా ఉన్నతుడు. కాబట్టి ఓ అర్జునా! యోగివి కావడానికి ప్రయత్నించు. యోగుల్లో, ఎల్లప్పుడూ నా మీదే మనసులను ఎవరు లగ్నం చేస్తారో, గొప్ప శ్రద్ధతో, సమర్పణ భావంతో నా భక్తిలో నిమగ్నమవుతారో, వారిని అత్యంత

యోగే అత్యున్నతుడు

‘‘తపస్వికన్నా, శాస్త్ర జ్ఞాని కన్నా, కర్మలను ఆచరించేవాడికన్నా ఉన్నతుడు. కాబట్టి ఓ అర్జునా! యోగివి కావడానికి ప్రయత్నించు. యోగుల్లో, ఎల్లప్పుడూ నా మీదే మనసులను ఎవరు లగ్నం చేస్తారో, గొప్ప శ్రద్ధతో, సమర్పణ భావంతో నా భక్తిలో నిమగ్నమవుతారో, వారిని అత్యంత స్థితప్రజ్ఞులుగా నేను పరిగణిస్తాను’’ అని ‘తపస్విభ్యోధికో యోగి’, ‘యోగినా మపి సర్వేషాం’ అనే గీతా శ్లోకాలలో శ్రీకృష్ణుడు చెప్పాడు.

యోగుల వివిధ లక్షణాలను వివిధ సందర్భాల్లో శ్రీకృష్ణుడు వివరించాడు. వీటిలో ధ్రువణాలను అధిగమించడం (ద్వంద్వాలకు అతీతంగా ఉండడం- ద్వంద్వాతీతం), గుణాలను అధిగమించడం (గుణాతీతం), గుణాలే అసలైన కర్తలనీ, తను కేవలం సాక్షిని మాత్రమేననీ గ్రహించడం, శత్రువునైనా, మిత్రుడినైనా ఒకేలా చూడడం, పొగడ్తనైనా, విమర్శనైనా ఒకేలా తీసుకోవడం (సమత్వం), ఫలాన్ని ఆశించని యజ్ఞంలాంటి పనులను (నిష్కామ కర్మలను) చేయడం, కర్మ ఫలాపేక్షను వదులుకోవడం లాంటివి ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఒక యోగి తన ఆత్మలోనే ఆనందాన్ని వెతుక్కుంటాడు, ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తాడు. ఏదైనా ఉన్నతమైనదాన్ని సాధించాలనే లక్ష్యంతో కఠినమైన క్రమశిక్షణతో ప్రయత్నించేవాడు, త్యాగాలు చేసేవాడు తపస్వి. సాధారణమైన వ్యక్తులెవరూ సాధారణ జీవనయానంలో చేయలేని దాన్ని తపస్వులు చేస్తారు కాబట్టి ప్రశంసాపాత్రులవుతారు. కానీ, దేన్నో సాధించాలనే కోరిక మాత్రం ఇంకా అలాగే ఉంటుంది. అయితే... పరమాత్మను చూడాలనే కోరికతో సహా అన్ని వాంఛలనూ వదులుకోనేవాడు యోగి. ఆ లక్షణమే యోగి కన్నా తపస్విని తక్కువ స్థాయిలో ఉంచుతుంది.


శాస్త్రజ్ఞాని అంటే విజ్ఞానాన్ని సంపాదించాలనే సంకల్పం కలిగినవాడు. చివరకు ఈ లక్షణం కూడా లోకుల మెప్పును పొందుతుంది, ఎందుకంటే అతనికి సాధారణ వ్యక్తికన్నా ఎక్కువ విషయాలు తెలుసు. కానీ అన్నీ తనలోనే ఉన్నాయనీ, తనే అన్నిటిలోనూ ఉన్నాడనీ తెలియాలి. ఇది తెలుసుకున్నాక భ్రమలన్నీ తొలగిపోతాయి. ఈ సత్యాన్ని తెలుసుకుంటే... అంతకు మించి తెలుసుకోవాల్సినది ఇంకేమీ ఉండదనీ యోగి గ్రహిస్తాడు. కర్మ బంధాలు అతణ్ణి కట్టి ఉంటలేవు. కాబట్టి అందరికన్నా యోగి అత్యున్నతుడు.

కె. శివప్రసాద్‌ ఐఎఎస్‌

Updated Date - May 24 , 2024 | 05:23 AM