Navya: ఏడు చక్రాల జాగృతితో... అనంతమైన ఆనందం
ABN , Publish Date - Jun 07 , 2024 | 12:03 AM
భగవంతుడు అంటే ప్రేమ’ అని మనం వింటూ ఉంటాం. ఎందరో దాని గురించి వర్ణించారు. కానీ స్వయంగా అనుభూతి చెందకుండా... భగవత్ స్వరూపమైన ప్రేమలోని ఆనందాన్ని అనుభవించలేం

సహజయోగ
భగవంతుడు అంటే ప్రేమ’ అని మనం వింటూ ఉంటాం. ఎందరో దాని గురించి వర్ణించారు. కానీ స్వయంగా అనుభూతి చెందకుండా... భగవత్ స్వరూపమైన ప్రేమలోని ఆనందాన్ని అనుభవించలేం. దాన్ని ఆస్వాదించే యంత్రాంగాన్ని భగవంతుడే మనలో పొందుపరిచాడు. ఆ యంత్రాంగమే అంతర్గత సూక్ష్మవ్యవస్థ. అది మనలో ఏడు పొరలుగా పని చేస్తుంది. అవి మనలోని శక్తి కేంద్రాలు. వాటిని చక్రాలుగా యోగశాస్త్రం అభివర్ణించింది.
మూలాధార చక్రం: మొదటి శక్తి కేంద్రమైన మూలాధారచక్రం మనలోని విసర్జనావయాలమీద ప్రభావం చూపిస్తుంది. విసర్జన క్రియ తరువాత మనకు చాలా ఉపశమనం కలుగుతుంది. ఆ ఉపశమనం మనకు ఆనందాన్ని ఇస్తుంది. ఇది చాలా చిన్న విషయమే. కానీ ప్రధానమైనది. అయితే... మనలోని ఎన్నో లోతైన, సున్నితమైన విషయాలవల్ల కలిగే ఆనందాన్ని ఈ ఆనందం అధిగమించకుండా ఉండాలంటే... మనలో నిర్మలమైన మనస్తతత్వం ఉండాలి. అది శ్రీగణేశుని సహజ లక్షణం. సహజయోగ సాధనతో మూలాధార చక్రాన్ని శుద్ధి చేసుకోవడం ద్వారా ఈ గుణాన్ని వృద్ధి చేసుకోవచ్చు.
స్వాధిష్టాన చక్రం: ఇది రెండవ పొర. సృజనాత్మకత వల్ల కలిగే ఆనందానికి సంబంధించినది. కొందరు రచన ద్వారా, కళల ద్వారా ఏదైనా సృష్టించడం ముఖ్యమనుకుంటారు. ఈ సృజనాత్మకతకు హేతుబద్ధమైన ఆలోచన తోడైతే... తాము అందరికన్నా గొప్పవారమని గర్వపడతారు. ఇది సరైన ఆలోచన కాదు. ఈ రెండవ పొరను అధిగమించాలంటే నిర్విచార స్థితిలోకి వెళ్ళాలి. మన అవగాహన ప్రకాశవంతమైనప్పుడే ఇది సాధ్యమవుతుంది. అప్పుడు మనం దేన్ని సృష్టించినా... దాన్ని ఆనందిస్తాం. మనలోని శ్రీబ్రహ్మదేవ సరస్వతీతత్త్వాన్ని జాగృతపరచడం వల్లనే ఇది సాధ్యమవుతుంది. నాభి లేదా మణిపూర చక్రం: ఆకలితో ఉన్నప్పుడు ధ్యానంలో సరిగ్గా కూర్చోలేం. మంచి ఆహారం తిన్నప్పుడు ఆనందం కలుగుతుంది. అయితే ఈ ఆనందం తాత్కాలికమే. ఎందుకంటే దేన్నైనా సంపూర్ణంగా ఆనందించినప్పుడు... మళ్ళీ కావాలని కోరుకోకుండా ఉండాలంటే, ఆ ఆనందం శాశ్వతం కావాలనుకుంటే... సంతృప్తి ఒక్కటే మార్గం. రెండు ముద్దలు తిన్నా సంతృప్తి చెందాలి. మనలో వస్తు సంబంధమైన కోరికలకు అంతులేదు. ఇంకా ఇంకా కావాలనుకుంటాం. ఏదీ సంపూర్ణంగా ఆనందించలేం. దీనివల్ల నాభిచక్రం అలజడికి లోనవుతుంది. దాన్ని అరికట్టే మార్గం సంతృప్తే. అది పొందాలంటే ఆత్మసాక్షాత్కారం పొందాలి. నిత్య ధ్యాన సాధన ద్వారా మనలోని శ్రీలక్ష్మ్మీనారాయణ శక్తిని జాగృతం చేసుకోవడం ద్వారా ఇది సాధ్యపడుతుంది.
అనాహత చక్రం: మనలో ఉండే చక్రాలలో చాలా ముఖ్యమైనది అనాహత లేదా హృదయ చక్రం. దీనిలోని విశిష్టత... భద్రత. మీలో భద్రతా భావాన్ని అనుభూతి చెందడం. అది ఆత్మసాక్షాత్కారం పొందితేనే జరుగుతుంది. మీకు సంబంధించి సంపూర్ణమైన భద్రతతో ఉండేది మీలోని ఆత్మ మాత్రమే. దాన్ని మీరు ఆస్వాదించినప్పుడు కలిగే ఆనందం... మిమ్మల్ని ఆధ్యాత్మికమైన లోతులకు తీసుకువెళ్తుంది. భగవంతుడి మీద విశ్వాసాన్ని మీ హృదయ చక్రంలో పదిలపరచుకోండి. ఆ విశ్వాసమే రక్షణలోని ఆనందాన్నిస్తుంది. అందుకోసం మన హృదయంలో జగదంబ అయిన దుర్గాదేవిని స్థిరపరుచుకోవాలి.
విశుద్ధి చక్రం: విశుద్ధ చక్రాన్ని... విశుద్ధి, హంస చక్రాలు అని రెండుగా విభజించవచ్చు. విశుద్ధి చక్రం అంటే విరాట్ స్వరూపమైన చక్రం. ప్రతివారిలోని ఆత్మను మనం అనుభూతి చెందాలి. అప్పుడే విశ్వవ్యాపితమైన మాధుర్యం, సంబంధ బాంధవ్యాల్లో ఉండే మాధుర్యం మనకు తెలుస్తాయి. ఈ సామూహిక చేతనను, విశ్వజనీతనను అనుభూతి చెందినప్పుడు... ఆ విరాట్ స్వరూపంలో అంతర్భాగం అవుతాం. అన్నిటికీ సాక్షిగా ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. దీన్ని పొందాలంటే... సహజయోగ సాధన ద్వారా... శ్రీకృష్ణుడి గుణగణాలను మనలో స్థిరపరచుకోవాలి. ఇక హంస చక్రం... విశుద్ధ చక్రంలో భాగం. హంస పాలను, నీటిని విడదీయగలిగినట్టు... ఈ చక్రం మనలో విచక్షణాభావాన్ని పెంపొందిస్తుంది.
ఆజ్ఞా చక్రం: కాంతి లేదా ప్రకాశం అనేవి ఈ చక్రం తాలూకు తత్త్వం. ఇది మన చిత్తాన్ని తేజోవంతం చేస్తుంది. ఆత్మసాక్షాత్కారం తరువాత... మనం ప్రతిదాన్నీ ఈ కాంతి ద్వారానే చూస్తాం. మనమే కాంతి అనీ, శాశ్వతమైన ప్రకాశం అనీ తెలుసుకుంటాం. ఈ విషయం అర్థమైనప్పుడు... మనలోని భయాలు, మనల్ని తమ ఆధీనంలో ఉంచుకోవడానికి ప్రయత్నం చేసే శక్తులు క్షణంలో అదృశ్యమవుతాయి. ఆజ్ఞాచక్రం తాలూకు ఆనందాన్ని మనలోకి ఆహ్వానించినప్పుడు... మనలోని కాంతి నిశ్చలమవుతుంది. ఆత్మప్రకాశం కలిగినప్పుడు... ప్రపంచాన్నంతటినీ మనలోనే చూసుకోగలం. ఇది సహజయోగతో సాధ్యమవుతుంది.
సహస్రార చక్రం: మన శరీరంలోని సూక్ష్మనాడీ వ్యవస్థలో ఆఖరి చక్రం సహస్రారం. ఇది చాలా కీలకమైనది. మొత్తం ఏడు చక్రాలూ వాటి పీఠాలను అక్కడే కలిగి ఉన్నాయి. ఈ పీఠాలు ఆనందాన్ని స్వీకరించి, హృదయానికి అందిస్తాయి. మనం ధ్యానం ద్వారా సహస్రార చక్రాన్ని చేరుకోగలగాలి. ఆత్మసాక్షాత్కారం పొందిన తరువాత సహస్రార చక్రం జాగృతం అవుతుంది. శ్రీలలితా సహస్రనామంలో పేర్కొన్న విధంగా... దేవి అక్కడే మహామాయగా ఉంటుంది. ఇలా మనలోని ఏడు చక్రాల్లోని శక్తిని జాగృతం చేసుకున్నప్పుడు... అనంతమైన ఆనందం మన సొంతం అవుతుంది.
(శ్రీమాతాజీ నిర్మలాదేవి ప్రసంగాల ఆధారంగా)
డాక్టర్ పి. రాకేష్ 8988982200
‘పరమ పూజ్యశ్రీ మాతాజీ నిర్మలాదేవి,
సహజయోగ ట్రస్ట్’, తెలంగాణ