గుడికి ఎందుకు వెళ్లాలంటే..
ABN , Publish Date - Sep 20 , 2024 | 05:24 AM
ఆలయాలకు వెళ్ళడం, అక్కడ కొలువుతీరిన దేవతామూర్తులను పూజించడం అనాది హిందూ సంప్రదాయం.పవిత్ర క్షేత్రాల్లో వేల ఏళ్ళ నాటి ఆలయాలు మొదలు వీధుల్లో ఉండే చిన్న గుడుల వరకూ... ప్రజల హృదయాల్లో ఆధ్యాత్మిక భావనలను నింపడానికి దోహదం చేస్తూనే ఉన్నాయి.
ఆలయాలకు వెళ్ళడం, అక్కడ కొలువుతీరిన దేవతామూర్తులను పూజించడం అనాది హిందూ సంప్రదాయం.పవిత్ర క్షేత్రాల్లో వేల ఏళ్ళ నాటి ఆలయాలు మొదలు వీధుల్లో ఉండే చిన్న గుడుల వరకూ... ప్రజల హృదయాల్లో ఆధ్యాత్మిక భావనలను నింపడానికి దోహదం చేస్తూనే ఉన్నాయి. అయితే దైవం అంతటా ఉన్నప్పుడు, ఆ దైవాన్ని ఎక్కడైనా, ఏ రూపంలోనైనా పూజించే వెసులుబాటు ఉన్నప్పుడు ఆలయాలకు వెళ్ళవలసిన అవసరం ఏముందనే ప్రశ్న కూడా ఈనాటిది కాదు.
దీనికి ‘ప్రశాంతత కోసం, ఉత్తమమైన ఆలోచనల కోసం’ అనేది సామాన్యంగా వినిపించే జవాబు.
కానీ ఆలయాలను ఎందుకు దర్శించాలనే ప్రశ్నకు శాస్త్రీయమైన కారణాలను కూడా ప్రాచీన గ్రంథాలు వివరించాయి.
శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాల ద్వారా మనిషి జ్ఞానాన్ని పొందుతాడు. చెవులు, చర్మం, కళ్ళు, నాలుక, ముక్కు అనే అయిదు
ఇంద్రియాల ద్వారా ఇది జరుగుతుంది. కాబట్టి వాటిని ‘జ్ఞానేంద్రియాలు’ అంటారు. ఆలయంలోని వాతావరణం వల్ల అవన్నీ
ఉద్దీపన చెందుతాయి. అక్కడ ఉన్న పాజిటివ్ ఎనర్జీని మనలోకి నింపుతాయి.
గర్భగుడిలో ప్రవేశించినప్పుడు... గంట మోగిస్తాం. మన మెదడులోని కుడి, ఎడమ భాగాలు ఏకత్వాన్ని పొందే విధంగా శబ్దాన్ని వెలువరించేలా ఈ గంటలను తయారు చేస్తారు. మనం గంట మోగించినప్పుడు... నిశితమైన, స్థిరమైన శబ్దం వస్తుంది. ఆ శబ్దం కనీసం ఏడు సెకెన్లపాటు ప్రతిధ్వనిస్తుంది. మన శరీరంలోని ఏడు నాడుల్ని జాగృతం చెయ్యడానికి ఈ ప్రతిధ్వని వ్యవధి సరిపోతుంది. ఫలితంగా మన మెదడులోని ప్రతికూల ఆలోచలన్నీ తొలగిపోతాయి.
గర్భగుడిలో... సాధారణంగా చీకటిగా ఉండే చోట దైవ విగ్రహాన్ని ఉంచుతారు. చాలామంది కళ్ళు మూసుకొని దేవుణ్ణి ప్రార్థిస్తారు. మీరు కళ్లు తెరవగానే విగ్రహం ముందున్న హారతి పళ్లెంలో వెలుగుతున్న కర్పూరాన్ని చూడాలి. చీకటిగా ఉండే చోట కనిపించే ఆ వెలుగు నేత్రాలను జాగృతం చేస్తుంది. కర్పూర హారతిని కళ్ళకు అద్దుకున్నప్పుడు... మీ చేతులు వెచ్చగా అవుతాయి. ఆ చేతులను మీ కళ్ళ మీద ఉంచుకున్నప్పుడు... మీ స్పర్శా శక్తి జాగృతం అవుతుంది.
ఆలయంలో దేవుడికి పుష్పాలు సమర్పిస్తాం. చూడడానికి అందంగా, మంచి పరిమళం వెదజల్లుతూ, మెత్తని స్పర్శతో, రుచికరమైన తేనెతో ఉన్న పుష్పాలను దైవ పూజకు ఉపయోగించాలని చెప్పాయి శాస్త్రాలు. పూలు, కర్పూరం, అగరువత్తుల సువాసనలు కలిసి మీ ఘ్రాణేంద్రియాలను
(వాసన చూసే ఇంద్రియాలను) జాగృతం చేస్తాయి. మనసులో ప్రశాంతమైన భావన కలిగిస్తాయి.
గుడిలో తీర్థాన్ని వెండి లేదా రాగి పాత్ర నుంచి ఉద్ధరణితో తీసి ఇస్తారు. తీర్థంలో తులసి ఆకులు వేస్తారు. అవి కనీసం ఆ పాత్రలో ఏడెనిమిది గంటలు ఉంటాయి. రాగి పాత్రలో నిల్వ చేసిన నీటికి శరీరంలో వాత, కఫ, పిత్తాలనే త్రిదోషాలను సమతుల్యం చేసే శక్తి ఉందని, అది పాజిటివ్‌గా ఛార్జ్ అయిన నీరు అని ఆయుర్వేదం చెబుతోంది. అలాగే తులసి ఆకు ఉంచిన నీరు తాగడం వల్ల రుచి చూసే శక్తి (రస జ్ఞానం) జాగృతం అవుతుంది. నోటి పూత, గొంతు నొప్పి, జలుబు, దగ్గు, ఊపిరి తిత్తుల సమస్యలు తదితర అనేక సమస్యలకు రాగి పాత్రలో ఉంచిన తులసి నీరు మంచి పరిష్కారం.
ఆలయంలో ప్రదక్షిణ చేయడం కూడా ఒక ఆనవాయితీ. గర్భగుడి చుట్టూ తిరుగుతున్నప్పుడు...
ఘంటానాదాలతో, చేతులతో పట్టుకున్న పూలతో, దీపాలు, దేవతామూర్తుల దర్శనంతో, తీర్థసేవనంతో,
కర్పూరాది పరిమళాలతో... మన పంచేంద్రియాల్లో కలిగిన జాగృతి స్థిరపడుతుంది.
ఆలయాలను ప్రత్యేకంగా ఎంపికచేసిన ప్రదేశాల్లో, పాజిటివ్ ఎనర్జీ ఉండే చోట నిర్మిస్తారు.
దేవుని విగ్రహం ఆలయం మధ్యలో... గర్భగుడిలో ఉంటుంది. విగ్రహానికి సంప్రదాయబద్ధంగా, వైదిక ప్రక్రియలో ప్రాణప్రతిష్ఠ చేస్తారు. దాని చుట్టూ ఉన్న ప్రదేశమంతటా అయస్కాంత, విద్యుత్
తరంగాలు నెలకొని ఉంటాయి. అవి నెగెటివ్ ఎనర్జీని తొలగిస్తాయి. దైవదర్శనానికి వచ్చిన భక్తుల్లో పాజిటివ్ ఎనర్జీని నింపుతాయి. వారి దృక్పథంలో మార్పునకు దోహదం చేస్తాయి.
రెండు కనుబొమ్మలకు మధ్య ఉన్న భాగాన్ని ‘భ్రూమధ్యం’ అంటారు. అది మానవ శరీరంలో అత్యంత కీలకమైన నాడీ కేంద్రం. అది ఎప్పుడూ శక్తిని వెదజల్లుతూనే ఉంటుందని యోగశాస్త్రం చెబుతోంది. ఆ శక్తి నష్టపోకుండా ఉండడానికి... తిలకం లేదా కుంకుమ ధరించడాన్ని మన పూర్వీకులు
తప్పనిసరి చేశారు. దానివల్ల మానవ శరీరంలోని శక్తి నిలిచి ఉంటుంది. ఏకాగ్రత కలుగుతుంది. కనుబొమ్మల మధ్యలో... కుంకుమను ధరించినప్పుడు... అక్కడ ఉండే ఆజ్ఞా చక్రం దానంతట అదే నొక్కుకుంటుంది. తద్వారా ముఖ కండరాలకు రక్త సరఫరా
మెరుగుపడుతుంది. ఈ విధంగా ఆలయ దర్శనం వల్ల ఆధ్యాత్మిక ప్రయోజనాలే కాదు... ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎన్నో.
ఆలయంలో ప్రవేశించేటప్పుడు పాదరక్షలను బయట విడిచిపెట్టాలనేది కచ్చితమైన నియమం. అక్కడ నేల పాజిటివ్ వైబ్రేషన్స్‌కు వాహకంగా ఉంటుంది. పాదాల నుంచి ఆ పాజిటివ్ వైబ్రేషన్లు శరీరం మొత్తానికి వ్యాపిస్తాయి. కాబట్టే ఆలయంలోకి చెప్పులు లేకుండా వెళ్ళాలనే నియమం పెట్టారు మన పూర్వులు. అంతేకాదు, చెప్పులకు అంటిన దుమ్ము, ధూళి, పురుగులు లాంటివి పవిత్రమైన, స్వచ్ఛమైన ఆలయ వాతావరణాన్ని నాశనం చేస్తాయి. నెగెటివ్ ఎనర్జీకి కారణం అవుతాయి.