బరువు ఇలా తగ్గాలి
ABN , Publish Date - Jan 29 , 2024 | 11:11 PM
సన్నగా మారాలనే ఉద్దేశంతో ఉపవాసాలు ఉంటారు. వ్యాయామాలు చేస్తారు. అయినా బరువు తగ్గకపోగా, నీరసం, నిస్సత్తువ ఆవరిస్తోందంటే బరువు తగ్గడం కోసం ఎంచుకున్న మార్గాలను మరోసారి విశ్లేషించాలి.
సన్నగా మారాలనే ఉద్దేశంతో ఉపవాసాలు ఉంటారు. వ్యాయామాలు చేస్తారు. అయినా బరువు తగ్గకపోగా, నీరసం, నిస్సత్తువ ఆవరిస్తోందంటే బరువు తగ్గడం కోసం ఎంచుకున్న మార్గాలను మరోసారి విశ్లేషించాలి. మరీ ముఖ్యంగా మహిళలు ఈ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి.
కడుపు మాడ్చుకుంటూ...
మహిళల్లో క్యాలరీల కోత హార్మోన్ల హెచ్చుతగ్గులకు దారి తీస్తుంది. నెలసరి క్రమం తప్పేలా చేస్తుంది. పోషకాలు తగ్గడం వల్ల పునరుత్పత్తికి తోడ్పడే హార్మోన్ల ఉత్పత్తి తగ్గి గర్భం దాల్చడంలో ఇబ్బందులు ఎదురు కావచ్చు. టోన్‌డ్ బాడీ కావాలనుకునే మహిళలు, తీసుకునే, ఖర్చుపెట్టే క్యాలరీల మధ్య సమతూకం పాటించాలి. మరీముఖ్యంగా హార్మోన్లు హెచ్చుతగ్గులు గురి కాని ఆహార నియమాలు పాటించాలి.
కార్డియోతో...
ఎక్కువ మంది కేవలం కార్డియోతోనే బరువు తగ్గవచ్చనే అపోహలో ఉంటారు. శరీరం మీద బరువు పడేలా చేసే వెయిట్ ట్రైనింగ్ వ్యాయామాలు కూడా చేస్తూ ఉండాలి. ఈ వ్యాయామాలతో ఎముకలు దృఢపడతాయి. అలాగే మజిల్ మాస్ పెంచే వ్యాయామాలు చేయాలి. ఈ వ్యాయామాల వల్ల శరీరం క్యాలరీలను శక్తి చేసే వేగం పెరుగుతుంది. ఫలితంగా శరీరంలో పేరుకుని ఉండే అదనపు కొవ్వు కరుగుతుంది.
చేతులెత్తేస్తే...
కొంత మంది మహిళలు కొద్ది వారాల్లోనే ఊహించలేనంత ఫలితాలను ఆశిస్తూ ఉంటారు. వాటిని అందుకోలేనప్పుడు చేస్తున్న ప్రయత్నాలను ఆపేస్తూ ఉంటారు. అలాగే హఠాత్తుగా ఉపవాసాలనూ, తీవ్రమైన వ్యాయామాలనూ మొదలు పెట్టేస్తూ ఉంటారు. ఈ రెండూ శరీర ఆరోగ్యానికి హాని కలిగించేవే! ఏ వ్యాయామమైనా, ఉపవాసమైనా శరీరానికి నెమ్మదిగా అలవాటు చేయాలి. ఒక క్రమపద్ధతిని అనుసరించాలి.