Share News

హైదరాబాద్‌లో వైస్రాయ్‌ పర్యటన

ABN , Publish Date - Jun 02 , 2024 | 06:14 AM

కొన్ని సంఘటనలు మనో ఫలకంపై చెరగని జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. ఈ మధ్య పాత ఆల్బమ్స్‌ చూస్తుంటే... వైస్రాయ్‌ లార్డ్‌ ఇర్విన్‌, ఆయన భార్య లేడీ ఇర్వీన్‌ హైదరాబాద్‌ పర్యటన ఫొటోలు కనిపించాయి.

హైదరాబాద్‌లో వైస్రాయ్‌ పర్యటన

కొన్ని సంఘటనలు మనో ఫలకంపై చెరగని జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. ఈ మధ్య పాత ఆల్బమ్స్‌ చూస్తుంటే... వైస్రాయ్‌ లార్డ్‌ ఇర్విన్‌, ఆయన భార్య లేడీ ఇర్వీన్‌ హైదరాబాద్‌ పర్యటన ఫొటోలు కనిపించాయి. రవి అస్తమించని బ్రిటిష్‌ సామ్రాజ్యానికి మన దేశంలో ప్రతినిధి అయిన వైస్రాయ్‌కు ఆ రోజుల్లో విశేషమైన పలుకుబడి ఉండేది. ఆయనను కలవడానికి రాజులు, మహారాజులు పోటీ పడేవారు.

లార్డ్‌ ఇర్విన్‌ పర్యటనకు ముందే హైదరాబాద్‌ నగరమంతా ముస్తాబయింది. హవేలీలకు, ప్యాలెస్‌లకు రంగులు వేయించారు. కొత్త ఫర్నీచర్‌ కొన్నారు. తమ వద్ద ఉన్న ఇంగ్లీషు వంటవారితో పాశ్చాత్య వంటలు సాధన చేయించారు. వీధి దీపాలన్నిటినీ శుభ్రం చేయించారు. వీధులన్నిటినీ కడిగించారు. ఆయన ప్రయాణించే రోడ్ల చుట్టుపక్కల తుప్పలు లేకుండా శుభ్రపరిచారు. వైస్రాయ్‌కు... ఆయన కుటుంబానికి నాంపల్లి రైల్వే స్టేషన్‌లో స్వాగతం చెప్పటానికి నిజాం స్వయంగా వెళ్లారు. ఆ రోజుల్లో అది చాలా అరుదైన సంఘటన. సాధారణంగా నిజాం ఎవరికైనా స్వాగతం చెప్పాలన్నా... ఆయన ప్యాలెస్‌లోనే చెప్పేవారు. అలాంటిది వైస్రాయ్‌కు స్వాగతం పలకడానికి నిజాం స్వయంగా వస్తున్నారనే వార్త హైదరాబాద్‌లో సంచలనమైంది. నిజాం స్వాగతం చెబుతున్నాడంటే... వస్తున్న అతిథి ఇంకెంత గొప్పవాడోనని ప్రజలు గుసగుసలాడుకున్నారు. నాన్న (రాజా ధన్‌రాజ్‌ గిర్‌) కూడా వైస్రాయ్‌కు స్వాగతం చెప్పారు. నాంపల్లి స్టేషన్‌లో వైస్రాయ్‌ ప్రయాణించే ప్రత్యేక ట్రైన్‌ కోసం అందరూ ఎదురుచూశారట. వచ్చిన తర్వాత పుర ప్రముఖులందరినీ వైస్రాయ్‌కు నిజాం పరిచయం చేశారు. ఆ తర్వాత ఆయన ఫలక్‌నుమా ప్యాలెస్‌కు వెళ్లారు. అక్కడ విడిది చేశారు. ఆయన పరివారం కూడా చాలా పెద్దదే. ఒక రోజు ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఎట్‌హోమ్‌ ఏర్పాటు చేశారు. దానికి రాజ కుటుంబాల వారందరినీ ఆహ్వానించారు. మేమందరం ఎట్‌హోమ్‌కు వెళ్లాం. వైస్రాయ్‌ వెళ్లిపోయిన తర్వాత చాలా కాలం వరకూ అందరి సంభాషణల్లో ఆ పర్యటనకు సంబంధించిన మాటలే వినవచ్చేవి. వైస్రాయ్‌ పర్యటన తర్వాత కొన్ని రాజ కుటుంబాల జీవన విధానంలో మార్పులు వచ్చాయి. ఇంగ్లీషు ఫర్నీచర్‌, ఇంగ్లీషు వంటకాలు, ఇంగ్లీషు పాత్రలు ఇళ్లలోకి ప్రవేశించాయి. 1946లో మనకు స్వాతంత్య్రం రాకముందు లార్డ్‌ మౌంట్‌ బాటెన్‌ను కూడా కలిసే అవకాశం నాకు కలిగింది.

కింగ్‌ జార్జి ఢిల్లీలో దర్బార్‌ నిర్వహించినప్పుడు... భారత ఉపఖండంలో ఉన్న రాజులు, మహారాజులు తమ హోదాకు తగ్గట్టుగా తయారై వచ్చారు. ఆ దర్బారు సమయంలో నిజాంకు సంబంధించిన ఒక చిన్న కథ మా చిన్నప్పుడు చెప్పేవారు. కింగ్‌ జార్జి దర్బార్‌కు బ్రిటిష్‌ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లూ చేసింది. రాజులు, మహారాజులందరికీ వారి వారి హోదాలకు తగ్గట్టుగా సీట్లు కేటాయించారు. నిజాం ఏనుగుపై వచ్చి కింగ్‌ జార్జికి అభివాదం చేయాలి. కానీ ఆ రోజు ఏనుగు మోకాళ్ల మీద కూర్చోవ టానికి మోరాయించ డంతో నిజాం చాలాసేపు ఏనుగు అంబారీ ఎక్కలేక పోయాడు. దీనివల్ల నిజాం దర్బారుకు ఆలస్యంగా వెళ్లాడు. అంతే కాదు... నిజాం వజ్ర వైఢూర్యాలు ధరించలేదు. కానీ ఆయన భార్య, ఇతర రాజ సిబ్బంది అమూల్యమైన ఆభరణాలు ధరించారు. అక్కడకు వచ్చిన ఒక మహారాజు నిజాం దగ్గరకు వచ్చి... ‘‘మీరు ఆభరణాలు ధరించలేదు’’ అన్నాడట. అప్పుడు నిజాం ఆయనతో... ‘‘నా వెనుక చూడు’’ అన్నాడట.

రాజకుమారి ఇందిరాదేవి ధన్‌రాజ్‌గిర్‌

Updated Date - Jun 02 , 2024 | 06:14 AM