Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

Vennela Kishore Interview : కామెడీ చాలా సీరియస్‌ విషయం

ABN , Publish Date - Mar 03 , 2024 | 04:38 AM

వెన్నెల కిషోర్‌... ఈ పేరు వినబడగానే వెటకారం కళ్లముందు కనిపిస్తుంది. సాధారణంగా మీడియాకు దూరంగా ఉండే కిషోర్‌... ‘నేను చాలా ప్రైవేట్‌ పర్సన్‌ని’ అంటారు. ‘నేను రైటర్‌పై ఆధారపడ్డ యాక్టర్‌ని. నా అంతట నేను కామెడీ

Vennela Kishore  Interview : కామెడీ చాలా సీరియస్‌ విషయం

వెన్నెల కిషోర్‌... ఈ పేరు వినబడగానే వెటకారం కళ్లముందు కనిపిస్తుంది. సాధారణంగా మీడియాకు దూరంగా ఉండే కిషోర్‌... ‘నేను చాలా ప్రైవేట్‌ పర్సన్‌ని’ అంటారు. ‘నేను రైటర్‌పై ఆధారపడ్డ యాక్టర్‌ని. నా అంతట నేను కామెడీ సృష్టించలేను’ అనే వెన్నెల కిషోర్‌ నటించిన ‘చారి 116’ ఇటీవల విడుదలయింది. ఈ సందర్భంగా ఆయన ‘నవ్య’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ.

కామెడీని సృష్టించటం చాలా సీరియస్‌ విషయమా?

అవును. నేను కామెడీని కూడా సీరియస్‌ సీన్‌లాగానే తీసుకుంటా. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. నేను రైటర్‌పై ఆధారపడ్డ యాక్టర్‌ని. సీన్‌లో ఏం చేయాలనే విషయం కనీసం 50 శాతమైన రైటర్‌ నుంచి రావాలి. నా అంతట నేను కామెడీని సృష్టించలేదు. బ్రహ్మనందంగారు.. ఆలీగారు.. సునీల్‌గారు.. తాజాగా సత్యలాంటి కమేడియన్స్‌ వేరు. వాళ్లు ఇతరులను బాగా ఇమిటేట్‌ చేస్తారు. కానీ నేను అలా కాదు. టైమింగ్‌ మీద ఆధారపడ్డ నటుడిని.

కిషోర్‌... ‘వెన్నెల’ కిషోర్‌ కావటం వెనకున్న కథేమిటి?

ఈ క్రెడిటంతా దర్శకుడు దేవ కట్టకు చెందుతుంది. ‘వెన్నెల’ సినిమాకు నేను సహ రచయితను. అమెరికాలో షూటింగ్‌. ఆ సినిమాలో నేను వేసిన పాత్ర శివారెడ్డిగారు వేయాలి. కానీ ఆయనకు వీసా రిజెక్ట్‌ అయింది. అప్పటికే సీనియర్‌ యాక్టర్స్‌ అందరూ డేట్‌లు ఇచ్చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో నేను నటించా. వాస్తవానికి నటన నా గోల్‌ కాదు. ఆ సమయంలో నేను ఒక విధమైన రెక్లె్‌సగా ఉండేవాడిని. చేస్తే పోయిందేమీ లేదనుకున్నా. ఆ సినిమాలో పాత్ర కూడా రెక్లె్‌సగా ఉంటుంది. అందువల్ల బాగా నప్పింది. ఆ తర్వాత ‘ఇందుమతి, బిందాస్‌’ వంటి చిత్రాలు మంచి పేరు తెచ్చాయి. ‘దూకుడు’ తర్వాత ఉద్యోగం మానేసి నటనలో స్థిరపడిపోయా!

మీరు డైరక్టర్‌లను పూర్తిగా ఫాలో అయిపోతారా?

అవును. యాక్టర్‌ సీను గురించి ఆలోచిస్తాడు. డైరక్టర్‌ మొత్తం సినిమా గురించి ఆలోచిస్తాడు. నేను ప్రేక్షకుల కోసం నటించను. షూటింగ్‌ పూర్తయిన తర్వాత రషస్‌ చూసి డైరక్టర్‌ సంతృప్తి చెందాడా? లేదా అని మాత్రమే ఆలోచిస్తా. కిషోర్‌ బాగా చేశాడన్నా.. ఓవర్‌ యాక్షన్‌ చేశాడన్నా... అన్ని కామెంట్స్‌ డైరక్టర్‌కే చెందుతాయి. ‘గీతగోవిందం’లో అందరికీ కాళ్లు మొక్కే క్యారక్టెర్‌ నాకు ముందు పెద్దగా నచ్చలేదు. కానీ ఆ క్యారెక్టర్‌ పెద్ద హిట్‌ అయింది.

ఒకప్పుడు కామెడీ ట్రాక్‌లు ఉండేవి. ఇప్పుడు ఉండటం లేదు కదా..!

ఇప్పుడు ప్రేక్షకులు కమేడియన్స్‌ను కేవలం హాస్యం పడించేవారుగా మాత్రమే చూడటంలేదు. వాళ్లు కథను ముందుకు తీసుకువెళ్లటంలో ఒక భాగం కావాలి. హీరోయిన్‌ బ్రదర్‌ కావచ్చు.. విలన్‌ పక్కన ఉండే చెంచా కావచ్చు. కానీ వాళ్లు కథ ముందుకు సాగటంలో ముఖ్యపాత్ర వహించాలి. ప్రేక్షకులు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటారు. వారికి తగ్గట్టుగా కామెడీ ట్రాక్‌లు కూడా మారాలి. ఉదాహరణకు ఒక వ్యక్తిని బకరా చేయటం ఒకప్పుడు ప్యాషన్‌. సాధారణంగా ఈ పాత్రలు బ్రహ్మనందంగారు వేసేవారు. ప్రేక్షకులు విసిగిపోయారు. ‘లక్ష్యం’ తర్వాత బకరా క్యారెక్టర్లు హిట్‌ కావటం మానేసాయి. దీనితో రైటర్లు రాయటం మానేశారు. ఇలాగే ఎన్నారై పెళ్లికొడుకులు. ఈ ట్రాక్‌ కూడా ఈమధ్య కాలంలో కనిపించటంలేదు.

ఒక కమేడియన్‌కు ఏం కావాలి?

నా ఉద్దేశంలో టైమింగ్‌ చాలా ముఖ్యం. నేను నా డైలాగ్స్‌ మాత్రమే కాదు... ఇతరుల డైలాగ్స్‌ కూడా వింటాను. దీనివల్ల సీన్‌ చేసేటప్పుడు ఏదైనా గ్యాప్‌ వస్తే... దానిని పూరించటానికి వీలవుతుంది.

మీరు హీరో పాత్రలు వేయాలని ఎప్పుడూ అనుకోలేదా?

లేదు. ఎప్పుడూ నన్ను ఎవరైనా వెటకారం చేయాలి. నేను వేరేవాళ్లనైనా వెటకారం చేయాలి. భగ్నప్రేమికుల పాత్రలు.. అమ్మాయిల వెనక తిరిగే పాత్రలు నేను చేయలేను.

మీరు మీడియాలో ఎక్కువగా కనిపించరు...

నేను చాలా ప్రైవేట్‌ వ్యక్తిని. నా వ్యక్తిగత వివరాలు అందరితోనూ పంచుకోవటం నాకు ఇష్టం ఉండదు. విజయోత్సవ సభలకు కూడా వెళ్లను. దీనికి ఒక కారణం ఉంది. సాధారణంగా ఇలాంటి సభలకు కమేడియన్లను ఎందుకు పిలుస్తారంటే... వాళ్లు కొద్దిసేపు ప్రేక్షకులకు అలరిస్తారని. పైన చెప్పినట్లు నా అంతట నేను కామెడీ పండించలేను. ఎందుకంటే నేను స్టాండప్‌ కమేడియన్‌ను కాదు. బ్రహ్మానందంగారు, అలీగారు, బ్రహ్మాజీగారు తమ స్పీచ్‌ల ద్వారా కూడా ప్రేక్షకులను రంజిపచేయగలరు. నేను అలాంటి నటుడిని కాను. మొదట్లో ఒకటి రెండు ఫంక్షన్స్‌కు వెళ్లా. నాకు తత్వం బోధపడింది. ఇక్కడ మీకో సంఘటన చెబుతా. ఒక ప్రీరిలీజ్‌ ఫంక్షన్‌కు పేరు మోసిన కమేడియన్‌ను పిలిచారు. ఆయన తన స్పీచ్‌ మొదలుపెట్టాడు. ‘హీరోగారి కళ్లు చూస్తే చాలు... ఆయన కమిట్‌మెంట్‌ అర్థమవుతుంది’... లాంటి మాటలతో స్పీచ్‌ దంచుతున్నాడు. కింద కూర్చుని ఉన్న ప్రొడ్యూసర్‌ పైకి వచ్చి మైకు లాక్కొని... ‘నువ్వు కమేడియన్‌లా మాట్లాడు. హీరోలా మాట్లాడకు’ అన్నాడు. ఇలాంటి సంఘటనలు మనకు జరగకుండా ఉండాలంటే మనకు తెలియని విషయాలలో తల దూర్చకూడదు.

మీరు సోషల్‌ మీడియాలో కూడా ఎక్కువగా కనిపించరు..!

ఇన్‌స్టాలో మాత్రమే ఉన్నా. ఒకప్పుడు సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గానే ఉండేవాడిని. రోజుకు ఏడెనిమిది గంటలు ఫోన్‌ మీదే గడిపేవాడిని. దీనివల్ల ఒక ప్రమాదం ఉంది. ఉదాహరణకు కమేడియన్‌ సత్య... అని సెర్చ్‌ మొదలుపెట్టి... సత్య నాదెళ్ల వివరాలు తెలుసుకొని... ఆయన తినే చిరుధాన్యాల మీద పరిశోధన చేసి... ఇలా ఒక దానివెనక మరొకటి చూసుకుంటూ వెళ్లిపోతాం. ఈ విషయాన్ని గ్రహించిన తర్వాత ఫోన్‌ చూడటం మానేశా. ఈమధ్య రెండు రోజులు ఇంట్లో ఫోన్‌ వదిలేసి వెళ్లిపోయా.

మీరు విమర్శలను సహృదయంతో తీసుకొంటారా?

విమర్శలు నన్ను పెద్దగా బాధించవు. వాటిని పట్టించుకోను. అదే సమయంలో వాటిలో ఏదైనా నిజం ఉందా అనే విషయాన్ని గమనించి, గుణపాఠం నేర్చుకుంటా. నేను వచ్చిన కొత్తల్లో సోషల్‌ మీడియాలో... ‘మీరు చాలా వేగంగా మాట్లాడతారు’ అనే విమర్శ ఎక్కువగా వినిపించేది. నాకు నిజమేననిపించింది. ఆ తర్వాత రోజూ తెలుగు పేపర్‌ గట్టిగా చదివేవాడిని. కొన్ని మంత్రాలు ఉచ్ఛరించేవాడిని. అలా నా తీరు మార్చుకున్నా. టాలీవుడ్‌లో ఎక్కువ మంది విమర్శలను తీసుకోలేరు. చిన్న మాట అన్నా హర్ట్‌ అవుతారు. నేను అలా కాదు.

అమెరికా అలా వెళ్లా...

మాది కామారెడ్డి. నాన్న స్కూలు టీచర్‌. నేను ఏడో తరగతి చదువుతున్నప్పుడే రిటారైపోయారు. అంటే మాకు ఎంత గ్యాప్‌ ఉందో అర్థం చేసుకోవచ్చు. నలుగురు అక్కల తర్వాత పదేళ్లకు నేను పుట్టా. అందువల్ల అమ్మ అమ్మమ్మలాగ... అక్క అమ్మలాగ కనిపించేది. దాంతో అక్కల పట్ల గౌరవం ఎక్కువగా ఉండేది. ఇక చదువంటారా... ముందు ఎంపీసీ తీసుకున్నా. ఏడాది చదివి వదిలేశా. ఆ తర్వాత బైపీసీ తీసుకుని రెండేళ్లు చదివా. ఎంసెట్‌ రాదనిపించింది. బీకాం చేశా. ఆ తర్వాత అమెరికాకు వెళ్లాలనిపించింది. కానీ అమెరికాకు వెళ్లాలంటే 16 ఏళ్ల చదువు కావాలి. నాలాంటివాళ్ల కోసమే అన్నట్లు అప్పట్లో ఒక ఏడాది కోర్సు ఉండేది. ఆ తర్వాత దాన్ని బ్యాన్‌ చేశారు. ఆ కోర్సు చేసేసి అమెరికా వెళ్లి చదువుకొని... ఉద్యోగం తెచ్చుకున్నా.

పక్కా తెలంగాణ...

నేను పుట్టి పెరిగింది కామారెడ్డిలో. అంటే పక్కా తెలంగాణవాడిని. ‘బిందాస్‌’ సినిమా దాకా నాకు విపరీతమైన తెలంగాణ యాస ఉండేది. డైలాగ్‌లు చెప్పటం కూడా కష్టంగానే ఉండేది. ‘దూకుడు’లో శ్రీను వైట్ల నాకు ఒక భిన్నమైన పాత్ర ఇచ్చారు. మొదట చేయలేననుకున్నా. కానీ శ్రీను వైట్ల గారి ట్రైనింగ్‌లో చేసేశా. ఇప్పుడు నా యాస చూసి మా అక్కావాళ్లు... ‘ఒరేయ్‌.. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావ్‌’ అంటూ ఉంటారు. ఇప్పుడు నేను తెలంగాణ వాడినని చెప్పినా ఎవరూ నమ్మరు. మీకో ఆసక్తికరమైన సంఘటన చెబుతా. ‘జాతిరత్నాలు’ తీసిన అనుదీప్‌ అసిస్టెంట్‌ ఒకరు సినిమా చేయాలనుకున్నాడు. నా దగ్గరకు వచ్చి... ‘సార్‌.. ఇది ఒక ఛాలెంజింగ్‌ రోల్‌. సినిమా మొత్తం తెలంగాణ యాసలోనే మాట్లాడాలి’ అన్నాడు. నాది పక్కా తెలంగాణ అని చెబితే షాక్‌ అయ్యాడు.

రెన్యూవల్‌ చేసుకోవాలి...

వెబ్‌ సిరీ్‌సలు.. ఓటీటీ సినిమాలవల్ల ప్రస్తుతం కమేడియన్స్‌కు చాలా బాగుంది. అందరికీ అవకాశాలు ఉన్నాయి. అయితే కాసినోలో పోకర్‌ మాదిరిగా అదృ ష్టం కూడా కలిసిరావాలి. మేమందరం ప్రతి ఏడాది ప్రేక్షకులకు గుర్తిండిపోయే ఒక సినిమా ఇవ్వాలి. బస్‌ పాస్‌ల మాదిరిగా మా కెరీర్‌లు రెన్యూవల్‌ చేయించుకోవాలి. లేకపోతే ప్రేక్షకులు మమ్మల్ని మర్చిపోతారు.

రైటర్స్‌ కనుమరుగవుతున్నారు

నేను రైటర్స్‌ను నమ్ముకున్నవాడిని. నా ఉద్దేశంలో మంచి రైటర్స్‌ కనుమరుగవుతున్నారు. మన ఇండస్ట్రీకి మరింత మంది రైటర్స్‌ అవసరం.

అందరూ కలిసి

మేము మొత్తం 12 మంది కమేడియన్స్‌ ప్రతి నెలా రెండో శనివారం రాత్రి లేదా ఆదివారం కలుస్తాం. షూటింగ్‌లు.. పాత్రల గురించి తప్ప మిగిలిన విషయాలన్నీ మాట్లాడుకుంటాం. ఒక విధంగా ఇది మాకు డిటాక్స్‌ లాంటిది.

సీవీఎల్‌ఎన్‌ ప్రసాద్‌

Updated Date - Mar 03 , 2024 | 04:38 AM