Share News

Hero Varuntej Interview : వారసత్వాన్ని గౌరవంగా భావిస్తా

ABN , Publish Date - Jan 21 , 2024 | 05:35 AM

చేసిన సినిమాలు తక్కువే అయినా వైవిధ్యభరితమైన పాత్రలతో ప్రేక్షకులపై తనదైన ముద్ర వేసిన నటుడు వరుణ్‌తేజ్‌. నటి లావణ్య త్రిపాఠిని

Hero Varuntej Interview : వారసత్వాన్ని గౌరవంగా భావిస్తా

చేసిన సినిమాలు తక్కువే అయినా

వైవిధ్యభరితమైన పాత్రలతో ప్రేక్షకులపై

తనదైన ముద్ర వేసిన నటుడు

వరుణ్‌తేజ్‌. నటి లావణ్య త్రిపాఠిని

వివాహం చేసుకున్న తర్వాత వరుణ్‌

ఇచ్చిన తొలి ఇంటర్వ్యూ ‘నవ్య’ పాఠకులకు ప్రత్యేకం.

లావణ్యకు మొదట నేనే ప్రపోజ్‌ చేశా. తను నాతో ఎలా ఉందనే విషయం కన్నా... నా కుటుంబంతో,స్నేహితులతో ఎలా ఉందనే విషయాన్ని గమనిస్తూ ఉండేవాడిని. తను చాలా పాజిటివ్‌. ఎక్కడ ఉన్నా సందడిగా ఉంటుంది. ఎటువంటి నెగిటివిటీ ఉండదు. ఇలా చెప్పుకుంటూ పోతే నాకు నచ్చిన లక్షణాలు అనేకం ఉన్నాయి. నాకు కోపం ఎక్కవ. త్వరగా ఎమోషనల్‌ అవుతాను. తను కూల్‌గా ఉంటుంది. అన్నింటినీ జాగ్రత్తగా విశ్లేషిస్తుంది. అందుకే మేమిద్దరం ఒకరికొకరం తగినవాళ్లమనిపించింది.

మీ వ్యక్తిగత.. వృత్తి ప్రయాణాలు ఎలా సాగుతున్నాయి...

చాలా ఆనందంగా సాగుతున్నాయి. సరైన సమయంలో పెళ్లి చేసుకున్నా. సినిమాల విషయానికి వస్తే- గతం నుంచి కొన్ని పాఠాలు నేర్చుకున్నా. మరింత పరిపక్వతతో సినిమాలను ఎంచుకుంటున్నా!

బ్యాచిలర్‌ లైఫ్‌ పూర్తయిపోయింది కదా! ఎలా అనిపిస్తోంది...

చాలామంది ‘బ్యాచిలర్‌ లైఫ్‌ని మిస్‌ అవుతున్నాం’ అంటారు. నాకు అలా అనిపించటం లేదు. మనకు తెలిసిన వ్యక్తి, మనసుకు నచ్చిన వ్యక్తి ఉన్నప్పుడు లోటేమీ ఉండదు. ఆ విధంగా నేను అదృష్టవంతుడిని. లావణ్య నాకు చాలాకాలంగా తెలుసు. మొదటినుంచీ మా రిలేషన్‌షి్‌పను సీరియ్‌సగా తీసుకున్నాం. బయటకు ఎవరికీ చెప్పకపోవచ్చు. కానీ అది పెళ్లితో పరిపూర్ణమవుతుందని మాకు తెలుసు. ఒకప్పుడు బ్యాచిలర్‌ లైఫ్‌ను ఎంజాయ్‌ చేశా. ఇప్పుడు వైవాహిక జీవితాన్ని ఎంజాయ్‌ చేస్తున్నా!

varun-tej-big,.jpg

పెళ్లి అయిన తర్వాత బాధ్యతలు పెరిగాయా?

మొదటినుంచి నేను చాలా బాధ్యతాయుతమైన వ్యక్తిని. నా కుటుంబానికి ఎక్కువ విలువ ఇస్తా! ఇంతకు ముందు అమ్మ, నాన్న, చెల్లి పట్ల బాధ్యతగా ఉండేవాడిని. ఇప్పుడు లావణ్య కూడా చేరింది.

మీరు బాగా ఎమోషనల్‌ పర్సనా?

అవును. నాకు ఎమోషన్స్‌ ఎక్కువే! ఇంతకు ముందు వర్క్‌ విషయంలో, రిలేషన్‌ షిప్స్‌ విషయంలో చాలా సున్నితంగా ఉండేవాడిని. అనుకున్నవి జరగకపోతే బాధపడేవాడిని. ఇప్పుడు నా అంచనాలు తగ్గించేసుకున్నా. మనం ఎవరి కోసం ఏదైనా చేస్తే- వారి దగ్గర నుంచి తిరిగి ఏదీ ఆశించకూడదు. మనకు నచ్చితే చేయాలి. లేకపోతే చేయకూడదు. ఈ పరిణతి వచ్చింది.

మీకు ఎమోషనల్‌ సపోర్ట్‌ ఎవరు?

అమ్మ, నాన్న, చెల్లి, స్నేహితులు... ఇప్పుడు లావణ్య. ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతుడిని. ఒకటో తరగతి నుంచి నాతో పాటు చదువుకున్న తొమ్మిది మంది స్నేహితులు ఉన్నారు. వాళ్లకు కూడా పెళ్లిళ్లు అయ్యాయి. పిల్లలు పుట్టారు. మేమందరం తరచూ కలుస్తూ ఉంటాం. వీరే నా ఎమోషనల్‌ సపోర్ట్‌. నిన్న (శుక్రవారం) నా పుట్టినరోజును అందరం కలిసి సెలబ్రేట్‌ చేసుకున్నాం. ప్రతి వ్యక్తికి ఇలాంటి ఎమోషనల్‌ సపోర్టు ఉండాలి.

మీది మెగా కుటుంబం. నాన్న (నాగబాబు), పెదనాన్న (చిరంజీవి), బాబాయ్‌ (పవన్‌కళ్యాణ్‌)ల వారసత్వం బరువు ఏదైనా ఫీలవుతూ ఉంటారా?

వారసత్వం ఉంది. అది బరువు కాదు, బాధ్యత. ఒత్తిడిగా భావించకూడదు. మొదటినుంచీ అమ్మ, నాన్న నాకు అదే చెప్పేవారు. చిన్నప్పటి నుంచి నేను ఏం చేస్తానన్నా- నాన్న ఎప్పుడూ కాదనలేదు. నాకు అంతులేని స్వేచ్ఛను ఇచ్చారు. అందువల్ల వారసత్వాన్ని నేను ఒక గౌరవంగా భావిస్తా. నాకు నాన్న ఇచ్చిన మద్దతు వల్ల స్థిరత్వం వచ్చింది.

సినిమాల్లోకి రావాలనే ఆలోచన చిన్నప్పటి నుంచి ఉండేదా?

సినిమాలంటే ఆసక్తి ఉండేది. ఆకర్షణ కూడా ఉండేది. కానీ నటుడిని అవ్వాలనే ఆలోచన మాత్రం లేదు. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. చిన్నప్పటి నుంచి నాకు నా చుట్టూ ఉన్న విషయాలపై ఆసక్తి ఎక్కువ. ఒక సంఘటన జరిగినప్పుడు ఇతరులు ఎలా ఆలోచిస్తారో తెలుసుకోవాలని ఉండేది. బహుశా నేను నటుడిని కావటానికి ఈ లక్షణమే ప్రధాన కారణం. రకరకాల వ్యక్తుల కోణాల నుంచి మనం చూడవచ్చు. నటనలో ప్రతి రోజూ ఒక కొత్తదనం ఉంటుంది. ఎప్పుడూ బోర్‌ కొట్టదు. కథ వెనక మరో కథ ఉంటుంది.

మీరు సినిమాలను ఎలా ఎంపిక చేసుకుంటారు?

చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటా! ఆ ఎంపికలో కూడా పొరపాట్లు జరగవచ్చు. దానికి అనేక కారణాలు ఉంటాయి. అయితే మనం ఎంపిక చేసుకొనే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదో ఒకటి చేసేయ్యాలి అనుకుంటే- ఈ పాటికి అనేక సినిమాలు చేసేవాడిని. అనేక అవకాశాలు కూడా వచ్చాయి. కానీ ఆచితూచి చేయాలనేది నా ఉద్దేశం. దీనికి కూడా ఒక కారణం ఉంది. నేను సినిమాల్లో ప్రవేశించేనాటికి, ఇప్పటికి అనేక మార్పులు వచ్చాయి. ఓటీటీ వచ్చిన తర్వాత ప్రేక్షకుల అభిరుచులు మారాయి. నేను వచ్చిన కొత్తల్లో- ‘నాకు నచ్చింది చేయాలి. ప్రేక్షకులకు భిన్నంగా ఏదో ఇవ్వాలి’’ అనుకొనేవాడిని. ఆ తర్వాత... ప్రేక్షకుల అభిరుచులు సీజన్లలా మారిపోతూ ఉంటాయని అర్థమయింది. సినీ రంగంలో ఉన్నవారందరూ ఈ విషయాన్ని గమనించి ముందుకు వెళ్లాలి. లేకపోతే ప్రమాదమే!

బాలాకోట్‌ దాడుల నేపథ్యంలో తీసిన ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ వెనకు ఉన్న కథ ఏమిటి?

దీనికి డైరక్టర్‌ శక్తిప్రతాప్‌సింగ్‌. కొవిడ్‌ తర్వాత శక్తి- ‘ఎండ్‌రన్‌’ అనే షార్ట్‌ఫిల్మ్‌ను తీసి దాన్ని యూట్యూబ్‌లో పెట్టారు. చాలా బాగా తీశారు. బాలాకోట్‌ దాడుల నేపథ్యంలో తీసిన షార్ట్‌ఫిల్మ్‌ అది. దాన్ని నాకు ఎవరో పంపారు. నాకు బాగా నచ్చింది. ఆ సమయంలో నాకు హిందీలో చేయాలనే ఆలోచనే లేదు. ముంబాయిలో ఒకరి ద్వారా శక్తి నాకు ఈ కథను వినిపించారు. తన విజువలైజేషన్‌.. స్ర్కీన్‌ప్లే నాకు చాలా నచ్చాయి. ఆ తర్వాత ఈ కథను నా కజిన్‌ సిద్ధు ‘సోనీ’ కంపెనీ వాళ్లకు వినిపించారు. వాళ్లు కూడా చాలా ఎగ్జైట్‌ అయ్యారు. అలా ఈ సినిమా ప్రారంభమయింది.

ఇలాంటి సినిమాలు తీయటం చాలా కష్టం కదా..

అవును. పాక్‌ ఉగ్రవాద స్థావరాలపై మన ఎయిర్‌ఫోర్స్‌ దాడి చేసింది. అందువల్ల మనవాళ్ల అనుమతులు తీసుకోవాల్సి వచ్చింది. వారు మొత్తం స్ర్కిప్ట్‌ను చదివి, విశ్లేషించి... ఆ తర్వాత అనుమతి ఇచ్చారు. దీనికి చాలా సమయం పట్టింది. అంతే కాకుండా ఎయిర్‌ఫోర్స్‌కు సంబంధించిన అనేక టెక్నికల్‌ విషయాల ప్రస్తావన దీనిలో ఉంటుంది. వీటిని అందరికీ అర్థమయ్యేలా, వాస్తవ సంఘటనలకు వీలైనంత దగ్గరగా చూపించాలి. దీనితో పాటుగా గ్రీన్‌మ్యాట్‌లో తీసే సీన్లు చాలా కష్టం. ఒకే చోట కూర్చొని... మన పక్కన 800 మైళ్ల వేగంతో యుద్ధ విమానం వెళ్తుంటే ఎలా రియాక్ట్‌ అవుతామో అలా నటించాలి. ఒకటి రెండు షాట్స్‌ అయితే ఓకే. కానీ ఈ సినిమాలో దాదాపు 30 నిమిషాల ఫైట్స్‌ ఉంటాయి. అలా నటించటం చాలా కష్టం. అందుకోసం గ్వాలియర్‌లోని ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలోని సిమ్యూలేటర్‌పై ప్రాక్టీసు చేయాల్సి వచ్చింది. 48 డిగ్రీల ఉష్ణోగ్రతలో పైలెట్స్‌ వేసుకొనే జీ-సూట్‌లో నటించటం చాలా కష్టం. ఉత్తర భారతంలో దేశభక్తి సినిమాలు ఎక్కువ వస్తూ ఉంటాయి. దక్షిణాదిన తక్కువ వస్తాయి. ఈ సినిమా ఆ కొరతను తీర్చేస్తుంది.

నచ్చనిగుణం

సరైన ప్రవర్తన లేకపోవటం, ఇతరుల సమయాన్ని గౌరవించకపోవటం,

ఇతరులను ఇబ్బంది పెట్టటం.

chiranjeevi.jpg

పెదనాన్నే స్ఫూర్తి

నటుడిని కావటానికి నాకు పెదనాన్న స్పూర్తి అని చెప్పాలి. ఆయనను చూస్తూ పెరిగాను. నేను ఇంటర్‌లో ఉండగా- నటుడిని కావాలనే కోరిక పుట్టింది. అయితే ఆ విషయాన్ని నేను ఎవరికీ చెప్పలేదు. ఒక రోజు పెదనాన్న- నా ఫోటోలు తీశారు. ‘‘నువ్వు హీరో కావచ్చు కదా!’’ అన్నారు. ‘నా మనసులో మాట ఆయనకు ఎలా తెలిసిపోయిందా!’ అనుకున్నా. ఆయన నన్ను చిన్నపిల్లవాడిలా చూసేవారు కాదు. పెద్దవాడిలా ట్రీట్‌ చేసేవారు. ఇక్కడ ఇంకో విషయం చెబుతా. ఆయన నా పెదనాన్న అనే విషయాన్ని కాసేపు పక్కన పెడదాం. మెగాస్టార్‌ చిరంజీవి అనుకుందాం. వృత్తి పట్ల ఆయన నిబద్ధత అసామాన్యం. కాలు నొప్పి ఉన్నా... ఏ మాత్రం తొణకకుండా క్లిష్టమైన షాట్స్‌ చేయటం నేను కళ్లారా చూశాను. ఆయన నటనను ఎంత ప్రేమిస్తారో నేను దగ్గరగా చూశాను. అందుకే ఆయన నాకు స్పూర్తి.

సీవీఎల్‌ఎన్‌ ప్రసాద్‌

Updated Date - Jan 21 , 2024 | 05:35 AM