Share News

విశ్వాసమే ఆలంబన

ABN , Publish Date - Jan 05 , 2024 | 04:52 AM

‘‘గురువుగారూ! ఆ మార్పా చాలా ప్రమాదకరమైన వ్యక్తిలా, అబద్ధాలకోరులా, కపటిలా ఉన్నాడు. ఎన్నో ఏళ్ళ నుంచీ మీ దగ్గర శిష్యులుగా ఉన్న మేమే మీకు సంపూర్ణంగా సమర్పణ కాలేదు.

విశ్వాసమే ఆలంబన

టిబెట్‌ జెన్‌ గురువైన మార్పాకి భారతదేశంతో అనుబంధం ఉంది. క్రీస్తుశకం 1012 నుంచి 1097 వరకూ జీవించిన మార్పా... భారతీయ బౌద్ధ గురువు నరోపాకు శిష్యుడు. జ్జానార్జన పట్ల అతనికి ఉన్న తపన... భారత్‌, నేపాల్‌ దేశాల్లో విస్తృతంగా పర్యటించేలా చేసింది. నరోపాను కలుసుకోవడానికి ముందు మార్పాకి ఒక కపట గురువు తగిలాడు. ఆ గురువు నిజమైన జ్ఞాని కాదు. కానీ అతనికి గొప్ప పేరు ప్రతిష్టలు ఉన్నాయి. ఎందరో శిష్యులు ఉండేవారు. ఆ కపట గురువు గురించి విన్న మార్పా అతని దగ్గరకు వెళ్ళాడు. ‘‘గురువుగారూ! ఈ క్షణం నుంచి నేను మీ శిష్యుణ్ణి. ఏం చెయ్యాలో ఆజ్ఞాపించండి’’ అని కోరాడు

‘‘అయితే నిన్ను నువ్వు సంపూర్ణంగా సమర్పించుకో’’ అన్నాడు ఆ గురువు.

‘‘అలాగే సమర్పించుకుంటున్నాను. తరువాత ఏం చెయ్యాలో సెలవివ్వండి’’ అని అడిగాడు మార్పా.

ఈ మాటలు ఇతర శిష్యులకు నచ్చలేదు. ‘మార్పా మాటల్ని గురువు నమ్మితే... అతణ్ణి ప్రియశిష్యుడిగా స్వీకరిస్తాడు. ఎన్నో ఏళ్ళుగా ఉన్న తమ అందరికీ మార్పా నాయకుడవుతాడు. దీన్ని ఎలాగైనా ఆపాలి’ అనుకున్నారు.

‘‘గురువుగారూ! ఆ మార్పా చాలా ప్రమాదకరమైన వ్యక్తిలా, అబద్ధాలకోరులా, కపటిలా ఉన్నాడు. ఎన్నో ఏళ్ళ నుంచీ మీ దగ్గర శిష్యులుగా ఉన్న మేమే మీకు సంపూర్ణంగా సమర్పణ కాలేదు. ఇప్పుడు ఇతను వచ్చి ‘‘నేను మీకు సంపూర్ణంగా సమర్పించుకొన్నాను’’ అంటే ఎలా నమ్మాలి? ముందు ఇతణ్ణి బాగా పరీక్షించాలి. పరీక్షలో నెగ్గితే అప్పుడు అతని మాటలు నమ్మవచ్చు’’ అన్నారు.

‘‘ఏం చేద్దామో, ఎలా పరీక్షిద్దామో మీరే చెప్పండి’’ అన్నాడు గురువు.

‘‘ఈ కొండ మీంచి దూకమనండి’’ అన్నారు శిష్యులు.

‘‘ఇదిగో దూకుతున్నాను’’ అంటూ దూకేశాడు మార్పా. అతను చచ్చిపోయి ఉంటాడని ఆ గురువు, శిష్యులు అనుకున్నారు. లోయలోకి దిగి చూశారు. అక్కడ పద్మాసనంలో కూర్చొని, ధ్యానం చేస్తూ కనిపించాడు మార్పా.

‘‘ఈ అద్భుతం ఎలా జరిగింది?’’ అని ప్రశ్నించాడు గురువు.

‘‘నాకేం తెలుసు? ఇది మీ ఘనతే’’ అన్నాడు మార్పా.

‘‘ఇది యాదృచ్ఛికంగా జరిగి ఉండొచ్చు. మరోసారి పరీక్షింంచాలి’’ అన్నారు శిష్యులు. మార్పాను మండుతున్న ఒక ఇంట్లోకి వెళ్ళమన్నారు. అతను ఎలాంటి జంకూ లేకుండా ఆ ఇంట్లో ప్రవేశించాడు. మంటలన్నీ పూర్తిగా ఆరిపోయాక... వాళ్ళు లోపలికి వెళ్ళి చూశారు. ఎటు చూసినా మాడి మసైపోయిన వస్తువులు కనిపించాయి. కానీ ఒక గదిలో మార్పా చెక్కుచెదరకుండా, ప్రశాంతంగా ధ్యానం చేస్తూ కనబడ్డాడు. ఆ శిష్యుల ఆశ్చర్యానికి అంతులేదు. మార్పాకు మరో పరీక్ష పెట్టాలని వాళ్ళు పట్టుపట్టారు. నదీ ప్రవాహం మీద మార్పాను నడిచి వెళ్ళమన్నారు. క్షణం ఆలస్యం చెయ్యకుండా నదిపై నడవడం ప్రారంభించి, నది మధ్యకు వెళ్ళాడు మార్పా. ఇది చూసిన గురువు ‘నాలో నిజంగానే ఏదో మహిమ ఉన్నట్టుందే! నా శిష్యుడే నా మీద విశ్వాసం ఉంచి నదిలో నడవగలిగినప్పుడు... నేనెందుకు నడవలేను?’ అనుకొని... నదిలోకి వెళ్ళి మునిగిపోయాడు.

‘ఒక గురువు సరైన వాడు కానప్పటికీ... అతణ్ణి విశ్వసిస్తే ఇలాంటి అద్భుతాలు జరుగుతాయా?’ అనే సందేహం రావచ్చు. ఒక వ్యక్తికి జబ్బు చేస్తుంది అతడు ఒక బాబాను కలుస్తాడు. ఆ బాబా ఇంత విభూతి ఇచ్చి నోట్లో వేసుకోమంటాడు. ఆ వ్యక్తి అలా వేసుకుంటే... జబ్బు నయం అవుతుంది. అలాగే ఏదో పుణ్య క్షేత్రానికి వెళితే జబ్బు తగ్గుతుందని ఎవరో చెబుతారు. అది జరుగుతుంది. ఇది కేవలం ఆ బాబా వల్లో, క్షేత్రం వల్లనో కాదనీ... వాటిపై రోగికి ఏర్పడిన విశ్వాసం అతనిలో రోగనిరోధక శక్తిని పెంచడమే దానికి కారణమనీ పెద్దలు చెబుతారు. విశ్వాసం, భక్తి, ప్రేమ వల్ల మనలో అంతర్గతమైన మార్పులు జరిగి... మేలు జరుగుతుందనే అభిప్రాయమూ ఉంది. ఆ విధంగా... అద్భుతాలు జరగడానికి విశ్వాసమే ఆలంబన అవుతుంది.

- రాచమడుగు శ్రీనివాసులు

Updated Date - Jan 05 , 2024 | 04:54 AM