Share News

నిజమైన తపస్సు

ABN , Publish Date - May 24 , 2024 | 05:14 AM

తపస్సు అంటే ఋషులు, మునుల్లా అడవిలో ఏకాంతంగా, ముక్కు మూసుకొని చేసే ధ్యానమని మనం భావిస్తాం. ‘తపస్‌’ అనే శబ్దానికి నిజమైన అర్థం... దహించడం. ‘కాయేంద్రియ సిద్ధిః అశుద్ధా క్షయాత్‌ తపసః’ అని నిర్వచించాడు

నిజమైన తపస్సు

తపస్సు అంటే ఋషులు, మునుల్లా అడవిలో ఏకాంతంగా, ముక్కు మూసుకొని చేసే ధ్యానమని మనం భావిస్తాం. ‘తపస్‌’ అనే శబ్దానికి నిజమైన అర్థం... దహించడం. ‘కాయేంద్రియ సిద్ధిః అశుద్ధా క్షయాత్‌ తపసః’ అని నిర్వచించాడు పతంజలి మహర్షి... తన ‘యోగదర్శనం’లో. ‘శారీరకమైన, మానసికమైన కల్మషాలను తొలగించేదే తపస్సు’ అని ఈ సూత్ర భావం. ఉదాహరణకు, ఉపవాసం అనే భౌతిక తపస్సుతో మన శరీరంలో ఉండే అధికమైన కొవ్వును, విషపదార్థాలను... అలా పేరుకుపోయిన వాటిని దహించివేస్తాం. అలాగే మానసిక తపస్సుతో... మన మనస్సులో నాటుకొని ఉన్న పాత, పనికిమాలిన భావాలను దహిస్తాం. వాచికమైన తపస్సులో మౌనం పాటిస్తాం. దానివల్ల మన వాగ్ధారను నియంత్రించుకుంటాం. అయితే... వాటిని మనం దహిస్తున్న సమయంలో కొంత వేడి, బాధ కలగడం గమనించవచ్చు. నొప్పికి సైతం లోనవుతాం. కాబట్టి తపస్సు అంటే... ‘బాధను అంగీకరించడం’ అని కూడా అర్థం. ఒకవేళ ఒక వ్యక్తి వేదనకు గురి అవుతున్నాడంటే... దాంతో అతనిలోని మాలిన్యాలు, కల్మషాలు నశించి... నిష్కల్మషుడు, శుద్ధుడు అయ్యాడని అర్థం.

మన నిత్య జీవితంలో సైతం తపస్సుకు ఎన్నో అవకాశాలు తటస్థపడతాయి. ఒక వస్త్రం కూడా పరిశుభ్రం కావడానికి తపస్సుకు లోనవుతుంది. మన వస్త్రాలను లాండ్రీ అతను ఏం చేస్తాడు? కేవలం మడతపెట్టి, వాటి మీద కాస్త చందనం పొడి చల్లి, మడతల్లో మల్లెపూలు పెట్టి తిరిగి ఇచ్చెయ్యడు కదా? వాటిని మొదట సలసల మరిగే నీళ్ళలో నానబెడతాడు. అందులో సబ్బుపొడి వేస్తాడు. ఆ తరువాత వాటిని బండమీద బాదుతాడు. అనంతరం కింద పడేసి, దొర్లించి, గట్టిగా పిండుతాడు. తరువాత వాటిని ఎండలో ఆరేస్తాడు. ఆరగానే వాటిని వేడి ఇస్త్రీపెట్టెతో ఇస్త్రీ చేస్తాడు. అప్పుడే ఆ వస్త్రాలు తమ మురికిని కోల్పోయి, స్వచ్ఛంగా తయారై, ధరించడానికి అనువుగా ఉంటాయి. అంటే... వస్త్రాలు తీవ్రమైన తపస్సుకు లోనై, శుభ్రంగా, శుద్ధంగా మారుతాయి. లాండ్రీ వ్యక్తికి ఆ వస్త్రాల మీద ద్వేషమేమీ లేదు. పైన చెప్పిన విధానం అంతా వాటి మాలిన్యం తొలగించడానికే.

‘తపస్‌’ అనే శబ్దానికి నిజమైన అర్థం... దహించడం. ‘కాయేంద్రియ సిద్ధిః అశుద్ధా క్షయాత్‌ తపసః’

అని నిర్వచించాడు పతంజలి మహర్షి... తన ‘యోగదర్శనం’లో.

‘శారీరకమైన, మానసికమైన కల్మషాలను తొలగించేదే తపస్సు’ అని ఈ సూత్ర భావం.


అదేవిధంగా... మనస్సును ఉతకాలి, పిండాలి. దులపాలి, ఎండవేయాలి. ఇస్త్రీ చెయ్యాలి. ఎవరైనా మనకు బాధ కలిగించినప్పుడు... వారు మనల్ని ద్వేషిస్తున్నారని అనుకోకూడదు. మనల్ని మనం పరిశుద్ధం చేసుకోవడానికి సహాయపడుతున్నారని భావించాలి. అప్పుడే మనం నిజమైన యోగిలా ఆలోచించగలుగుతాం. మన భావాల్ని ఎవరైనా గాయపరచినప్పుడు... వాళ్ళను చూసి చిరునవ్వు నవ్వగలగాలి. ‘‘ధన్యవాదాలు. ఇలాంటివి నాకు ఇంకా ఇంకా కావాలి. మీరు నన్ను పవిత్రం చేస్తున్నారని మీకు తెలుసు. మీ మిత్రుల్ని కూడా పిలుచుకురండి. నన్ను గాయపరచాలనే వారి కోరిక నెరవేరుతుంది’’ అని చెప్పాలి. మనకు ఈ విషయం బోధపడితే... మనల్ని దూషించే, నిందించేవారిని తప్పుపట్టం సరికదా... వాటన్నిటినీ అంగీకరించి, భరిస్తాం. పొగడ్తలకు ఆనందిస్తూ, అవమానాలకు కుంగిపోతున్నామంటే... మన మనస్సు ఇంకా స్థిరంగా... దృఢంగా లేదన్నమాట. ఒక దూషణ... మన బలహీనతను అర్థం చేసుకోవడానికి ఉపకరిస్తుంది. ‘ఒదిగిపో, కుదురుకో, సర్దుకుపో’ అనే తత్త్వాన్ని అలవరచుకోవాలి. అవమానాలను భరించాలి, గాయాలను సహించాలి. ఇదే ఉత్తమ సాధకుడి లక్షణం. ఏకాంత ప్రదేశంలో ఉంటూ, ఏదో ఒక మంత్రాన్ని జపిస్తూ కూర్చోవడం ఎవరైనా చేయగలరు.. నిందలనూ, అవమానాలనూ భరిస్తూ... మనస్సును స్థిమితంగా, నిశ్చలంగా, ప్రశాంతంగా ఉంచుకోవడం... జపమాలను వేల సార్లు తిప్పుతూ మంత్రాన్ని ఉచ్చరించడం కన్నా ఎంతో గొప్పది. శరీరాన్ని, ఇంద్రియాలను నియంత్రించడం తపస్సువల్ల లభిస్తుంది. మనం అన్నిటినీ అంగీకరించినప్పుడు... ఏది మనల్ని ప్రభావితం చేస్తుంది? ఎవరో మనల్ని మూర్ఖుడన్నా ఒప్పుకోవాలి. అద్భుతమైన వ్యక్తి అన్నా ఒప్పుకోవాలి.

ఒకప్పుడు ఒక యోగి ఓ ఊరికి వచ్చాడు. ఊరు బయట ఉన్న రావి చెట్టుకింద కూర్చున్నాడు. ఆ ఊరి ప్రజలు ఆయను దర్శించుకొనేవారు. ఆయన వాళ్ళ సందేహాలు తీర్చేవాడు. సాయంత్ర వేళల్లో సత్ప్రవర్తన గురించీ, మంచి చెడుల గురించి బోధించేవాడు. ఆ ఊర్లోనే ఉన్న ఒక ధనవంతుడికి ఇది కంటగింపుగా ఉండేది. ఒకనాడు... యోగి ఒంటరిగా ఉన్న సమయంలో ఆయన దగ్గరకు వచ్చాడు. ఆయనను అవమానించి, కోపం తెప్పించాలనుకున్నాడు. ఆయనను నిందించడం ప్రారంభించాడు.

‘‘ఓరీ దుష్టుడా! వంచకుడా! నీవు జనాలను మోసం చేస్తున్నావు. నీ బోధనల వల్ల ఎంతమంది పనీపాటా లేకుండా నష్టపోయారో తెలుసా?...’’ ఇలాంటి మాటలతో ఆ ధనికుడు దూషిస్తున్నా... యోగి మాత్రం చిరునవ్వుతో ప్రశాంతంగా చూస్తున్నాడు.

‘‘నీకు నా భాష అర్థం కావడం లేదా?’’ అని అడిగాడు ధనికుడు.

‘‘బాగా అర్థం అవుతోంది’’ అన్నాడు యోగి.

‘‘అంటే నేను నిన్ను అవమానిస్తున్నట్టు తెలుస్తోందా?’’ అని నమ్మలేనట్టుగా ప్రశ్నించాడు ధనికుడు.

‘‘అవును’’ అన్నాడు యోగి.

‘‘అయితే, మౌనంగా ఎలా ఉండగలుగుతున్నావు?’’ అని అడిగాడు ధనికుడు.

అప్పుడు సాధువు ‘‘నాయనా! నీవు నా వద్దకు వచ్చేటప్పుడు ఒక పండో, ఫలమో, ఏదైనా కానుకో తెచ్చావనుకుందాం. నేను వాటిని తీసుకోకుండా నిరాకరించానని అనుకుందాం. అప్పుడు నీవేం చేస్తావు?’’ అన్నాడు.

‘‘వాటిని తిరిగి తీసుకువెళ్తాను.’’


‘అదే విధంగా... ఇంతవరకూ నీవు పలికిన నిందా వాక్యాలు, తిట్లు నేను స్వీకరించడం లేదు. వాటిని నీవే తీసుకువెళ్ళు’’ అన్నాడు యోగి ప్రశాంతంగా.

ఈ విధంగా వ్యవహరించడం వల్ల... నిజమైన మానసిక శక్తి, ధైర్యం కలుగుతాయి. ఎవరినైనా శారీరకంగా ఎదిరించి, భౌతికంగా పోరాడేవారికి దేహదారుఢ్యం ఉంటుంది. అతను మానసికంగా బలహీనుడన్నమాట. తపస్సువల్ల మానసిక స్థైర్యం లభిస్తుంది. ఇది బాధను సహించడంతో ఏర్పడుతుంది. ఆ స్థితిలో బాధ, నొప్పి ఇక ఉండవు. ఆనందం మిగిలిపోతుంది. వేదనను సహించడం వల్ల కలిగే ప్రయోజనాన్ని మనం వాస్తవంగా గ్రహించడమే దీనికి కారణం.

ఈ లోకంలో మనకు ఒక చిన్న, అందమైన ఉదాహరణ కనిపిస్తుంది. అదే అమ్మ. తనకు ఎదురైన అత్యంత కష్టమైన ప్రసవవేదనను భరించి... బిడ్డకు జన్మను ఇవ్వడంలో ఆనందాన్ని అమ్మ అనుభవిస్తుంది. తనకు ఆ బాధ వద్దని ఆమె అనుకోదు సరికదా... పురిటినొప్పులతో సహా ప్రసవంలో కలిగే ప్రతి బాధనూ ఆహ్వానిస్తుంది. దానికి మూల్యమేమిటో, ప్రతిఫలమేమిలో ఆమెకు బాగా తెలుసు. ఆమెది నిజమైన తపస్సు.

అప్పరుసు విజయరామారావు,

9177086363

Updated Date - May 24 , 2024 | 05:15 AM