Share News

లక్ష్మీ కటాక్షం పొందాలంటే...

ABN , Publish Date - Oct 25 , 2024 | 12:58 AM

దీపావళి నాడు లక్ష్మీదేవిని పూజించడం సంప్రదాయం. లక్ష్మీతత్త్వాన్ని గురించి తెలుసుకుంటే... ఈ పండుగలోని అంతరార్థం మనకు తెలుస్తుంది. ఈ సృష్టి పరిణామక్రమానికి ప్రతీక ‘లక్ష్మీదేవి’ అని గ్రహించాలి. ఆమె శక్తి ద్వారానే మనం పరిణామ

లక్ష్మీ కటాక్షం పొందాలంటే...

దీపావళి నాడు లక్ష్మీదేవిని పూజించడం సంప్రదాయం. లక్ష్మీతత్త్వాన్ని గురించి తెలుసుకుంటే... ఈ పండుగలోని అంతరార్థం మనకు తెలుస్తుంది. ఈ సృష్టి పరిణామక్రమానికి ప్రతీక ‘లక్ష్మీదేవి’ అని గ్రహించాలి. ఆమె శక్తి ద్వారానే మనం పరిణామ దశల్లో అట్టడుగు స్థాయి నుంచి ఉన్నత స్థాయికి చేరుకుంటాం. ఇది లక్ష్మీతత్త్వంతో మొదలవుతుంది. అమృతం కోసం సాగిన అద్భుతమైన మధనంలో... లోకుల అన్వేషణకు ప్రతీకగా సముద్రం నుంచి శ్రీలక్ష్మీదేవి ఆవిర్భవించింది. జీవుల సృష్టి సముద్రం నుంచే ఆరంభమయింది. వాటికి శక్తి సముద్రం నుంచే రావలసి ఉంది. ఆ విధంగా జీవులలో లక్ష్మీతత్త్వ సారం అంతర్గతంగా నెలకొని ఉంటుంది. మనల్ని పోషించేదీ, రక్షించేదీ, భద్రత కల్పించేదీ అదే. ఆటవిక దశ నుంచి ఒక స్థిరత్వాన్ని మానవులకు ఈ తత్త్వమే కలిగించింది. ఇక్కడ లక్ష్మీదేవి గృహలక్ష్మిగా తన పాత్ర పోషిస్తోంది. ఇంటిని, కుటుంబాన్ని, వ్యక్తిగత జీవితాన్ని ఏర్పరచుకోవడానికి అదే ప్రేరణ కలిగించింది. ఆ తరువాత మనిషి సంఘ జీవిగా రూపుదిద్దుకున్నాడు. రాజ్యం ఏర్పడింది. దీనికి మూలం రాజ్యలక్ష్మీ తత్త్వం.

ఏ ఇంట్లో మహిళలు ‘గృహలక్ష్మి’గా గౌరవం పొందుతారో... ఆ ఇంట శ్రీలక్ష్మీదేవి సిరులు కురిపిస్తుంది. అందుకే... ‘యత్రనార్యస్తు పూజ్యంతే, రమంతే తత్రదేవతాః’ అన్నారు పూర్వులు. ఎక్కడ స్త్రీలను దేవతలుగా బావించి పూజిస్తారో... అక్కడ లక్ష్మీదేవి స్థిరంగా నిలుస్తుంది. ‘యాదేవీ సర్వ భూతేషు శాంతి రూపేణ సంస్థితా...’ అంటే ఆ శాంతి దేవతే గృహ లక్ష్మి రూపంలో స్థిరపడింది. గృహిణులు తమ ప్రాధాన్యతను గ్రహించినప్పుడు, సహన శక్తి, క్షమాశక్తితో కుటుంబంలో సంబంధ బాంధవ్యాలను మెరుగుపరిచే శక్తి సాధించినప్పుడే... ఆ ఇంట్లో శాంతి సాధ్యపడుతుంది. అలా కానప్పుడు కుటుంబ వ్యవస్థ గాడి తప్పుతుంది.

జీవ పరిణామ దశలో మనం అత్యున్నతమైన మానవులుగా ఉన్నాం. అనుక్షణం భగవంతుడి సంరక్షణలో ఉన్నాం. మనకు సంపదలు సమకూరినప్పుడు... లక్ష్మీ కటాక్షం కలిగిందని భావిస్తాం. మన సూక్ష్మ శరీర వ్యవస్థలో... నాభీ చక్రంలో లక్ష్మీదేవి, మనలోని కుండలిని ప్రయాణించే సుషుమ్న నాడిలో మహాలక్ష్మీదేవి అధిష్ఠాన దేవతలుగా ఉంటారు. లక్ష్మీదేవి మనకు ధనాన్ని ప్రసాదిస్తే, మహాలక్ష్మీ దేవి దాతృత్వ స్వభావాన్ని ప్రసాదిస్తుంది. ఇంటిలో గాలి రావడానికి, గాలి పోవడానికి రెండు ద్వారాలు ఉంటాయి. అలాగే జీవితంలో సమతుల్యత కోసం... ధనం రావడానికి, బయటకు వెళ్ళడానికి రెండు దారులు ఉంటాయి. అంటే ధన సంపాదన ఉండాలి. దానితోపాటే ఇతరులకు చేతనైనంత సాయం చేసే స్వభావం కూడా ఉండాలి. పిసినారితనం లేకుండా, మనకు ఉన్నదానిలోనే ఇతరులకు సాయపడే గుణం ఉంటేనే లక్ష్మీదేవి ఆశీస్సులు మనకు లభిస్తాయి. మానవులలో లక్ష్మీతత్త్వం పెంపొందాలంటే... సంతృప్తి, దాతృత్వం, ధర్మ నిరతి, సమతుల్యత తదితర సద్గుణాలు ఉండాలి. వాటిలో లోపం ఉంటే లక్ష్మీకటాక్షం ఉండదు. మద్యపానం, జూదం లాంటి దుర్వ్యసనాలు, ఉన్నదానితో సంతృప్తి చెందకుండా అత్యాశకు పోవడం, మోసపూరితంగా, అధర్మ మార్గంలో ధనం సంపాదించాలనే దురాశ... ఇవన్నీ లక్ష్మీదేవికి వ్యతిరేకమైన గుణాలు. చాలామంది ధనసంపాదనే అన్ని సమస్యలకు పరిష్కారంగా భావిస్తారు. ధనం కోసం తాపత్రయపడి, రాత్రి-పగలు కష్టపడతారు. ఈ పోటీ ప్రపంచంలో ఇతరుల పిల్లలకన్నా తమ పిల్లలు ఉన్నతస్థాయిలో జీవించాలని కలలుకంటారు. ఈ తాపత్రయంలో పడి... మానవులందరి సంక్షేమం చూసేది ఆ భగవంతుడే అనే విషయాన్ని మరచిపోతారు. అప్పుడు వారి చిత్తం భగవంతుడి నుంచి దూరమవుతుంది. తమ వారసుల కోసం కూడబెట్టాలనుకుంటున్న ధనం మీదకు మరలిపోతుంది. దీనితో భగవంతుడి శక్తిని మరచిపోతారు. అలాకాకుండా ఉండాలంటే... మనం ధర్మబద్ధంగా ఎంత సంపాదించగలమో అంతే సంపాదించి, మన సంక్షేమాన్ని భగవంతుడికి విడిచిపెట్టాలి. ఎల్లప్పుడూ ధనం కోసం ఆందోళన చెందుతూ ఉండకూడదు. ‘‘...యోగక్షేమం వహామ్యహం’’ అన్నాడు ‘భగవద్గీత’లో శ్రీకృష్ణుడు. అంటే ‘‘నాతో (భగవంతుడితో) యోగం (కలయిక) పొందినట్టయితే, మీ క్షేమాన్ని నేను చూసుకుంటాను’’ అని అర్థం.


లక్ష్మీదేవి పద్మంలో నిలబడి ఉంటుంది. ఎటూ ఒరిగిపోకుండా సమతుల్యతను కలిగి ఉంటుంది. అదే విధంగా లక్ష్మీతత్త్వాన్ని కలిగి ఉన్న వ్యక్తి సమతుల్యతతో ఉంటాడు. అంటే ఎక్కడా అతి చెయ్యకుండా ఉంటాడు. లక్ష్మీదేవి నాలుగు చేతులలో ఒక చెయ్యి దానం చేసేదిగా, మరో చెయ్యి అభయం ఇచ్చేదిగా ఉంటుంది. మనలోని లక్ష్మీతత్త్వాన్ని స్థిరీకరించుకోవడం కోసం ఉదారంగా ఉండాలి, దానాలు చెయ్యాలి. మన దగ్గర పని చేసేవారికి, మనల్ని నమ్ముకున్నవారికి రక్షణ కల్పించాలి. లక్ష్మీదేవి చేతిలోని కలువపువ్వు... మన హృదయం కమలంలా ఉండాలని సూచిస్తుంది. తామరపువ్వు తనలోని మకరందాన్ని తీసుకోవడానికి వచ్చిన కీటకాన్ని సైతం ఎలా సేదదీర్చుతుందో... మన ఇంటికి వచ్చిన అతిథులను కూడా ఆ విధంగానే ఆదరించాలి. లక్ష్మీదేవి కృప మనమీద ప్రసరించాలంటే... ప్రేమపూరితమైన స్వభావం కలిగి ఉండాలి. ఎదుటి వ్యక్తి నుంచి ఎలాంటి ప్రయోజనాన్నీ ఆశించకూడదు. అటువంటి ప్రేమ జ్యోతిని... అంటే మన ఆత్మజ్యోతిని వెలిగించుకుందాం. ఈ దీపావళికి మనలోపల, బయట ఉన్న అంధకారాన్ని పటాపంచలు చేద్దాం. మనం లక్ష్మీతత్త్వాన్ని పొందాలంటే... మనలో ఆ తల్లి గుణగణాలు ప్రతిఫలించాలి. మన చిత్తం సదా భగవంతుడిపైనే ఉండాలి. దానికి ఆత్మసాక్షాత్కారం పొంది, సహజయోగ సాధన చేయడమే ఉత్తమమైన మార్గం.

మనకు ఉన్నదానిలోనే ఇతరులకు సాయపడే గుణం ఉంటేనే లక్ష్మీదేవి ఆశీస్సులు మనకు లభిస్తాయి. మానవులలో లక్ష్మీతత్త్వం పెంపొందాలంటే... సంతృప్తి, దాతృత్వం, ధర్మ నిరతి, సమతుల్యత తదితర సద్గుణాలు ఉండాలి. వాటిలో లోపం ఉంటే లక్ష్మీకటాక్షం ఉండదు.

డాక్టర్‌ పి. రాకేష్‌ 8988982200

‘పరమ పూజ్యశ్రీ మాతాజీ నిర్మలాదేవి,

సహజయోగ ట్రస్ట్‌’, తెలంగాణ

Updated Date - Oct 25 , 2024 | 12:58 AM