వేసవిలో ఇవి బెస్ట్
ABN , Publish Date - Mar 06 , 2024 | 05:00 AM
వేసవి వేగంగా వచ్చేస్తోంది. రోజు రోజుకు వేడి పెరిగిపోతోంది. ఇలాంటి సమయంలో ఎలాంటి బట్టలు వేసుకోవాలనేది చాలా మందికి ఎదురయ్యే ప్రశ్న.

వేసవి వేగంగా వచ్చేస్తోంది. రోజు రోజుకు వేడి పెరిగిపోతోంది. ఇలాంటి సమయంలో ఎలాంటి బట్టలు వేసుకోవాలనేది చాలా మందికి ఎదురయ్యే ప్రశ్న. సరైన బట్టలు వేసుకోపోతే- రోజంతా ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. అందుకే వేసవిలో ఎలాంటి బట్టలు ధరించాలో తెలుసుకుందాం.
పొడవు చేతులు వద్దు..
పొడవు చేతులు ఉన్న డ్రస్సులు.. మోకాళ్ల దాకా ఉండే చూడిదార్లు వేసవిలో ధరించకుండా ఉంటే మంచిది. పొడవు చేతులు ఉన్న డ్రస్సుల వల్ల వంటి నుంచి వచ్చే వేడి బయటకు వెళ్లదు. దీని వల్ల చెమట ఎక్కువ పడుతుంది. ఒక వేళ పొడవు చేతులు వేసుకోవటం తప్పనిసరి అయితే- కాటన్ డ్రస్సులనే ధరించండి.
బిగుతు బట్టలు వద్దు...
చాలా మంది ఫ్యాషన్ కోసం బిగుతు బట్టలు వేసుకుంటారు. బిగుతుగా ఉన్న బట్టలు వేసుకుంటే- చెమట ఆరదు. దీని వల్ల అసౌకర్యంగా అనిపిస్తుంది. వీలైనంత వరకు కొద్దిగా లూజుగా ఉండే బట్టలు వేసుకుంటే మంచిది. కాటన్ బట్టలు వేసుకోవటం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి.
సాక్స్ వద్దు
చాలా మంది బట్టలకు మ్యాచింగ్ అయ్యే సాక్సులు వేసుకుంటారు. సాక్సులు వేసుకోవటం వల్ల శరీరం వేడి ఎక్కుతుంది. ఇబ్బంది మరింత పెరుగుతుంది. అందువల్ల సాక్స్ వేసుకోకపోవటం మంచిది. వేసవిలో శాండిల్స్ ధరించటమే ఉత్తమం.
జీన్స్ వద్దు
వేసవి కాలంలో జీన్స్ వేసుకోకపోవటం మంచిది. ఒక వేళ తప్పని సరిగా వేసుకోవాలంటే- తేలికపాటి జీన్స్ వేసుకుంటే మంచిది.
తరచు కదలండి...
ఎక్కువ సేపు ఒకే చోట కూర్చుంటే- వేడి పెరిగిపోతుంది. చెమట పట్టి ఇబ్బందిగా ఉంటుంది. అందువల్ల వేసవిలో తరచూ అటూ ఇటూ కదులుతూ ఉండాలి. అప్పుడు గాలి బట్టలలో ఉన్న ఖాళీల ద్వారా చర్మంపైకి వెళ్తుంది.
షూలుకూడా
చాలా మంది వేసవిలో బరువైన లెదర్ షూలు లేదా.. స్పోర్ట్స్ షూలు ధరిస్తూ ఉంటారు. బయట వాతావరణంలో వేడి ఎక్కువగా ఉండటం వల్ల కాళ్లకు చెమట పడుతుంది. అంతే కాకుండా బరువైన షూస్‌ను ధరించటం వల్ల బయట నుంచి గాలి కూడా ఎక్కువ ప్రసరించదు. దీని వల్ల పాదాలకు ఇబ్బంది ఏర్పడుతుంది.
లేత రంగులే ముద్దు..
లేత రంగులు వేసుకోవటం వల్ల సూర్యకిరణాలు చొచ్చుకుపోవు. చెదిరిపోతాయి. దీని వల్ల శరీరం వేడి ఎక్కదు. ముదురు రంగులు వేసుకోవటం వల్ల సూర్యకిరణాలు చొచ్చుకుపోతాయి. శరీరం వేడెక్కిపోతుంది.
కాటన్స్ వంటివి..
కాటన్ బట్టలు.. తక్కువ బరువు ఉండే బట్టలు వేసుఉంటే మంచిది. బరువు ఎక్కువగా ఉన్న బట్టలు వేసుకోవటం వల్ల వేసవిలో ఇబ్బందిగా అనిపిస్తుంది.