Share News

మాటే మంత్రమై

ABN , Publish Date - May 24 , 2024 | 05:18 AM

ఏసు జననం అద్భుతమైతే, మరణానంతరం ఆయన పునరుత్థానం మహా అద్భుతం. ఈ రెండిటి మధ్యా ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు. వాటిలో వికలాంగునికి స్వస్థత కలిగించే ఘట్టం ఒకటి.

మాటే మంత్రమై

ఏసు జననం అద్భుతమైతే, మరణానంతరం ఆయన పునరుత్థానం మహా అద్భుతం. ఈ రెండిటి మధ్యా ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు. వాటిలో వికలాంగునికి స్వస్థత కలిగించే ఘట్టం ఒకటి.

యెరూషలేం దేవాలయ ద్వారం దగ్గర ఒక కోనేరు ఉంది. దాని పేరు బెథెస్దా. అది ఎంత పెద్దదంటే... దానికి అయిదు మండపాలు ఉన్నాయి. బెథెస్దా (బెత్‌ హెస్ద) అంటే ‘దయా నిలయం’ అని అర్థం. కొన్ని సమయాల్లో ఒక దేవదూత ఆ కోనేటిలోకి దిగుతుందనీ, అందులోని నీటిని కదిలిస్తుందనీ, అప్పుడు ఆ నీటిలో మొదట దిగిన వ్యక్తికి ఉన్న వ్యాధులు, వైకల్యాలు తక్షణం మటుమాయం అవుతాయని నమ్మకం ఉండేది. అందుకే... ఆ కోనేరు దగ్గర మండపాల్లో అంధులు, వికలాంగులు... ఇంకా రకరకాల దీర్ఘకాల వ్యాధులతో బాధపడేవారూ గుంపులుగా నిరీక్షిస్తూ ఉండేవారు. వారిలో నడవలేని అక వ్యక్తి ఉన్నాడు. తను బాగుపడే అవకాశం దొరక్కపోతుందా? అని ముప్ఫై ఎనిమిది ఏళ్ళుగా అతను అక్కడే ఎదురుచూస్తున్నాడు. అతణ్ణి ఎవరూ పట్టించుకొనేవారు కారు.


ఒకసారి ఏసు ప్రభువు అక్కడికి వచ్చాడు. ఆ వికలాంగుణ్ణి చూశాడు. ‘‘నీకు స్వస్థత చేకూరాలని కోరుకుంటున్నావా?’’ అని అడిగాడు.

‘‘అయ్యా! ఆ కోనేటిలోని నీటిని దేవదూత కదిలించగానే... అందులో దిగాలని ప్రయత్నిస్తూనే ఉన్నాను. కానీ ముందుగా వెళ్ళలేకపోతున్నాను. ఎప్పుడూ ఎవరో ఒకరు నాకన్నా ముందు దిగుతున్నారు. నాకు సాయపడేవాళ్ళు ఎవరూ లేరు. అందుకే ఇలా ఉండిపోయాను’’ అంటూ అతను మొరపెట్టుకున్నాడు.

తనకు మంచి జరుగుతుందనీ, దైవం తనను కరుణిస్తాడనీ అతనిలో ఉన్న నమ్మకాన్ని ఏసు గమనించాడు. ‘‘అయితే సరే! నువ్వు లేచి నిలబడు, నీ పరుపును తీసుకొని నడువు’’ అని చెప్పాడు.

మామూలుగా లేవడం కష్టమైన ఆ వ్యక్తి... ఏసు మాటలు వినగానే లేచాడు. ప్రభువు మాటే మంత్రమయింది. తక్షణమే అతనికి స్వస్థత లభించింది. తన పరుపు తీసుకొని... గబగబా నడిచాడు. అతని ఆనందానికి అవధులు లేవు. ‘‘ఇదంతా ప్రభువు చూపిన దయ’’ అని చుట్టుపక్కలవారికి చెబుతూ, ఏసుకు మొక్కుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.

ఏసు క్రీస్తు చేసిన అద్భుతాల్లో మూడవదిగా బైబిల్‌లో దీని ప్రస్తావన ఉంది. కాగా.... అది విశ్రాంతి దినం అనీ, ఆ రోజు ఎలాంటి మహిమలూ చేయకూడదనీ కొందరు మూఢులు ఏసును నిలదీశారు. ‘‘మానవతను మించిన ఆచారం మరొకటి లేదు’’ అంటూ వారి మాటలను ఏసు ఖండించాడు. మంచి జరగాలనే ఆశ మనలో ఉన్నప్పుడు... ఏదో ఒక రూపంలో దైవం నుంచి సాయం అందుతుందనడానికి ఆ కథ ఒక ఉదాహరణ.

డాక్టర్‌ దేవదాసు బెర్నార్డ్‌ రాజు

9866755024

Updated Date - May 24 , 2024 | 05:18 AM