Share News

Padma Shri Shashi Soni : నవతరానికి స్ఫూర్తిమంత్రం

ABN , Publish Date - Jan 28 , 2024 | 11:33 PM

పదిహేనేళ్ల వయసులోనే పెళ్లి... భర్త... అత్తింటి బాధ్యతలు. ఇవేవీ ఆమె ఎదుగుదలకు అడ్డు కాలేదు. ఆత్మవిశ్వాసం అండగా... పట్టుదలే పెట్టుబడిగా... ఉన్నత ఆశయంతో అడుగులు వేసిన ఆమె... నేడు వేలమందికి ఉద్యోగాలిస్తున్నారు. మహిళల్లో చైతన్యం

Padma Shri Shashi Soni : నవతరానికి స్ఫూర్తిమంత్రం
Padma Shri Shashi Soni

పదిహేనేళ్ల వయసులోనే పెళ్లి... భర్త... అత్తింటి బాధ్యతలు. ఇవేవీ ఆమె ఎదుగుదలకు

అడ్డు కాలేదు. ఆత్మవిశ్వాసం అండగా... పట్టుదలే పెట్టుబడిగా... ఉన్నత ఆశయంతో

అడుగులు వేసిన ఆమె... నేడు వేలమందికి ఉద్యోగాలిస్తున్నారు. మహిళల్లో చైతన్యం

రగిలించి... వారిని ఉన్నత శిఖరాల వైపు నడిపిస్తున్నారు. వాణిజ్యం, పరిశ్రమల రంగాల్లో అలుపెరుగని కృషికి గుర్తింపుగా కేంద్రం ఆమెకు ‘పద్మశ్రీ’ పురస్కారం ప్రకటించింది.

ప్రముఖ పారిశ్రామికవేత్త... సామాజిక కార్యకర్త... శశి సోనీ కథ ఇది...

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘పద్మ’ పురస్కారాల్లో నలుగురు పారిశ్రామికవేత్తలు ఉన్నారు. వారిలో ఒకరు శశి సోనీ. బెంగళూరులోని ప్రసిద్ధ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ‘ఐజ్మో’ వ్యవస్థాపకురాలు ఆమె. 1996లో నెలకొల్పిన ఈ కంపెనీకి అన్నీ తానై నడిపిస్తున్నారు శశి. నేడు ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఆటోమొబైల్‌ సొల్యూషన్‌ ప్రొవైడర్‌గా దాన్ని తీర్చిదిద్దారు. వాణిజ్య, పారిశ్రామిక రంగాలను ప్రభావితం చేసిన మహిళగా ఆమె పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. 1971లో కేవలం పది వేల రూపాయలతో ముంబయిలో ‘డీప్‌ ట్రాన్స్‌పోర్ట్‌’ పేరిట వ్యాపార రంగంలోకి ప్రవేశించిన శశి... ఆ తరువాత అంచెలంచెలుగా ఎదిగారు. ఆ ట్రాన్స్‌పోర్ట్‌ కంపెనీ ఒకే ఒక్క కారుతో మొదలై... నాలుగేళ్లలో 10 కార్లు, 7 టెంపోలకు విస్తరించింది. పాకిస్తాన్‌లోని లాహోర్‌లో పుట్టిన శశి... కెరీర్‌ ఆరంభంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. అయితే ట్రాన్స్‌పోర్ట్‌ కంపెనీ వదిలేసి 1981లో మైసూరులో ‘డీప్‌ ఆక్సిజన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ స్థాపిచారు. ఇక అక్కడి నుంచి ఆమె వెనుదిరిగి చూసుకోలేదు. కెరీర్‌ రాకెట్‌ స్పీడ్‌తో దూసుకుపోయింది.

పెళ్లయినా...

సంప్రదాయ కుటుంబంలో పుట్టిన శశికి చిన్న వయసులోనే ఇంట్లోవాళ్లు పెళ్లి చేశారు. ‘అప్పుడు నాకు పదిహేనేళ్లు. ఢిల్లీ స్కూల్లో చదువుకొంటున్నా. ఆ సమయంలో మా అమ్మ నాకు పెళ్లి చేసింది. కానీ పెళ్లి తరువాత నేను చదువు ఆపదలుచుకోలేదు. మా అత్తమామలది సంప్రదాయ కుటుంబం. ఇంట్లో ఎడతెరిపి లేని పని. అత్తమామల బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత నాదే. దేశం విడిపోయాక పాకిస్తాన్‌లోని వారి ఆస్తులన్నీ పోయాయి. దీంతో మావారి సంపాదన మీద కుటుంబమంతా ఆధారపడాల్సి వచ్చింది. ఆయన స్టీల్‌ ప్లాంట్‌లో పని చేసేవారు. వీటన్నిటి నేపథ్యంలో నాకంటూ ఒక లక్ష్యం లేకపోతే భవిష్యత్తులో ఒడుదొడుకులు తప్పవనిపించింది. ఏంచేయాలని ఆలోచిస్తుంటే... మా సోదరుడు గుర్తుకువచ్చాడు. తను ముంబయిలో వ్యాపారవేత్త. మమ్మల్ని అక్కడకు రమ్మన్నాడు. అయితే మావారిని ఉద్యోగం మాన్పించి, తీసుకువెళ్లాలని నేను అనుకోలేదు. ఆయన్ను ఒప్పించి, నా పిల్లల్ని తీసుకుని ముంబయికి వెళ్లాను. మా సోదరుడికి పెట్రోలు బంకు, చిన్న గ్యారేజీ ఉండేవి. మా మామయ్య ఒకరు ఆ పెట్రోలు బంకు నిర్వహించేవారు. అందులో లెక్కలు చూడమని ఆయన నన్ను అడిగారు. నేను రాసిన అక్కౌంట్‌ బుక్స్‌ చూసిన సీనియర్‌ అక్కౌంటెంట్‌... నా వర్క్‌ సీఏలా ఉందన్నారు. ఇలా అందరి ప్రోత్సాహంతో వర్క్‌షాప్‌ పర్యవేక్షణ కూడా మొదలుపెట్టాను. అక్కడ అనుభవం, పరిచయాలు ట్రాన్స్‌పోర్ట్‌ కంపెనీ పెట్టడానికి ప్రేరణనిచ్చాయి. అలా ముప్ఫై ఏళ్ల వయసులో బిజినెస్‌ మొదలుపెట్టాను. తరువాత కొన్నేళ్లకు మావారు కూడా ముంబయిలోని ముకుంద్‌ స్టీల్‌కు మారారు’ అంటూ నాటి రోజులు గుర్తు చేసుకున్నారు శశి.

లిస్టెడ్‌ కంపెనీగా...

భారత పారిశ్రామిక రంగానికి చేస్తున్న కృషికి గానూ 1990లో ప్రతిష్టాత్మక ‘మహిళ గౌరవ్‌ పురస్కార్‌’ అందుకున్నారు శశి. ‘డీప్‌ ఆక్సిజన్‌’ కంపెనీ విజయవంతం కావడంతో శశి మరింత దూకుడు పెంచారు. 1995 వరకు ఆ కంపెనీ చైర్‌పర్సన్‌గా ఉన్న ఆమె... ఆ మరుసటి ఏడాదే ‘ఐజ్మో’కు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఆసియా, అమెరికా, ఐరోపా ఖండాల్లో ఈ కంపెనీ విస్తరించింది. స్టాక్‌ ఎక్స్‌చేంజ్‌లో లిస్టెడ్‌ కంపెనీగా అవతరించింది. దీని ద్వారా వేల మందికి ఆమె ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు.

మహిళా సాధికారతకు...

వ్యాపార కార్యకలాపాల్లో క్షణం తీరిక లేకుండా గడిపే శశి సోనీ... సమాజానికి ఎంతోకొంత తిరిగి ఇవ్వాలని తపించారు. అందులో భాగంగానే మహిళా సాధికారత దిశగా అడుగులు వేశారు. వికలాంగులకు అండగా నిలబడ్డారు. ‘డీప్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిటీ’ సభ్యురాలిగా మహిళలను విద్యావంతులుగా తీర్చిదిద్దే కార్యక్రమానికి పూనుకున్నారు. వారి కోసం పింఛను పథకాలు తీసుకువచ్చారు. నిధులు సేకరించి, వికలాంగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో నిరంతర కృషి చేస్తున్నారు. ‘ఆలిండియా ఇండస్ర్టియల్‌ గ్యాస్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ అసోసియేషన్‌’, ‘డైరెక్టరేట్‌ ఆఫ్‌ టెక్నికల్‌ డెవల్‌పమెంట్‌’ మేనేజింగ్‌ కమిటీల్లో సభ్యురాలిగా ఉన్నారు. తన సంస్థలో ఉద్యోగులను కుటుంబ సభ్యుల్లా భావించే శశి... వారి సంక్షేమం కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించారు.

ప్రతిష్టాత్మక పురస్కారం...

పారిశ్రామిక రంగంలో శశి సోనీ చేస్తున్న విశేష కృషిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆమెకు ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని ప్రకటించింది. ‘ఈ పురస్కారం నా బాధ్యతను మరింత పెంచింది. స్వయంశక్తితో ఎదిగిన ఒక మహిళగా ఎంతో గర్వంగా భావిస్తున్నా. నా ఈ సుదీర్ఘ ప్రయాణం కొందరికైనా ప్రేరణగా నిలుస్తుందని భావిస్తున్నా’ అంటున్న శశి సోనీ వయసు డెబ్భై ఐదు. కానీ ఇప్పటికీ ఆమెలో అదే ఉత్సాహం... పని పట్ల అంకితభావం. ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని ఆమె ఎదిగిన క్రమం... నవతరానికి స్ఫూర్తిమంత్రం.

Updated Date - Jan 28 , 2024 | 11:34 PM