Share News

క్షమాగుణం

ABN , Publish Date - May 24 , 2024 | 05:05 AM

మానవుల్లో క్షమాగుణం అత్యున్నతమైనదనీ, అది భగవంతుణ్ణి చేరువ చేసే మార్గం అనీ మహా ప్రవక్త మహమ్మద్‌ బోధించేవారు. బద్ధ శత్రువునైనా, తీవ్రంగా హాని

క్షమాగుణం

మానవుల్లో క్షమాగుణం అత్యున్నతమైనదనీ, అది భగవంతుణ్ణి చేరువ చేసే మార్గం అనీ మహా ప్రవక్త మహమ్మద్‌ బోధించేవారు. బద్ధ శత్రువునైనా, తీవ్రంగా హాని కలిగించడానికి ప్రయత్నించిన వారినైనా మన్నించడంలోనే మానవత్వం, దైవత్వం ఉన్నాయని చెప్పడమే కాదు... ఆచరించి కూడా చూపేవారు. అలాంటి సంఘటనలు ఆయన జీవితంలో ఎన్నో కనిపిస్తాయి.

ఒకసారి ఆయన తోటలో చెట్టుకు ఆనుకొని విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇది గమనించిన ఒక శత్రువు... ఆయనను హతమార్చడానికి ఇదే సరైన సమయం అనుకున్నాడు. కత్తితో ఆయన ముందుకు వచ్చి ‘‘ఇప్పుడు నిన్ను ఎవరు రక్షిస్తారు?’’ అంటూ కత్తి దూశాడు. ‘‘నన్ను అల్లాహ్‌ రక్షిస్తాడు’’ అని దైవప్రవక్త చెప్పారు. ఆయన ఆ మాట అంటూ ఉండగానే ఆ శత్రువు చేతిలోని కత్తి జారిపోయింది. ఆ కత్తిని దైవప్రవక్త తీసుకొని... ‘‘ఇప్పుడు నిన్నెవరు రక్షిస్తారు?’’ అని అడిగారు. ఆ వ్యక్తి వణుకుతూ ‘‘ఎవరూ లేరు’’ అన్నాడు. ‘‘నిన్ను కూడా ఆ అల్లా్‌హయే రక్షిస్తాడు’’ అంటూ ఆ వ్యక్తిని క్షమించి వదిలేసారు. తనకు విషం పెట్టాలనుకున్న మహిళను, తన పినతండ్రి హజ్రత్‌ హంజాను హతమార్చినవారిని, తన కుమార్తె జైనబ్‌ గర్భంతో ఉన్నప్పుడు ఆమెపై దాడి చేసి, గర్భస్రావం చేసినవారినీ, మక్కా నగరంలో తనపై దౌర్జన్యాలకు పాల్పడినవారిని సైతం ఆయన మన్నించారు.


దైవ ప్రవక్త రోజూ తన ఇంటి నుంచి మసీదుకు వెళ్ళే దారిలో ఒక మహిళ ఇల్లు ఉండేది. ఆమెకు ప్రవక్త అంటే కోపం. ఆయన వీధిలో నడుస్తున్నప్పుడు... తన ఇంటి మేడమీద నుంచి ప్రతిరోజూ చెత్తను ఆయనపై కుమ్మరించేది. ఆయన మౌనంగా వెళ్ళిపోయేవారు. ఒక రోజు ఆయన మసీదుకు వెళ్తూండగా... ఆ మహిళ కనిపించలేదు. వెంటనే ఆగి, పొరుగువారిని ఆమె గురించి ఆరా తీశారు. ఆమె అనారోగ్యంతో మంచానపడి ఉందని ఆయనకు తెలిసింది. ఆ ఇంట్లోకి వెళ్ళి... ఆమెను పరామర్శించారు. త్వరగా కోలుకుంటావని ధైర్యం చెప్పారు. దైవప్రవక్త వైఖరి ఆమెపై గొప్ప ప్రభావం చూపించింది. ఆ తరువాత... ద్వేషపూరితమైన పనులేవీ ఆమె చెయ్యలేదు. ఈ విధంగా... మనను ద్వేషించేవారి ప్రవర్తనలో క్షమాగుణంతో మార్పు తీసుకురావచ్చని దైవప్రవక్త నిరూపించారు.

మహమ్మద్‌ వహీదుద్దీన్‌

Updated Date - May 24 , 2024 | 05:05 AM