Share News

Story of Simran : మారుమూల పల్లె నుంచి మర్చంట్‌ నేవీలోకి

ABN , Publish Date - May 23 , 2024 | 05:35 AM

ఆర్థిక సమస్యలు, సామాజిక, లింగ, భాషా భేదాలు లాంటి అవరోధాలను అవలీలగా అధిగమించి, మర్చంట్‌ నేవీ ఆఫీసర్‌గా ఎదిగింది 25 ఏళ్ల సిమ్రన్‌ తోరట్‌. పూణెకు

Story of Simran : మారుమూల పల్లె నుంచి మర్చంట్‌ నేవీలోకి

ఆర్థిక సమస్యలు, సామాజిక, లింగ, భాషా భేదాలు లాంటి అవరోధాలను అవలీలగా అధిగమించి, మర్చంట్‌ నేవీ ఆఫీసర్‌గా ఎదిగింది 25 ఏళ్ల సిమ్రన్‌ తోరట్‌. పూణెకు చెందిన సిమ్రన్‌, కన్న కలను పట్టుదలగా నిజం చేసుకున్న తీరు గురించి తెలుసుకుందాం!

పూణెకు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇండాపూర్‌ నుంచి సిమ్రన్‌ తల్లితండ్రులు ఎప్పుడూ అడుగు బయట పెట్టలేదు. అయినా కూతురు, సప్త సముద్రాలు దాటి, పురుషాధిక్య వృత్తిలోకి అడుగుపెడతానంటే ఆ తల్లితండ్రులు భయపడకుండా వెన్ను తట్టి ప్రోత్సహించారు. కానీ వాళ్లకు ఆర్థిక సమస్య పెద్ద అవరోధంగా మారింది. పూణెలోని మర్చంట్‌ నేవీ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ మూడేళ్ల కోర్సుకు 9 లక్షలు వసూలు చేస్తూ ఉండడంతో, సిమ్రన్‌ తల్లితండ్రులు మరో ఆలోచన లేకుండా, మూడెకరాల వ్యవసాయ భూమిని అమ్మేశారు. నిజానికి ఆ భూమిలో పండే మొక్కజొన్న, గోధుమలు, చెరకు పంటలే వాళ్ల జీవనాధారం. అయినా కూతురి అభీష్టాన్ని నెరవేర్చడం కోసం కడుపు నింపే భూమిని సైతం అమ్మేయాలని నిర్ణయించుకున్నారు. ‘‘పెళ్లి నాటికి పదో తరగతి కూడా పాసవ్వని మా అమ్మ నాన్నను ఒప్పించింది. అప్పటికే నాన్న అన్నయ్య చదువు కోసం కొంత భూమిని అమ్మేశాడు. మిగతాది నా కోసం అమ్మడానికి సిద్ధ పడ్డాడు. వ్యవసాయం చేయడానికి భూమి లేకపోవడంతో, ఆయన ఎలక్ట్రీషియన్‌ వృత్తిలో కొనసాగడం కోసం, ఐటిఐలో శిక్షణ తీసుకున్నాడు. అమ్మ ఇండాపూర్‌లోని ఫెరారో చాక్లెట్‌ ఫ్యాక్టరీలో పని చేయడం మొదలు పెట్టింది’’ అంటూ తన కోసం భూమిని త్యాగం చేసిన తన తల్లితండ్రులు బ్రహ్మదేవ్‌, ఆశా తోరట్‌ల గురించి చెప్పుకొచ్చింది తన కుటుంబంలో, గ్రామంలో, జిల్లాలో మొట్టమొదటి మహిళా మర్చంట్‌ నేవీ ఆఫీసర్‌గా ఎదిగిన సిమ్రన్‌.

లోకుల నోళ్లు మూయించి...

సిమ్రన్‌ లక్ష్యానికి రెండో అవరోధం సమాజం నుంచి ఎదురైంది. బంధువులు, స్నేహితులు సిమ్రన్‌ తల్లితండ్రుల తెగింపును విమర్శించడం మొదలుపెట్టారు. ఓడలో నెలల తరబడి ఆడపిల్ల ఉద్యోగం చేయడం సరికాదనీ, ఆడపిల్ల చదువు కోసం అంత డబ్బు ఖర్చు పెట్టడం అవివేకమనీ సిమ్రన్‌ తండ్రిని ప్రభావితం చేయడానికి ప్రయత్నించారు. ‘‘నాన్న, వాళ్ల అనుమానాల మూలంగా తను తీసుకున్న నిర్ణయం ప్రభావితం కాకుండా జాగ్రత్త పడ్డారు. అలాగే అంతకు కొన్నేళ్ల ముందే ఇంజనీర్‌గా మర్చంట్‌ నేవీలో చేరిపోయిన అన్నయ్య కూడా మా నిర్ణయానికి అండగా నిలబడి నన్ను ప్రోత్సహించాడు. జపనీస్‌ షిప్పింగ్‌ కంపెనీలో థర్డ్‌ ఇంజనీర్‌గా పని చేస్తున్న అన్నయ్య, శుభమ్‌ తోరట్‌, నా నిర్ణయాన్ని సమర్ధించి, కెరీర్‌లో ఎదురయ్యే సవాళ్ల గురించి అవగాహన కల్పించాడు’’ అని తన లక్ష్యాలకు అందిన కుటుంబ సభ్యుల తోడ్పాటు గురించి వివరించింది సిమ్రన్‌.

చదువులో తడబడి...

చదివింది మరాఠీ మీడియం. కానీ మారిటైమ్‌ కాలేజీలో కోర్సు వర్క్‌ మొత్తం ఇంగ్లీషులోనే సాగడంతో సిమ్రన్‌ మొదట్లో కాస్త తడబడింది. ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ... ‘‘నేను ఎనిమిదో తరగతి వరకూ మరాఠీ మీడియంలోనే చదివాను. తర్వాత సెమి ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌లో చదివాను. మర్చంట్‌ నేవీ కోర్సు మొత్తం ఇంగ్లీషులో సాగడం, పూణె లాంటి నగరంలో ఒక్కదాన్నే ఉండవలసి రావడంతో మొదట్లో బాగా భయపడ్డాను. నా బ్యాచ్‌లో ఉన్న ముగ్గురు అమ్మాయిల్లో నేనొకదాన్ని. మొదటి రౌంట్‌ ప్లేస్‌మెంట్‌లో నేను రిజెక్ట్‌ అయ్యాను. ఆ అతి పెద్ద షిప్పింగ్‌ కంపెనీ నన్ను రిజెక్ట్‌ చేయడానికి కారణం నాకు ఇంగ్లీష్‌ భాష మీద పట్టు లేకపోవడమే! దాంతో నేను మొదట్లో బాధపడినా ఇంగ్లీషు భాష మీద పట్టు పెంచుకోవడం కోసం అన్నయ్యతో ఫోన్లో ఆ భాషలోనే మాట్లాడడం మొదలుపెట్టాను. అద్దం ముందు గంటల తరబడి ఇంగ్లీషు భాషను సాధన చేశాను. చివరి ఏడాది క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ సమయంలో, సీస్పాన్‌ అనే ప్రపంచంలోనే అగ్ర కంటెయినర్‌ షిప్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీకి నేను ఎంపికయ్యాను. అప్పటివరకూ ఆ కంపెనీ మహిళలను నియమించుకోలేదు. ఆ కంపెనీలో మొట్టమొదటి విమెన్‌ ఆన్‌ డెక్‌ కేడెట్‌గా ఎంపికైన మొదటి మహిళలను నేనే! అలా 2019లో సింగపూర్‌లో నేను ఉద్యోగంలో చేరాను. 24 మంది సిబ్బందిలో ఏకైక మహిళా ఉద్యోగినిగా ఏడు నెలల పాటు విధులు నిర్వహించాను. మొదట్లో సీ సిక్‌నెస్‌తో బాధపడినా నెమ్మదిగ ఆ ఇబ్బంది జయించాను’’ అని చెప్పుకొచ్చిన సిమ్రన్‌, పురుష సిబ్బందితో సమానంగా బరువైన టగ్‌ లైన్స్‌ను లాగడంతో పాటు, పోర్ట్స్‌లో స్వతంత్ర వాచ్‌గా కూడా విధులు నిర్వహించగలుగుతోంది. ఇప్పటివరకూ మూడు ఓడల్లో ప్రయాణించిన సిమ్రన్‌, థర్డ్‌ ఆఫీసర్‌గా నాలుగో ఓడలో ప్రయాణించడానికి సిద్ధపడుతోంది. అలాగే సిమ్రన్‌ తన అన్నతో కలిసి చదువు కోసం అమ్ముకున్న భూమిని తిరిగి కొని, తల్లితండ్రులకు బహూకరించాలనే ప్రయత్నంలో ఉండడం చెప్పుకోదగిన విశేషం.

సిమ్రన్‌ లక్ష్యానికి రెండో అవరోధం సమాజం నుంచి ఎదురైంది. బంధువులు, స్నేహితులు సిమ్రన్‌ తల్లితండ్రుల తెగింపును విమర్శించడం మొదలుపెట్టారు. ఓడలో నెలల తరబడి ఆడపిల్ల ఉద్యోగం చేయడం సరికాదనీ, ఆడపిల్ల చదువు కోసం అంత డబ్బు ఖర్చు పెట్టడం అవివేకమనీ సిమ్రన్‌ తండ్రిని ప్రభావితం చేయడానికి ప్రయత్నించారు.

Updated Date - May 23 , 2024 | 05:35 AM