నేటి అలంకారం శ్రీరాజరాజేశ్వరీ దేవి
ABN , Publish Date - Oct 12 , 2024 | 05:39 AM
శరన్నవరాత్రి మహోత్సవాల్లో... చివరి రోజైన విజయ దశమి నాడువిజయవాడ కనకదుర్గమ్మ శ్రీరాజరాజేశ్వరీ దేవిగా దర్శనమిస్తారు. ఆమె సకల భువన బ్రహ్మాండాలకు అధిదేవత. షోడశ మహామంత్ర స్వరూపిణి అయిన శ్రీరాజరాజేశ్వరిని మహాత్రిపుర సుందరిగా, అపరాజితాదేవిగా భక్తులు
ఆశ్వయుజ శుద్ధ నవమి/దశమి (విజయదశమి)- శనివారం
శరన్నవరాత్రి మహోత్సవాల్లో... చివరి రోజైన విజయ దశమి నాడువిజయవాడ కనకదుర్గమ్మ శ్రీరాజరాజేశ్వరీ దేవిగా దర్శనమిస్తారు. ఆమె సకల భువన బ్రహ్మాండాలకు అధిదేవత. షోడశ మహామంత్ర స్వరూపిణి అయిన శ్రీరాజరాజేశ్వరిని మహాత్రిపుర సుందరిగా, అపరాజితాదేవిగా భక్తులు ఆరాధిస్తారు. అపరాజితాదేవి పేరు మీద ‘విజయదశమి’ ఏర్పడింది. విజయాన్ని సాధించింది కాబట్టి ‘విజయ’ అని అంటారు. పరమ శాంత స్వరూపంతో, చిరునవ్వులు చిందిస్తూ, చెరుకుగడ చేతితో పట్టుకుని ఆమె దర్శనమిస్తుంది. మణిద్వీపంలో శ్రీపురంలో నివాసం ఉండే ఆమెను ‘చింతామణి’గానూ పిలుస్తారు. పరమేశ్వరుడి అంకం ఆసనంగా... ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులను భక్తులకు ఆమె అనుగ్రహిస్తుంది. మాయామోహితమైన మానవ చైతన్యాన్ని యోగమూర్తిగా ఉద్దీపనం చేస్తుంది. అనంత శక్తి స్వరూపమైన శ్రీ చక్రానికి అధిష్ఠాన దేవత అయిన శ్రీ రాజరాజేశ్వరీ దేవిని పూజిస్తే సమస్త శక్తులూ సమకూరుతాయనీ, మనసారా కొలిస్తే బ్రహ్మజ్ఞానాన్ని ఆమె కలుగజేస్తుందనీ నమ్మిక. దసరా ఉత్సవాల సంపూర్ణ పుణ్యాన్ని భక్తులందరికీ అందించే చల్లని తల్లి దుర్గమ్మను రాజరాజేశ్వరీ దేవి అలంకారంలో దర్శిస్తే సకల శుభాలు, విజయాలు లభిస్తాయన్నది భక్తుల విశ్వాసం. అమ్మవారిని ఎరుపు రంగు గాజులతో అలంకరించి, కుంకుమార్చన చేయడం శ్రేష్ఠం.
నైవేద్యం: పరమాన్నం, ఆరు రుచులతో కూడిన (షడ్రసోపేత) పదార్థాలు
అలంకరించే చీర రంగు: ఆకుపచ్చ, తెలుపు
వేటితో అర్చించాలి: ఎర్రటిపూలు
పారాయణ: చెయ్యాల్సినవి: లలితా సహస్రనామం