Share News

Meera Raghavendra : మహిళలకు గౌరవం... చొరవ... చైతన్యంతోనే

ABN , Publish Date - May 23 , 2024 | 05:39 AM

సెక్స్‌వర్కర్ల హక్కుల కోసం మూడు దశాబ్దాలుగా ఉద్యమం సాగిస్తున్నారు తిరుపతికి చెందిన సామాజిక కార్యకర్త మీరా రాఘవేంద్ర . అందుకోసం ‘ఉమెన్స్‌ ఇనీషియేటివ్‌’ సంస్థను నెలకొల్పారు. సెక్స్‌వర్కర్లను అసంఘటిత మహిళా

Meera Raghavendra : మహిళలకు గౌరవం... చొరవ... చైతన్యంతోనే

సెక్స్‌వర్కర్ల హక్కుల కోసం మూడు దశాబ్దాలుగా ఉద్యమం సాగిస్తున్నారు తిరుపతికి చెందిన సామాజిక కార్యకర్త మీరా రాఘవేంద్ర . అందుకోసం ‘ఉమెన్స్‌ ఇనీషియేటివ్‌’ సంస్థను నెలకొల్పారు. సెక్స్‌వర్కర్లను అసంఘటిత మహిళా కార్మికులుగా గుర్తించాలన్నది ఆమె ప్రధాన డిమాండ్‌. మరోవైపు మహిళా రైతులను, కూలీలను సంఘటితం చేసి... వారికి ఆధునిక వ్యవసాయ పద్ధతుల మీద అవగాహన కల్పిస్తున్నారు. ‘‘ఈ భూమి మీద ప్రతి మనిషికి సమానమైన గౌరవం దక్కాలన్నదే నా అభిమతం’’ అంటున్న మీరా తన సుదీర్ఘ సామాజిక, సేవా అనుభవాలను ‘నవ్య’తో పంచుకొన్నారు.

‘‘ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా, మానవ కల్పిత విపత్తులు ఎదురైనా, కొత్త జబ్బులు ఎవైనా సంక్రమించినా మొట్టమొదట అత్యంత తీవ్రంగా నష్టపోయేది మహిళలు. కాబట్టి ప్రతికూల పరిస్థితులను అవగాహన చేసుకొని, సమస్యల సుడిగుండాల నుంచి బయటకు రావడానికి... మహిళలకు వ్యక్తిగత చైతన్యం అవసరం. అలాంటి చైతన్యం పొందడానికి మనమే చొరవ తీసుకోవాలనీ, మన జీవితాల్ని మనమే కాపాడుకోవాలనీ నేను నమ్ముతాను. ఇదే భావనతో ముఫ్ఫై ఏళ్ళ కిందట తిరుపతిలో ‘ఉమెన్స్‌ ఇనీషియేటివ్‌’ స్వచ్ఛంద సంస్థ ప్రారంభించాను. అప్పటినుంచి సెక్స్‌వర్కర్లతో కలిసి వారి హక్కుల కోసం ఉద్యమిస్తున్నాను. పితృస్వామ్య వ్యవస్థలో ఇంటా బయటా మహిళలు ఎదుర్కొనే హింస అంతాఇంతా కాదు. అందులోనూ సెక్స్‌వర్క్‌ర్స్‌ లాంటి వృత్తిలో జీవితాన్ని గడుపుతున్న మహిళలు మరింత హింసను అనుభవించడం, దుర్భర జీవితాన్ని గడపడం కళ్లారా చూస్తూ ఊరుకోలేకపోయాను. అప్పుడప్పుడే హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ కేసులు ప్రబలుతున్న రోజులవి. దానివల్ల మహిళలు ఎక్కువమంది నష్టపోవడం నన్ను బాధించింది. సెక్స్‌వర్కర్లలోనే కాదు... చిన్నవయసులోనే వివాహమై, భర్తద్వారా ఈ వ్యాధికి గురై, తీవ్ర మనోవ్యథను అనుభవించిన అమ్మాయిలు ఎందరినో చూశాను. ఇదే విషయం మీద రుయా ఆస్పత్రిలో వైద్యుడైన నా భర్త చిత్తూరు ఆనందరావుతో చర్చిస్తే, ‘‘హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ మీద ముఖ్యంగా సెక్స్‌ వర్కర్లలో అవగాహన పెంచాలి’’ అని సూచించారు. అలా నా భర్త ప్రోత్సాహంతో 1994 నుంచి సెక్స్‌వర్కర్ల సమస్యల మీద పనిచేస్తున్నాను. సుమారు 12వేలమందికి మా సంస్థ సేవలు అందుతున్నాయి.

నన్ను సొంత అక్కగా భావించి...

హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ నివారణకు కండోమ్‌ వాడకం ఒక్కటే పరిష్కారం కనుక, ఆ విషయంపై సెక్స్‌వర్కర్లకు అవగాహన కల్పించడం మొదలు పెట్టాను. నిరోధ్‌ ఫొటో ఒకటి చేతపట్టుకొని... రోజూ సాయంత్రం తిరుపతి కోనేరు కట్టమీద వరుసగా కూర్చొన్న సెక్స్‌వర్కర్లు ఒక్కొక్కరి దగ్గరకెళ్లి, ‘‘మీ లైంగిక భాగస్వామి తప్పనిసరిగా కండోమ్‌ వాడేలా చొరవ తీసుకోండి. హెచ్‌ఐవీ బారి నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండి’’ అని చెబుతుంటే... కొందరు మాత్రమే వినేవారు. ఇంకొందరు నన్ను అనుమానంగా చూసి, పక్కకు తప్పుకొనేవారు. అయినా, నా ప్రయత్నం మాత్రం ఆపలేదు. అదే సమయంలో రోడ్డుమీద ఆడుకుంటున్న ఒక సెక్స్‌ వర్కర్‌ కొడుకును అకారణంగా పోలీసులు చిల్ట్రన్‌ హోమ్‌కు తరలించారు. ఆ సంగతి తెలిసి... పోలీసులతో, లాయర్లతో మాట్లాడాను. ఆ పిల్లాడు తిరిగి ఇంటికి చేరేవరకు ఆ తల్లికి నేను అడుగడుగునా అండగా ఉన్నాను. దాంతో ఆమె నన్ను సొంత అక్కగా భావించి, తన జీవితంలోని కష్టాలన్నింటిని నాతో పంచుకొంది. నా ఉద్దేశం చెప్పడంతో, మిగతా ప్రాంతాల్లోని సెక్స్‌వర్కర్లను కూడా పరిచయం చేసింది. వారికి హెచ్‌ఐవి, ఎయిడ్స్‌ గురించి అవగాహన కల్పిస్తున్న క్రమంలో... పోలీసులు, వీధి రౌడీలు, ఆకతాయిలు డబ్బుకోసం వారిని ఎంతగా హింసిస్తారో తెలిసింది. కొందరు తోడు కోసమో లేదంటే అద్దెకు ఇల్లు ఇవ్వరనో... ఎవరో ఒక పరిచయస్థుడిని భాగస్వామిగా ఎంచుకుంటారు. వాడు వీళ్ళను విపరీతంగా వేధిస్తుంటాడు. ‘‘ఈ సమస్యలన్నిటికీ ఒక్కటే పరిష్కారం. అది మీరంతా సమష్టిగా ఉండటమే’’ అని వారికి అర్థమయ్యేలా చేశాను. దాంతో సెక్క్‌వర్కర్లంతా బృందాలుగా ఏర్పాడ్డారు. ఒకరికి ఆపద వస్తే మిగతావారంతా అండగా నిలిచేవారు. అదే సమయంలో ప్రభుత్వం కూడా హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ నివారణ కార్యక్రమాలను సెక్స్‌ వర్కర్‌ కమ్యూనిటీ భాగస్వామ్యంతో నిర్వహించడంతో వారంతా ‘కమ్యూనిటీ బేస్ట్‌ ఆర్గనైజేషన్లు’ (సీబీఓలు)గా ఏర్పడ్డారు. దాంతో మా పని మరింత సులువయింది. అలా పన్నెండేళ్ళపాటు ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో హెచ్‌ఐవీ మీద విస్తృతంగా అవగాహన కల్పించాం. హెచ్‌ఐవీ బాధితుల్లో ఆత్మవిశ్వాసాన్ని నెలకొల్పి, వారి పిల్లల చదువును ప్రోత్సహించాం. వారిపట్ల సమాజంలో నెలకొన్న వివక్షను కొంతవరకు నిర్మూలించగలిగాం. ప్రత్యేక కౌన్సెలింగ్‌ కేంద్రాన్ని నిర్వహించాం. తద్వారా కొంతమేరకైనా సత్ఫలితాలను సాధించగలిగాం.

ఆ మార్పు తీసుకురాగలిగాం...

తామేదో తప్పు చేస్తున్నామన్న ఆత్మన్యూనత సెక్స్‌వర్కర్లను బాగా వేధించడం గమనించా. దాంతో తమ దగ్గర మిగిలిన నాలుగు రూపాయలను కూడా ‘పాపపు సొమ్ము’ అనుకొనేవారు. దాన్ని దాచుకోకుండా దుబారా చేసేవారు. రేపటి రోజు అనేది వారి జీవితంలో ఒకటుందనే ఆలోచన వారెవ్వరిలో నాకు కనిపించలేదు. వారిలో ఆత్మవిశ్వాసాన్ని కలిగించేందుకు పెద్దఎత్తున శిక్షణ శిబిరాలు, అవగాహనా తరగతులు నిర్వహించాం. తాము చేస్తున్నది తప్పుకాదన్న భావనను వారిలో కలిగించాం. సమాజంలోని ఇతరులతో సఖ్యతగా మెలిగేలా శిక్షణ ఇచ్చాం. దీనిలో పోలీసులను కూడా భాగస్వాముల్ని చేశాం. మొదట... వారానికి ముఫ్ఫై రూపాయలు పొదుపు చేసేలా ప్రోత్సహించాం. అప్పట్లో పోలీసులు చాలావరకు సెక్స్‌వర్కర్లను విపరీతంగా వేధించేవారు. వీళ్ళు అడ్డామీదకెళ్లి సంపాదించిన సొమ్మును వారు బలవంతంగా లాక్కునేవారు. ఎవరైనా డబ్బు ఇవ్వకుంటే... కక్షసాధింపులు ఉండేవి. కొందరు పోలీసులు లైంగికంగానూ వేధించేవారు. అకారణంగా అరెస్టు చేయడం, కేసు పెట్టడం, లాఠీలతో బాదడం తదితర రూపాల్లో సెక్స్‌వర్కర్ల మీద హింస విపరీతంగా ఉండేది. అదే అదనుగా వీధి రౌడీలు కూడా మరింత రెచ్చిపోయేవారు. ఇటువంటి పరిస్థితుల్లో... అందరూ సంఘటితంగా, అన్యాయానికి వ్యతిరేకంగా ఉద్యమిం చేలా మా ‘ఉమెన్స్‌ ఇనీషియేటివ్‌’ సంస్థ కృషి చేసింది.

ప్రత్యేక శిక్షణ...

సెక్స్‌వర్కర్లు తమతమ ప్రాంతాల్లో సంఘటితం కావడంతో... క్రమంగా పోలీసుల హింస కూడా చాలావరకు తగ్గింది. కొంతమంది మంచి పోలీసు అధికారులు ఉన్న ప్రాంతాలలో... వేధింపులు ఏమాత్రం ఉండేవి కావు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు విడుదల అయిన తర్వాత, వారి తీరు చాలా మారిందని చెప్పాలి. తిరుపతి, నెల్లూరు, ఏలూరు, కంచికచర్ల తదితర ప్రాంతాల్లోని సీబీఓలతో మేము ప్రస్తుతం పనిచేస్తున్నాం. తద్వారా వారికి చట్టాల మీద అవగాహన కల్పిస్తున్నాం. ట్రాన్స్‌జెండర్లపై వివక్ష రూపుమాపడానికి కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో సమావేశాలు నిర్వహిస్తున్నాం. అలా కర్నూలులోని ఒక కళాశాలవారు ట్రాన్స్‌ మహిళకు పోస్టుగ్రాడ్యుయేషన్‌ కోర్సులో సీటు ఇవ్వడానికి ముందుకొచ్చారు. ఇదివరకటిలా భయం భయంగా కాకుండా... ట్రాన్స్‌జెండర్లు, సెక్స్‌వర్కర్లు ఇప్పుడు ప్రభుత్వ అధికారులతో, సిబ్బందితో తమ సమస్యల గురించి ధైర్యంగా చర్చిస్తున్నారు. వారి హక్కుల గురించి మాట్లాడుతున్నారు. ఈమేరకు వారిని చైతన్యవంతుల్ని చేయగలిగాం. మా మార్గదర్శకత్వంతో చాలామంది సెక్స్‌వర్కర్లు వారి పిల్లలను బాగా చదివిస్తున్నారు. హెచ్‌ఐవీ బాధితుల్లో కూడా ఇప్పుడు ఆనందమయ జీవితాన్ని గడుపుతున్నవారు ఎందరో ఉన్నారు.

మహిళా రైతులు, కూలీల కోసం...

వ్యవసాయ రంగంలో కనీస గుర్తింపునకు నోచుకోని వారు మహిళా రైతు, కూలీలు. అందులో మహిళా కౌలు రైతుల కష్టాల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిజానికి వ్యవసాయ రంగంలో మహిళల పాత్ర, అందులోనూ అణగారిన వర్గాల మహిళల శ్రమ వెలకట్టలేనిది. ఇప్పుడు చాలా గ్రామాల్లో భూమిలేని దళిత మహిళలు కౌలు రైతులుగా మారారు. వీరికి వెన్నుదన్నుగా నిలవడం కోసం ‘ప్రణీక్ష మహిళా రైతు ఉత్పత్తిదారుల కంపెనీ’ ప్రారంభించాం. దీనిలో 300మందికి పైగా సభ్యులున్నారు. ఇందులో కొందరు ఒంటరి మహిళలు కూడా ఉన్నారు. వారికి అధునాతన వ్యవసాయ పద్ధతులమీద శిక్షణ ఇప్పించడం. సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, వారు పండించిన పంటను వారే నేరుగా అమ్ముకొనే అవకాశాలు కల్పించడం లాంటివి చేస్తున్నాం. షాంపూలు, సబ్బులు, పచ్చళ్ళు లాంటి ఉత్పత్తుల తయారీని ప్రోత్సహిస్తున్నాం. బ్యాంకు రుణాలు, రాయితీలు పొందడానికి వారికి ఉన్న అవకాశాలను తెలియజేస్తున్నాం.

ప్రతి మనిషికి సమాన గౌరవం

సెక్స్‌వర్కర్ల హక్కుల కోసం పనిచేసినా, మహిళా రైతు కూలీలను కూడగట్టినా ‘ఉమెన్స్‌ ఇనీషియేటివ్‌’ ప్రధాన లక్ష్యం... సామాజిక భద్రతకు నోచుకోని బాధిత మహిళలను ఐక్యం చేయడం, తద్వారా వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడం, సమష్టిగా సమస్యను అధిగమించవచ్చన్న విశ్వాసాన్ని కలిగించడం. ఒకరికికొకరు అండగా నిలిచే సంస్కృతిని పెంపొందించడం, వారికి ఉన్న అవకాశాలను, హక్కులను తెలియజేయడం... ఇవన్నీ మేము చేస్తున్న పనుల్లో ప్రధానమైనవి. మనుషులంతా ఒక్కటే. కుల, మత, లింగ, వర్ణ, వర్గ భేదాలకు అతీతంగా ప్రతి మనిషికి సమానమైన గౌరవం ఈ సమాజం నుంచి దక్కాలి. ధనిక, పేద అంతరాలు తగ్గాలి. అందుకోసం నా వంతుగా కృషి చేస్తున్నాను.’’

రెస్క్యూ హోమ్‌లు సాక్షాత్తూ యమకూపాలే

‘సెక్స్‌వర్కర్లను అసంఘటిత రంగ మహిళా కార్మికులుగా గుర్తించాలి’ అనేది మా ప్రధాన డిమాండ్‌. అక్రమ రవాణా ద్వారా లేదా బలవంతంగా ఈ వృత్తిలోకి వచ్చినవారెవరూ మేము పనిచేస్తున్న కమ్యూనిటీల్లో లేరు. వీరంతా కుటుంబ పరిస్థితులు అనుకూలించక లేదా కొన్ని అనివార్య కారణాలవల్ల ఇష్టపూర్వకంగానే సెక్స్‌వర్క్‌లోకి వచ్చారు. కనుక వారికి కార్మికుల హక్కులు వర్తింపచేయాలని చాలా కాలంగా అడుగుతున్నాం. సేవియర్స్‌ పేరుతో వీళ్ళనేదో ఉద్ధరిద్దామని రెస్క్యూ హోమ్‌లలో పెట్టడం లాంటి వాటిని మేము మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నాం. రెస్క్యూ హోమ్‌లంటే అచ్చంగా యమకూపాలే. వాటివల్ల ఎలాంటి మార్పు లేకపోగా... జీవితం మరింత దుర్భరంగా మారుతుంది. ఈ వృత్తిని మానేయాలని అనుకొన్నవారికి ప్రత్యామ్నాయ జీవనోపాధులు చూపించవచ్చు. సమాజంలో వీరిపట్ల ఉన్న వివక్ష, చులకన భావం పోవాలి. దీన్ని ఒక గౌరవప్రదమైన వృత్తిగా చూడాలి.

సాంత్వన్‌

Updated Date - May 23 , 2024 | 05:39 AM