Share News

కష్ట సుఖాల్లో సంయమనం అదే ఉగాది సందేశం

ABN , Publish Date - Apr 05 , 2024 | 10:31 AM

‘యుగాది’ లేదా ‘ఉగాది’ అనే పదం... ‘యుగ, ఆది’ అనే సంస్కృత పదాల కలయిక.. నూతన యుగానికి నాంది అయిన తిథే యుగాది పర్వదినం. ‘యుగం’ అంటే రెండు లేదా జంట అనే మరొక అర్థం కూడా ఉంది.

కష్ట సుఖాల్లో సంయమనం అదే ఉగాది సందేశం

‘యుగాది’ లేదా ‘ఉగాది’ అనే పదం... ‘యుగ, ఆది’ అనే సంస్కృత పదాల కలయిక.. నూతన యుగానికి నాంది అయిన తిథే యుగాది పర్వదినం. ‘యుగం’ అంటే రెండు లేదా జంట అనే మరొక అర్థం కూడా ఉంది. ఉత్తరాయణ, దక్షిణాయనాలు అనే ఆయన ద్వయం కలిగినది యుగం (సంవత్సరం). ఆ యుగానికి ఆది... యుగాది అయింది. అదే సంవత్సరాది. వివిధ కాలాలకు చెందిన ఋషులు ‘యుగం’ అనే పదాన్ని పలు విధాలుగా నిర్వచించారు. ‘యుగ’ అన్న ఒక్క పదమే వివిధ కాల పరిమాణాలను సూచిస్తుంది.

వేదాలను అపహరించిన సోమకుణ్ణి మత్స్యావతారం ధరించి వధించిన విష్ణువు... ఆ వేదాలను బ్రహ్మకు అప్పగించిన శుభ తరుణానికి చిహ్నంగా... ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. చైత్ర శుక్ల పాడ్యమి అయిన ఉగాది రోజునే సృష్టి జరిగిందని కూడా పేర్కొంటున్నాయి. అందుకనే మనకు చైత్ర మాసంతో... కొత్త ఏడాది ప్రారంభమవుతుంది. ఆ కొత్త ఏడాది తొలి రోజే ఉగాది. జడప్రాయమైన (అచేతనమైన) ఈ జగత్తులో చైతన్యాన్ని రగిలించి, మానవాళిలో నూతన ఆశయాలను అంకురింపజేసే శుభ దినమే ఉగాది. ఉగాది నుంచే తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది కాబట్టి... ఇది తెలుగువారి మొదటి పండుగ. ఉగాది రోజున కొత్త పనులను ప్రారంభించడం ఆనవాయితీ. ఈ రోజున ప్రాతఃకాలాన లేచి... ఇళ్ళు, వాకిళ్ళు శుభ్రపరుచుకుంటారు. ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి అలంకరిస్తారు. తలంటి స్నానం చేసి, కొత్త దుస్తులు ధరించి... ఉగాది పచ్చడి సేవనంతో దినచర్య ప్రారంభిస్తారు. తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలిసిన ఉగాది పచ్చడి తెలుగువారికే ప్రత్యేకమైనది. ఏడాది పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలనే సందేశాన్ని ఉగాది పండుగ, ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తాయి.

కలహ, కల్మషాలతో కూడిన కలియుగాన్ని ఒక ఇనుప యుగంగా పూర్వులు వర్ణించారు. అయితే ఈ యుగం ఎన్నో దుఃఖాలకు నిలయమైనప్పటికీ, దీనికి అద్భుతమైన లక్షణం ఒకటి ఉందంటూ... ‘‘కలియుగం దోషసాగరమే అయినప్పటికీ... దీనిలో ఉన్న మహా గుణం ఏమిటంటే... కేవలము ‘హరే కృష్ణ’ మహా మంత్రాన్ని జపించినంత మాత్రాన మానవుడు భవబంధ విముక్తుడై, పరంధామాన్ని చేరుతాడు’’ అని శ్రీమద్భాగవతం పేర్కొంది. కలియుగ ధర్మం హరినామ సంకీర్తనం. దాన్ని స్థాపించడానికి... అయిదువందల ఏళ్ళ క్రితం... పశ్చిమ బెంగాల్‌లోని నవద్వీప మాయాపూర్‌ ధామంలో... సాక్షాత్తూ భగవంతుడే శ్రీ చైతన్య మహాప్రభువుగా అవతరించారు. హరినామ సంకీర్తన ఉద్యమానికి నాంది పలికారు.

ఉగాది పర్వదినాన ఆచరించవలసినవి: శ్రీకృష్ణునికి ఉగాది పచ్చడి నివేదించి, దాన్ని ప్రసాదంగా ఇంటిల్లిపాదీ స్వీకరించండి. ‘హరే కృష్ణ’ మంత్రాన్ని రోజూ జపించడం ప్రారంభించండి. శ్రీకృష్ణ మందిరాన్ని దర్శించి, భగవంతుడి ఆశీస్సులను పొందండి. అన్నదానం, గోసేవ తదితర ధార్మిక కార్యక్రమాలలో పాలుపంచుకోండి.

Updated Date - Apr 05 , 2024 | 10:31 AM