Share News

Gagana : తైక్వాండోలో తడాఖా చూపిస్తూ

ABN , Publish Date - Jan 30 , 2024 | 11:17 PM

పిల్లలకు దెబ్బలు తగలకుండా సున్నితంగా పెంచుకుంటాం! కానీ హైదరాబాద్‌కు చెందిన రవి మంజూష, తన తొమ్మిదేళ్ల కూతురు గగనను తైక్వాండో ఫైటర్‌గా తీర్చిదిద్దుతోంది. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో గెలుపొందిన గగన, త్వరలో నేపాల్‌, అర్జెంటీనాల్లో

Gagana  : తైక్వాండోలో తడాఖా చూపిస్తూ

పిల్లలకు దెబ్బలు తగలకుండా సున్నితంగా పెంచుకుంటాం! కానీ హైదరాబాద్‌కు చెందిన రవి మంజూష, తన తొమ్మిదేళ్ల కూతురు గగనను తైక్వాండో ఫైటర్‌గా తీర్చిదిద్దుతోంది. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో గెలుపొందిన గగన, త్వరలో నేపాల్‌, అర్జెంటీనాల్లో జరగబోయే ప్రపంచ పోటీల్లో కూడా పాల్గొనబోతోంది. తైక్వాండో క్రీడ పట్ల గగనకు ఉన్న ఆసక్తి, సాధించిన విజయాల గురించి మంజూష ‘నవ్య’తో ఇలా పంచుకుంది.

‘‘అమ్మాయిల మీద ఆఘాయిత్యాలను ప్రతి రోజూ చూస్తున్నాం. చివరకు బడుల్లో కూడా పిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి. అలాంటప్పుడు ఆడపిల్లకు స్వీయరక్షణ అవసరమని అనిపించింది. అలా గగనకు తైక్వాండో శిక్షణ ఇప్పించడం మొదలుపెట్టాం. తక్కువ వ్యవధిలోనే తను ఆ క్రీడ మీద ఆసక్తినీ, పట్టునూ పెంచుకుంది. పైగా తెలంగాణా స్టేట్‌ పోలీస్‌ అకాడమీలో ట్రైనర్‌గా పని చేస్తున్న సుబ్బారావు మాస్టారు పాపకు గురువుగా మారారు. ఆయన తైక్వాండోలో ఒలంపిక్స్‌లో ఆరు సార్లు విజయం సాధించారు. అలా గత రెండున్నరేళ్లుగా ఆయన ఆధ్వర్యంలో గగన, తైక్వాండోలో పరిణతి సాధించగలిగింది.

దెబ్బ తగిలినా వెరవకుండా...

పోరాట క్రీడలో దెబ్బలనేవి సహజం. కానీ పాపకు తైక్వాండోలో ఎలాంటి దెబ్బలు తగలకపోయినా, రోడ్‌ డివైడర్‌కు తగిలి కాలికి గాయమైంది. దాంతో వెంటనే డాక్టరుకు చూపించాం. ఆయన కొద్ది రోజులు విశ్రాంతి అవసరం అన్నారు. కానీ రెండు రోజుల్లోనే ఇంటర్‌స్టేట్‌ లెవల్‌ పోటీలున్నాయి. ఆ పోటీల నుంచి తప్పుకుందాం అనుకున్నాం. కానీ గగన పోటీల్లో పాల్గొని తీరవలసిందేనని పట్టు పట్టింది. కాలు నొప్పిని సైతం లెక్క చేయకుండా పోటీలో పాల్గొని వెండి పతకాన్ని గెలుచుకుంది. తర్వాత దెబ్బ తగిలిన కాలి పరిస్థితి మరింత దిగజారి, సర్జరీ చేయించే పరిస్థితి తలెత్తింది. ఆ తర్వాత సర్జరీ అవసరం లేకుండా కొద్ది రోజుల విశ్రాంతితో నయమైపోవడంతో మేమంతా ఊపిరి పీల్చుకున్నాం. జాతీయ పోటీలకు ముందు కూడా గగనకు చికెన్‌ పాక్స్‌ సోకింది. అదృష్టవశాత్తూ ఆ పోటీలు నెల రోజులకు వాయిదా పడ్డాయి. ఈ క్రీడ శ్రమతో కూడుకున్నది కాబట్టి గగనకు డ్రై ఫ్రూట్స్‌, డ్రై ఫ్రూట్‌ లడ్డు, పళ్ల రసాలు లాంటి బలవర్ధకమైన ఆహారం అందిస్తూ ఉంటాం. రోజంతా చురుగ్గా ఉండడం కోసం, హుషారుగా తైక్వాండో శిక్షణ తీసుకోవడం కోసం పోషకాలతో కూడిన ఆహారాన్ని అందిస్తూ ఉంటాం. తైక్వాండో క్రీడకు తగ్గట్టుగా శరీరం చలాకీగా ఉండడం కోసం గగన, ఉదయాన్నే గంట పాటు బ్యాట్మింటన్‌ కూడా ఆడుతూ ఉంటుంది.

చదువులోనూ ముందంజే...

గగన రోజూ ఉదయాన్నే ఐదున్నరకే నిద్ర లేస్తుంది. తర్వాత గంట పాటు బ్యాట్మింటన్‌ ఆడుతుంది. తర్వాత ఒక గంట ట్యూషన్‌కు హాజరై ఎనిమిదిన్నరకు స్కూల్‌కు వెళ్తుంది. మధ్యాహ్నం మూడున్నరకు స్కూల్‌ నుంచి వచ్చిన తర్వాత గంట పాటు విశ్రాంతి తీసుకుని, అకాడమీకి వెళ్లి మూడు గంటల పాటు తైక్వాండో సాధన చేసి వచ్చి, గంట పాటు హోమ్‌వర్క్‌ పూర్తి చేసుకుని, తొమ్మిది గంటలకు నిద్ర పోతుంది. ప్రస్తుతం గగన అల్కాపురిలోని ఇలైట్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్లో మూడో తరగతి చదువుతోంది. సాధారణంగా పిల్లలు కొద్ది పాటి శ్రమకే అలసిపోతూ ఉంటారు. కానీ గగన ఇంత టైట్‌ షెడ్యూల్‌ను కొనసాగిస్తున్నప్పటికీ ఎప్పుడూ ఇతరత్రా వ్యాపకాల పట్ల ఆసక్తిని కనబరచలేదు. పోటీల్లో నెగ్గడమే లక్ష్యంగా కష్టపడుతూ ఉంటుంది. చదువులో కూడా తనది ముందంజే! మొదటి మూడు ర్యాంకుల్లోనే ఉంటూ ఉంటుంది.’’

వచ్చే నెల నేపాల్‌లో జరగబోయే ఏసియన్‌ తైక్వాండో ఛాంపియన్‌షిప్‌కూ, మేలో అర్జెంటీనాలో జరగబోయే వరల్డ్‌ తైక్వాండో ఛాంపియన్‌షిప్‌కూ ఎంపికైంది. ఈ పోటీలకు పాపను పంపించాలనే నిర్ణయించుకున్నాం. స్పోర్ట్స్‌ అథారిటీ ఆర్థిక సహాయాన్ని కోరాం!

మాది ఖమ్మం. హైదరాబాద్‌లో స్థిరపడ్డాం. మా వారు రవి కృష్ణ. ఐబిఎమ్‌లో సీనియర్‌ మేనేజర్‌. బాబు కాశ్విన్‌ ఎల్‌కెజిలో ఉన్నాడు. నేను చార్టర్డ్‌ అకౌంటెంట్‌గా పని చేశాను. కానీ గగనకు పూర్తి సమయాన్ని కేటాయించాలనే ఉద్దేశంతో ఇంటికే పరిమితమైపోయాను. పాల్గొన్న ప్రతి పోటీలో గగన గెలిచి తీరాలన్నది మా లక్ష్యం కాదు. పాప గెలుపోటములను సమానంగా స్వీకరించగలగాలి. మరీ ముఖ్యంగా తనను తాను అన్వేషించుకోవాలనే మేం కోరుకుంటూ ఉంటాం. పెరిగి పెద్దయ్యాక తాను ఏ రంగంలో స్థిరపడాలన్నది పాప నిర్ణయానికే వదిలేశాం!

గోగుమళ్ల కవిత

Updated Date - Jan 30 , 2024 | 11:17 PM