మగరాయుడని వెక్కిరించారు
ABN , Publish Date - Sep 25 , 2024 | 11:22 PM
రంగు బాలలక్ష్మీగౌడ్... కష్టాలు, కన్నీళ్లు, అవమానాలు, ఛీత్కారాలు... సినిమా కథకు ఏమాత్రం తీసిపోదు ఆమె జీవితం. అన్నిటినీ భరించి... ఉద్యమ బాటలో నడిచి... యువతరానికి స్ఫూర్తిమంత్రమయ్యారు.
రంగు బాలలక్ష్మీగౌడ్... కష్టాలు, కన్నీళ్లు, అవమానాలు, ఛీత్కారాలు... సినిమా కథకు ఏమాత్రం తీసిపోదు ఆమె జీవితం. అన్నిటినీ భరించి... ఉద్యమ బాటలో నడిచి... యువతరానికి స్ఫూర్తిమంత్రమయ్యారు. ‘తెలంగాణ బీసీ కమిషన్’లో మొట్టమొదటి మహిళా సభ్యురాలిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా తన పోరాట నేపథ్యాన్ని బాలలక్ష్మి ‘నవ్య’తో ఇలా చెప్పుకొచ్చారు.
‘‘తెలంగాణ బీసీ కమిషన్ సభ్యురాలిగా బాధ్యతలు స్వీకరించిన క్షణం నా హృదయం ఆనందంతో ఉప్పొంగింది. ఏ తెలంగాణ కోసమైతే ప్రాణాలకు తెగించి పోరాడానో, ఆ తెలంగాణ రాష్ట్ర చిహ్నం చెంతన ఉన్నత హోదాలో కొలువుదీరడం ఎంతో ఉద్వేగానికి గురి చేసింది. ఆ మధుర క్షణంలో నా గతం కళ్లముందు కదలాడింది. ఉమ్మడి వరంగల్ జిల్లా ‘మర్రి ముచ్చాల’ అనే మారుమూల పల్లెటూరులో ఓ నిరుపేద కల్లుగీత కార్మికుడి కూతురినైన నేను... ఇవాళ ఇక్కడి వరకు రాగలిగానంటే అదంతా తెలంగాణ పోరాట ఫలితమే.
మా అమ్మానాన్న ఐలయ్యగౌడ్, సువర్ణ. ఐదుగురు కూతుళ్లలో పెద్దమ్మాయిని. అప్పుడు నాకు ఆరేళ్లు ఉంటాయి. ఒకరోజు తెల్లవారుజామున పోలీసులు మా ఇంటికొచ్చి, తాటి చెట్లు ఎక్కడం, కరెంటు పని తప్ప మరో లోకం తెలియని మా నాన్నను ‘నక్సలైట్ల ఇన్ఫార్మర్’ అంటూ చిత్రహింసలు పెట్టారు. తనకేమీ తెలియదని నాన్న మొత్తుకున్నా వినకుండా అరెస్టు చేశారు. ఐలయ్య పేరుగల మరొకరి కోసం గాలిస్తూ, అదే పేరుగల మా నాన్నను పొరపాటున తీసుకెళ్లామని తెలుసుకొని, తర్వాత విడుదల చేశారు. ఖాకీ డ్రెస్‌కు అంత పవర్ ఉంటుందని చూసి, నిర్ఘాంతపోయాను. పెద్దయ్యాక నేనూ పోలీసు అవ్వాలని బలంగా నిశ్చయించుకున్నా. అయితే మనం ఒకటి తలిస్తే, విధి మరొకటి తలుస్తుంది అన్నట్టు తొమ్మిదో తరగతిలో ఉండగానే నాకు పెళ్లి చేశారు. అది నా జీవితంలో పెద్ద కుదుపు.
అక్కడే తొలి అడుగు...
పెళ్లి అయ్యి నెలలు గడుస్తున్నా... అత్తింటివాళ్లు నన్ను తీసుకెళ్లలేదు. ‘బాధపడుతూ కూర్చోవద్దు. మళ్లీ చదువు కొనసాగించ’మని నాయనమ్మ చెప్పింది. మా ఊరి హైస్కూల్లో చేరదామని వెళితే... ‘విద్యా సంవత్సరం మధ్యలో చేరి, మళ్లీ ఫెయిల్ అయితే స్కూలుకు చెడ్డ పేరు’ అని హెడ్‌మాస్టర్ కుదరదన్నారు. ‘ఈ అమ్మాయి మంచి మార్కులు తెచ్చుకుంటుంది చూడండి’ అని సుధాకర్ మాస్టారు నచ్చజెప్పడంతో నన్ను తరగతి గదిలోకి వెళ్లనిచ్చారు. ఆయన అన్నట్టుగానే పదో తరగతిలో ఫస్ట్‌క్లాసులో ఉత్తీర్ణత సాధించాను. చేర్యాలలో ఇంటర్ పూర్తయ్యాక, సిద్ధిపేటలో డిగ్రీలో చేరాను. అక్కడ నాకు సమాజాన్ని అర్థం చేసుకోవడానికి అవసరమైన సామాజిక అంశాలు పరిచయమయ్యాయి. మా తెలుగు అధ్యాపకుడు నందిని సిధారెడ్డి సారు కవిత్వం చదవడం ద్వారా తెలంగాణ అస్తిత్వ సోయి మాలో కలిగింది. గద్దరన్న పాటలు, ప్రొఫెసర్ జయశంకర్ సారు రాతలు, కాళోజీ కవితలు నాకు చైతన్య ప్రబోధాలయ్యాయి. వాటన్నింటి ప్రభావంతో ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష నాలో బలంగా నాటుకుంది.
నా లక్ష్యం ముఖ్యం కాదనుకున్నా...
నా జీవితాన్ని మలుపు తిప్పింది ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఎకనామిక్స్ పోస్టు గ్రాడ్యూయేషన్‌కు ఆర్ట్స్ కళాశాలలో అడుగుపెట్టాను. ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు సబ్‌ఇన్‌స్పెక్టర్ ఉద్యోగానికి సన్నద్ధమయ్యాను. అయితే ప్రిలిమ్స్‌లో విజయం సాధించినా, పరుగు పోటీలో కొద్ది తేడాతో అవకాశం చేజారింది. పీజీ పూర్తయ్యాక, ఉస్మానియా లా కాలేజీలో ఎల్‌ఎల్‌బీలో చేరాను. అది 2009... నవంబర్ 30. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మలుపు తీసుకొంటున్న సందర్భం... క్యాంప్‌సలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో మొదటి సంవత్సరం లా పరీక్షలు వాయిదా పడ్డాయి. గ్రూప్స్ ద్వారా డీఎస్పీ కావచ్చన్న ఉద్దేశంతో ఓయూ హాస్టల్‌లోనే ఉంటూ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాను. ఆ సమయంలో నా పీజీ క్లాస్‌మేట్ శ్రీను ఫోన్ చేసి, ‘ఆర్ట్స్ కాలేజీ దగ్గర విద్యార్థుల తలకాయలు పగులుతుంటే, మీరు హాస్టల్‌లో కూర్చొని చదువుకుంటున్నారా’ అన్నాడు. అసలు ఏమైందా అని టీవీ పెడితే కానీ మాకు తెలియలేదు అంత పెద్దఎత్తున నిరసన జ్వాలలు ఎగసిపడుతున్నాయని. ఇక ఆలోచించలేదు. హాస్టల్‌లో ఉన్న విద్యార్థినులను వెంటబెట్టుకుని ర్యాలీకి వెళ్లాను. ఆ రోజు నుంచి వెనక్కి తిరిగి చూడలేదు. పోలీసు అవ్వాలన్న నా లక్ష్యంకన్నా తెలంగాణ సాధనే అత్యంత ముఖ్యం అనిపించింది.
మొదటి అమ్మాయిని...
మలి దశ తెలంగాణ పోరాటంలో భాగంగా ఓయూలో సాగిన రీలే నిరాహార దీక్షలో కూర్చున్న మొట్టమొదటి అమ్మాయిగా నన్ను గూడ అంజయ్య లాంటి ప్రముఖ కవి గుర్తించి, పూల మాలతో సత్కరించారు. నా జీవితంలో మరిచిపోలేని మధురానుభూతి అది. ఓయూ విద్యార్థి జాయింట్ యాక్షన్ కమిటీ అధికార ప్రతినిధిగా... విద్యార్థి మహాగర్జన, మహాపాదయాత్ర, ఛలో అసెంబ్లీ, మిలియన్ మార్చ్, పొలికేక ఇలా... తెలంగాణ కోసం సాగిన ప్రతి కార్యక్రమంలో ముందున్నాను. హైకోర్టులో తెలంగాణ న్యాయవాదుల దీక్షకు మద్దతుగా 30మంది విద్యార్థులను వెంట తీసుకెళ్లిన నన్ను ఒక లేడీ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ దారుణంగా కొట్టింది. నా కుడి చెయ్యి వెనక్కి విరిచిమరీ పిడిగుద్దులు గుద్దింది. ఇప్పటికీ ఆ చెయ్యి వెనక్కి వంచలేను. మరొక సందర్భంలో పోలీసులు ఉరికించి కొట్టడంతో స్పృహతప్పి పడిపోయాను. రబ్బరు బుల్లెట్లు, పెల్లెట్లు... ఒక్కటి కాదు, ఎన్నో దెబ్బలు తిన్నాను. అయినా, భయపడలేదు. ఒకరోజు మా నాన్న ఫోన్ చేసి ‘అమ్మా... నీకేమైనా అయితే భరించలేం. ఉద్యమాలు మనకు వద్దు’ అన్నాడు. ఆ వెంటనే అమ్మ కల్పించుకొని, ‘అది పోతే, మనకు ఇంకా నలుగురున్నారు.
అమ్మాయిని ఆపకు’ అన్న మాటలు... ఇప్పటికీ నా చెవుల్లో మార్మోగుతున్నాయి. ఒకటా రెండా... 500కు పైగా సభల్లో తెలంగాణ గళాన్ని వినిపించాను. నా మీద అటెంమ్ట్ టు మర్డర్‌తో పాటు 30 కేసులు బనాయించారు. ఆ సమయంలో నా నలుగురు చెల్లెళ్లు ఆర్థిక సాయం అందించారు. మరెంతో మంది అండగా నిలిచారు. తెలంగాణ మలిదశ పోరాట చరిత్రలో ఆర్ట్స్ కాలేజీది ప్రముఖ అధ్యాయమైతే, అందులో నేనూ ఒక పేజీ అయినందుకు గర్వంగా ఉంది.
కారు... కరెన్సీ లేకున్నా...
అదే ఓయూ నుంచి ఎల్‌ఎల్‌ఎమ్ పట్టా పొందాను. ప్రస్తుతం అక్కడే ‘రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం’ అంశం మీద పీహెచ్‌డీ చేస్తున్నాను. 2016లో నన్ను రేవంత్ అన్న కాంగ్రె్‌సలోకి ఆహ్వానించారు. పార్టీ లీడర్‌షిప్ డెవల్‌పమెంట్ మిషన్ కోఆర్డినేటర్‌గా, తుంగతుర్తి నియోజకవర్గం పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జిగా... ఇలా నాకు అప్పగించిన ప్రతి బాధ్యతనూ శక్తివంచన లేకుండా నిర్వర్తించాను. నా నిజాయితీకి దక్కిన గుర్తింపు, గౌరవమే బీసీ కమిషన్ సభ్యురాలి పదవి. అన్ని పార్టీల్లో నన్ను అభిమానించేవాళ్ళు ఉన్నట్టే, అవమానించేవాళ్ళూ ఉంటారు. ‘‘సొంతిల్లు, కారులేని ఆమె ఎమ్మెల్యే ఎలా అవుతుంది. ఆటోల్లో బస్సుల్లో తిరిగే తనకు ఈ రాజకీయాలు అవసరమా’ అని నా ముందే హేళన చేసినవారున్నారు. ‘మగరాయుడు లెక్క కుర్తాపైజమా వేసుకుంటుంద’ని నా వస్త్రధారణను వెక్కిరించిన వారున్నారు. అవేవీ పట్టించుకోలేదు. నా అంతిమలక్ష్యం చట్టసభల్లో అడుగుపెట్టడమే. కారు, కరెన్సీ, ఖద్దరు లేకున్నా బహుజన ఆడబిడ్డలు రాజకీయాల్లో రాణించగలరన్న నమ్మకాన్ని కలిగించడానికి నా వంతు ప్రయత్నిస్తాను.’’
పెళ్లి పెద్దగా బాపూజీ...
నన్ను తెలంగాణ మలిదశ పోరాటంవైపు నడిపించిన నా క్లాస్‌మేట్ కందకట్ల శ్రీనివా్‌సతో 2011లో నా వివాహమైంది. ఆయనది జనగాం దగ్గర నర్మేట గ్రామం. చేనేత కుటుంబ నేపథ్యం. నా మీద వాత్సల్యం కొద్దీ మా పెళ్లి పెద్దగా వ్యవహరించిన కొండా లక్ష్మణ్ బాపూజీ ‘‘నేత- గీత బంధం ఈనాటిది కాదు’’ అని మమ్మల్ని దీవించారు. మాకు ఒక అమ్మాయి. చే గువేరా మీద అభిమానంతో పాపకు ‘చేశ్రీ’ అని పేరు పెట్టాం
అలా కించపరచడం తగదు...
తెలంగాణ మలిదశ పోరు సమయంలో మద్దతు ప్రకటించడానికి ఓ రోజు మా దీక్షా శిబిరానికి వచ్చిన ఒక నాయకుడు ప్రసంగిస్తూ, ‘మనమేమీ చేతులకు గాజులు తొడుక్కోలేదు’ అని ప్రస్తావించాడు. ఆయన మాటలకు నేను అడ్డుపడి, ‘‘అన్నా! ఆడవాళ్ళను కించపరిచేలా మాట్లాడద్దు’’ అని హెచ్చరించాను. ఆ నాయకుడు సభాముఖంగానే తన తప్పు ఒప్పుకొని క్షమాపణలు తెలిపాడు. ఈ రోజుకూ చాలామంది రాజకీయ నాయకులు ‘చీర, గాజులు’ అంటూ స్త్రీలను కించపరిచేలా మాట్లాడుతున్నారు. అలాంటి వాటిని ఒక మహిళగా ఉపేక్షించను.
సాంత్వన్
ఫొటోలు: రాజ్‌కుమార్