Share News

రాజబాబుని విభిన్నంగా చూపించిన తిరపతి

ABN , Publish Date - Jan 28 , 2024 | 12:29 AM

హాస్యనటుల్లో రాజబాబుది ఓ శకం. ఓ దశాబ్దం పాటు ఆయన చిత్ర పరిశ్రమను ఏలేశారు. తెరపై ఆయన కనిపిస్తే చాలు జనం ఆనందంతో ఈలలు వేసేవారు. గోలగోల చేసేవారు. సినిమాలో హీరో ఎవరైనా హాస్యనటుడిగా మాత్రం

రాజబాబుని విభిన్నంగా చూపించిన తిరపతి

హాస్యనటుల్లో రాజబాబుది ఓ శకం. ఓ దశాబ్దం పాటు ఆయన చిత్ర పరిశ్రమను ఏలేశారు. తెరపై ఆయన కనిపిస్తే చాలు జనం ఆనందంతో ఈలలు వేసేవారు. గోలగోల చేసేవారు. సినిమాలో హీరో ఎవరైనా హాస్యనటుడిగా మాత్రం రాజబాబు ఉండాల్సిందే. ఆ రోజుల్లో ఆయనకు ఉన్న ఫాలోయింగ్‌, పాపులారిటీ అలాంటిది. దర్శకుడు దాసరి నారాయణరావు, రాజబాబు మధ్య చక్కని అనుబంధం ఉండేది. దాసరిని ఆయన ‘బావా’ అని పిలిచేవారు.

ఇటువంటి పాపులర్‌ కమెడియన్‌ను ‘తాత-మనవడు’ చిత్రంతో హీరోగా పరిచయం చేశారు దాసరి. దర్శకుడిగా దాసరికి అదే తొలి చిత్రం. ‘తాత-మనవడు’ చిత్రం ఘన విజయం సాధించింది. ఆ తర్వాత దాసరి దర్శకత్వంలోనే రాజబాబు మరోసారి ‘తిరపతి’ చిత్రంలో హీరోగా నటించారు.

రాజబాబునీ, ఆయన టాలెంట్‌ను దృష్టిలో పెట్టుకుని ‘తిరపతి’ పాత్ర తయారు చేశారు దాసరి. వయసు వచ్చినా మానసికంగా ఎదగని పాత్ర అది. తిరపతి పుట్టినప్పుడు పుట్టెంట్రుకలు తిరుపతిలో ఇవ్వాలని అతని తల్లి అనుకుంటుంది. అయితే ఎప్పటికప్పుడు తిరుపతి ప్రయాణం వాయిదా పడుతుంటుంది. చివరికి 25 ఏళ్లు వచ్చినా ఆ మొక్కు తీరక పోవడంతో జుట్టు బాగా పెరగడంతో జడ వేసుకుని తిరుగుతుంటాడు తిరపతి. అతనికి ఓ చెల్లెలు. ఈ పాత్రను జయసుధ పోషించారు. చెల్లెలు పెళ్లి చేయడం కోసం డబ్బు సంపాదించడానికి పట్నం వెళ్లిన తిరపతి ఎటువంటి ఇబ్బందులు పడ్డాడన్నదే మిగిలిన కథ.

ఈ సినిమాలో రాజబాబుకు బారిస్టర్‌ పార్వతీశాన్ని పోలిన గెటప్‌ ఇచ్చారు. బారెడు జడ, పంచె కట్టు, చేతిలో గొడుగు, ముఖంలో అమాయకత్వం.. విభిన్నంగా కనిపించిన రాజబాబుని చూడడానికి థియేటర్లకు ఎగబడ్డారు జనం.

ఈ సినిమాలో అల్లు రామలింగయ్య అతిధి పాత్ర పోషించారు. ‘దేశం పన్నెండు సార్లు తిరిగానే నారాయణమ్మా’ అనే పాటను ఆయనతోనే పాడించారు దాసరి. రామలింగయ్య, గిరిజపై ఈ పాట చిత్రీకరించారు.

1974 ఆగస్టు 15న ‘తిరపతి’ విడుదల కావాలి. కానీ సెన్సార్‌ సమస్య కారణంగా విడుదల ఆగింది. చివరకు అక్టోబర్‌ 5న సినిమా విడుదల చేశారు. ఆ రోజుల్లో ఎన్టీఆర్‌ చిత్రాలకు వచ్చే భారీ ఓపెనింగ్స్‌ ‘తిరపతి’ చిత్రానికి రావడం గమనార్హం. అయితే సినిమా అనుకున్న విధంగా విజయం సాధించలేదు.

Updated Date - Jan 28 , 2024 | 12:29 AM