మహిళా ఉద్యోగుల్లో మానసిక ఒత్తిడి
ABN , Publish Date - Oct 10 , 2024 | 01:18 AM
ఒక శక్తివంతమైన స్త్రీ, శక్తివంతమైన సమాజాన్ని నిర్మించగలుగుతుంది. గృహిణిగా కుటుంబ ఆలనా పాలనా చూసే స్థాయి నుంచి, నేడు ఒక దేశాధినేతగా, బహుళజాతి కంపెనీలకు అధిపతిగా పని చేసే స్థాయికి మహిళ ఎదిగింది. ఈ ప్రయాణంలో మహిళ, ఎన్నో సవాళ్లనూ, అవరోధాలనూ అధిగమించింది.
నేడు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం
ఒక శక్తివంతమైన స్త్రీ, శక్తివంతమైన సమాజాన్ని నిర్మించగలుగుతుంది. గృహిణిగా కుటుంబ ఆలనా పాలనా చూసే స్థాయి నుంచి, నేడు ఒక దేశాధినేతగా, బహుళజాతి కంపెనీలకు అధిపతిగా పని చేసే స్థాయికి మహిళ ఎదిగింది. ఈ ప్రయాణంలో మహిళ, ఎన్నో సవాళ్లనూ, అవరోధాలనూ అధిగమించింది.
మొదటి నుంచీ మహిళల పట్ల సమాజానిది చిన్న చూపే! 18వ శతాబ్దంలో పారిశ్రామిక విప్లవం భారీ పరిశ్రమల ఏర్పాటు సమయంలో పురుషులనే ప్రధానంగా కార్మికులుగా నియమించుకునేవారు. మహిళలను పనుల్లోకి తీసుకున్నప్పటికీ, తక్కువ వేతనానికి, తక్కువ స్థాయి పనులకే కేటాయించేవారు. కాలక్రమేణా మహిళలు విద్యార్హతలు, ప్రావీణ్యాలను పెంచుకున్నారు. సాంకేతిక విద్య, వృత్తి ఉపాధి కోర్సుల్లో చేరడం వల్ల స్త్రీవాదం, స్త్రీ సాధికారిత భావనలు విశేషంగా వ్యాప్తి చెందిన తర్వాత అన్ని రంగాల్లో స్త్రీలు, పురుషులతో సమానంగా పోటీ పడే పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో కేవలం 8ు మంది మహిళలు మాత్రమే పైస్థాయి అధికారులుగా నియమితులవుతున్నారు. భారతదేశంలో ఇలాంటి మహిళల సంఖ్య 2ు కంటే తక్కువ.
ఉద్యోగాల్లో ప్రతిబంధకాలు
మానస చిన్నతనం నుంచీ చదువులో చురుగ్గా ఉండేది. పైచదువుల కోసం బయటి దేశాలకు వెళ్లి, అక్కడే స్థిరపడాలని భావించేది. కానీ పెళ్లి కాని ఆడపిల్లను అంత దూరం పంపించలేమని తల్లితండ్రులు ఆమెను నిరాశపరిచారు. పెళ్లి చేసుకుని భర్తతో బయటి దేశాలకు వెళ్లి చదువుకోవచ్చని ఉచిత సలహా ఇచ్చారు. తల్లితండ్రుల్లో ఇలాంటి ఆలోచనా ధోరణి, అమ్మాయిలను నిరుత్సాహపరుస్తోంది. విద్య, ఉద్యోగావకాశాలను కోల్పోయేలా చేస్తోంది. ఉద్యోగాల్లో చేరడానికి కంపెనీలు కూడా మహిళలకు కొన్ని నిబంధనలు పెడుతున్నాయి. ఉద్యోగంలో చేరిన ఐదేళ్ల వరకూ పెళ్లి చేసుకోకూడదని కంపెనీలు నిబంధనలు పెట్టడానికి కారణం, పెళ్లయ్యాక, గర్భ దాల్చడం, ప్రసవం మూలంగా మహిళలు సెలవులు పెడితే, పనులకు ఆటంకం కలుగుతుందని కంపెనీలు భయపడడమే! అయితే ఇలాంటి అత్యవసర సమయాల్లో సెలవులను నిర్బంధంగా అమలు చేయాలని ప్రభుత్వం సూచించింది. కానీ చిన్న స్థాయి కంపెనీలు ఈ నిబంధనను పాటించడం లేదు. అంతేకాకుండా, మహిళలకు ప్రయోషన్లు కల్పించడానికి కూడా కంపెనీలు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నాయి.
మానసిక ఒత్తిడి, కుంగుబాటు
1975 తర్వాత రెండు సంపాదనలు అనే భావన వ్యాపించింది. మన దేశంలో గత 25 ఏళ్లుగా దంపతులిద్దరూ ఉద్యోగాలు చేసే సంస్కృతి పెరిగిపోయింది. భార్యాభర్తలిద్దరూ వేర్వేరు షిఫ్టుల్లో, వేర్వేరు ప్రదేశాల్లో పని చేయడంవల్ల వాళ్ల మధ్య మానసిక బంధం బలహీనపడుతోంది. అలాగే ఉద్యోగం కోసం వేరే ఊర్లకు ట్రాన్స్‌ఫర్ అయ్యే సమయంలో, భర్తకు దూరంగా తెలియని ప్రదేశంలో, తెలియని వాతావరణంలో, భాష తెలియని ప్రదేశంలో ఉద్యోగం చేయవలసి వస్తోంది. ఫలితంగా మహిళలు మానసిక ఒత్తిడి, కుంగుబాటుకు గురవుతూ ఉంటారు. ఒంటరితనాన్ని దూరం చేసుకోవడం కోసం పక్కదారి పట్టే పరిస్థితలు కూడా తలెత్తుతూ ఉంటాయి. వివాహిత మహిళలు అటు వృత్తి బాధ్యతలూ, ఇటు కుటుంబ బాధ్యతలూ రెండింటినీ సమర్థంగా నిర్వహించవలసిన అవసరం ఉంటుంది. ఈ క్రమంలో అనారోగ్యం బారిన పడడం, పిల్లలు దీర్ఘకాలిక అనారోగ్యాలకు గురైతే ఏకంగా ఉద్యోగాన్నే వదులుకోవలసి వస్తున్న సందర్భాలూ ఉంటున్నాయి.
కుటుంబ తోడ్పాటు
పని ప్రదేశంలో వేధింపులు, ఆధిపత్య ధోరణులు, మహిళలకు ప్రతిబంధకాలుగా మారుతున్నాయి. ప్రతి మనిషీ జీవితకాలంలో 90 వేల గంటలు పని ప్రదేశంలో గడుపుతాడు. కాబట్టి పని చేసే చోట మానసిక ఆరోగ్యానికి విశేషమైన ప్రాధాన్యం ఇవ్వవలసిన అవసరం ఉంది. పని ప్రదేశంలో నిర్మొహమాటంగా వ్యవహరించగలగాలి. పురుషుల వల్ల తన స్వేచ్ఛకు, సౌకర్యానికీ భంగం కలిగితే ఆ విషయాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లాలి. సమస్యలను కుటుంబంతో పంచుకుని, వారి సలహాలు, సూచనలు తీసుకోవాలి. అవసరాన్ని బట్టి మానసిక వైద్యుల సహాయం తీసుకోడానికి వెనుకాడకూడదు.
స్వీయ శ్రద్ధ
మహిళలు స్వీయ సంరక్షణ మీద దృష్టి పెట్టాలి. నచ్చిన సంగీతం వినడం, నచ్చిన ఆహారం తినడం, యోగా, పుస్తక పఠనం, ధ్యానం, నడక లాంటివి మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ప్రతి రోజూ ఏడు నుంచి ఎనిమిది గంటలకు తగ్గకుండా నిద్రపోవాలి. మహిళల పరిపూర్ణ శ్రేయస్సు కోసం సంస్థలు, యాజమాన్యాలు తగిన వెసులుబాట్లు కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉంది. సమాజ అభివృద్ధికీ, దేశ పురోగతికీ స్త్రీ సాధికారత ఎంతో దోహదపడుతుంది. కాబట్టి స్త్రీలను గౌరవిద్దాం, ప్రోత్సహిద్దాం, ఎదగనిద్దాం!
డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి
మానసిక నిపుణులు, 9348114948