Share News

Lady Tarzan of Jharkhand : ‘మొక్క’వోని దీక్ష... పర్యావరణానికి రక్ష

ABN , Publish Date - Jan 30 , 2024 | 11:11 PM

ముప్ఫై ఆరేళ్ళు... 500 గ్రామాలు... 30 లక్షల మొక్కలు... 2,800 స్వయం సహాయక బృందాలు ఏర్పాటు ద్వారా 30 వేల మందికి పైగా మహిళలకు స్వయం ఉపాధి. ‘జార్ఖండ్‌ లేడీ టార్జాన్‌’ ఛామీ ముర్ము సాధించిన ఘనతల్లో ఇవి కొన్ని. ఈ ఏడాది ‘పద్మశ్రీ’ పురస్కారం పొందిన

Lady Tarzan of Jharkhand : ‘మొక్క’వోని దీక్ష... పర్యావరణానికి రక్ష

ముప్ఫై ఆరేళ్ళు... 500 గ్రామాలు... 30 లక్షల మొక్కలు... 2,800 స్వయం సహాయక బృందాలు ఏర్పాటు ద్వారా 30 వేల మందికి పైగా మహిళలకు స్వయం ఉపాధి. ‘జార్ఖండ్‌ లేడీ టార్జాన్‌’

ఛామీ ముర్ము సాధించిన ఘనతల్లో ఇవి కొన్ని. ఈ ఏడాది ‘పద్మశ్రీ’ పురస్కారం పొందిన

ఆమె తన జీవితాన్ని పర్యావరణ పరిరక్షణకు, మహిళల శ్రేయస్సుకు అంకితం చేశారు.

అది 1996. ఒక రోజు తెల్లవారుజామునే ఎవరో తలుపు తట్టడంతో నిద్ర నుంచి మేలుకున్నారు ఛామీ ముర్ము. వీధిలో జనం గట్టిగా మాట్లాడుకుంటున్న శబ్దాలు. తలుపు తీసి చూశారు. చాలామంది మహిళలు ఆమె ఇంటి బయట నిలబడి ఉన్నారు. వారిలో ఆందోళన, ఆగ్రహం కనిపిస్తోంది. ‘‘మొక్కలన్నీ నరికేశారమ్మా!’’ అని వాళ్ళు కన్నీరు మున్నీరవుతూ చెప్పిన మాటలు విని ఛామీ దిగ్ర్భాంతి చెందారు. వాళ్ళను సముదాయిస్తూ, ఊరి బయటకు వెళ్ళి చూశారు. లక్ష మొక్కలు! ఎనిమిదేళ్ళ పాటు ఒక యజ్ఞంలా సాగించిన మొక్కలు నాటే కార్యక్రమంలో ఆ మైలురాయిని కొద్ది రోజుల ముందే చేరుకున్నారు. చూస్తే ఒక్క మొక్కనైనా మిగల్చకుండా అన్నిటినీ నరికేశారు. అది గ్రామంలోని కొందరు పురుషులు చేసిన పనేనని ఆమెకు తెలుసు.

చెట్లు ఉంటేనే మనుగడ...

యాభై రెండేళ్ళ ఛామీ స్వగ్రామం జార్ఖండ్‌లోని సరైకేలా ఖార్సావాన్‌ జిల్లా భుర్‌సాయ్‌ గ్రామం. ఆమె పదోతరగతిలో ఉండగా... ఒక ప్రమాదంలో తండ్రినీ, అన్నను కోల్పోయారు. అనారోగ్యంతో ఉన్న తల్లి, ముగ్గురు తోబుట్టువుల సంరక్షణ బాధ్యత మీద పడడంతో చదువు ఆపెయ్యాల్సి వచ్చింది. ఊళ్ళోనే వ్యవసాయ పనులు చేసేవారు. 1988లో, ఒక స్నేహితురాలి ప్రోత్సాహంతో... అక్కడికి సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక పట్టణంలో... గ్రామీణ మహిళల వికాసంపై నిర్వహించిన సదస్సుకు ఆమె హాజరయ్యారు. మహిళలు స్థానికంగా ఉపాధి అవకాశాలు సృష్టించుకొని, ఆర్థిక పరిస్థితులు మెరుగు పరుచుకొనే మార్గాలతో పాటు పర్యావరణ పరిరక్షణ గురించి కూడా ఆ సదస్సులో వివరించిన విషయాలు ఛామీలో అనేక ఆలోచనలు రేకెత్తించాయి. ‘‘వంట చెరకు కోసం చెట్లను నరకడం గ్రామీణ ప్రాంతాల్లో అలవాటే. దానివల్ల పర్యావరణానికి ఎంత హాని జరుగుతోందనేది మా గ్రామం చుట్టుపక్కల బంజరులా తయారైన భూములు చూసిన తరువాత అర్థమయింది. చెట్లు ఉంటేనే మనకు మనుగడ. అందుకే... ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటడం మొదలుపెట్టాను. కానీ ఇలాంటి పని ఒక మహిళ చేయడం మా గ్రామంలో పురుషులకు ఇష్టం లేదు. ఎన్నో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. మా ఇంట్లోనూ వాదనలు నడిచాయి. అయితే నా సోదరుడు నాకు అండగా నిలబడ్డాడు. జీవనోపాధి కోసం పొలాల్లో కూలీగా పని చేస్తూనే... కొంత సమయాన్ని మొక్కలు నాటే పనికి కేటాయించేదాన్ని’’ అని గుర్తు చేసుకున్నారు ఛామీ. ప్రకృతిని సంరక్షించడం ఎంత అవసరమో తోటి మహిళలకు ఆమె వివరించారు. పదకొండుమంది సభ్యులతో ‘సహయోగి మహిళ’ అనే సంస్థను స్థాపించారు. ప్రభుత్వ సామాజిక అటవీ కార్యక్రమంలో భాగస్వామి అయ్యారు. స్వయంగా ఒక నర్సరీని ప్రారంభించారు. 1996 నాటికి లక్ష మొక్కలు నాటారు. కానీ ఒక్క రాత్రిలోనే వాటిని గ్రామంలోని కొందరు మగవాళ్ళు నాశనం చేశారు. ‘‘నా కుటుంబ సభ్యులకు హాని జరిగినట్టు విలవిలలాడిపోయాను. ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాను. నిందితులు అరెస్టయ్యారు. ఇక మొక్కలు నాటడం ఆపెయ్యాలని శ్రేయోభిలాషులు కొందరు సూచించారు. అలా చేస్తే వాళ్ళను గెలిపించినట్టవుతుంది. మరింత ఉత్సాహంగా పని చేస్తాను’’ అని చెప్పాను. మళ్ళీ లక్షకు పైగా మొక్కలు నాటాను. అప్పుడే కేంద్ర ప్రభుత్వం నాకు ‘ఇందిరా ప్రియదర్శిని వృక్ష మిత్ర’ పురస్కారాన్ని అందజేసింది. దాంతో నన్ను వ్యతిరేకిస్తున్న వారి నోళ్ళు మూతపడ్డాయి.

ఆ తరువాత ఎవరినుంచీ, ఎటువంటి ఇబ్బందీ నాకు ఎదురు కాలేదు’’ అని ఆమె తెలిపారు.

అందుకే వివాహం చేసుకోలేదు...

అప్పటినుంచి రెట్టించిన ఉత్సాహంతో తన కార్యకలాపాలను మరిన్ని గ్రామాలకు ఛామీ విస్తరించారు. 500కు పైగా గ్రామాల్లో వేలాది మంది మహిళలకు పర్యావరణంపై అవగాహన కల్పించారు. గత ముప్ఫై ఆరేళ్ళలో 30 లక్షల పైచిలుకు మొక్కలు నాటడానికి దోహదపడ్డారు. ‘‘ఎక్కువగా యూకలిప్టస్‌, తుమ్మ, మద్ది, వేప, జామ, రోజ్‌వుడ్‌, మామిడితదితర రకాల చెట్లు నాటుతూ ఉంటాం. గ్రామాల్లో బంజరు భూముల్ని ప్రధానంగా ఎంపిక చేసుకుంటాం. మొక్కలకు, సమీపంలోని పొలాలకు నీరు అందడానికి, భూగర్భ జలమట్టాలు పెంచడానికి చెక్‌డ్యాంలు, వాటర్‌షెడ్ల నిర్మాణం కూడా చేపట్టాం. గ్రామాలు పచ్చదనం సంతరించుకోవడమే కాదు, ఫలసాయం ద్వారా గ్రామీణ మహిళలకు ఆర్థికంగానూ మేలు చేకూరింది’’ అంటున్నారు ఛామీ. వన్యప్రాణుల పరిరక్షణకోసం, కలప మాఫియా నుంచి అడవులను కాపాడడానికీ ఎడతెగని పోరాటాలు చేసిన ఆమెను ‘లేడీ టార్జాన్‌ ఆఫ్‌ జార్ఖండ్‌’ అని ఆ ప్రాంతాల వారు పిలుచుకుంటారు. తాను కార్యకలాపాలు సాగిస్తున్న గ్రామాల్లో 2,800 స్వయం సహాయక మహిళా బృందాలను ఆమె ఏర్పాటు చేశారు. సుమారు 30 వేలమంది మహిళల స్వయంఉపాధికి సాయపడ్డారు. దానికోసం ఒక సహకార మహిళా సొసైటీని ఏర్పాటు చేశారు. కోళ్ళు, గొర్రెలు, మేకల పెంపకం, ఆకుకూరలు, కూరగాయల పెంపకం తదితరాలకు ఈ సొసైటీ ఆర్థిక సాయాన్నీ, ఇతర సహకారాన్నీ అందిస్తోంది. ఆమె నేతృత్వంలోని ‘సహయోగి మహిళ’ సంస్థ బాలికా విద్య, పిల్లల్లో పోషకాహార లోపం, రక్తహీనతల నివారణ, గర్భిణుల సంరక్షణ తదితర అంశాలపై పని చేస్తోంది. అంగన్వాడీ కేంద్రాలు లేని ప్రాంతాల్లో పోషకాహారాన్ని పంపిణీ చేస్తోంది. జిల్లాపరిషత్‌ సభ్యురాలుగానూ వ్యవహరిస్తున్న ఛామీ... పర్యావరణానికీ, మహిళా సాధికారతకు చేసిన సేవలకు గుర్తింపుగా 2000లో ‘నారీ శక్తి’ పురస్కారాన్ని అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ ఏడాది ఆమెకు ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ‘‘దీన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. పర్యావరణ పరిరక్షణకే నా జీవితం అంకితం చేశాను. నా సేవా కార్యక్రమాలకు ఆటంకం కాకూడదని వివాహం కూడా చేసుకోలేదు’’ అని చెబుతున్న ఛామీ ధైర్యం, ఓర్పు, ఆత్మవిశ్వాసాలకు చిరునామా. ‘‘మంచి చెయ్యాలనే ఆలోచనతో నిరంతరం శ్రమిస్తే సత్ఫలితాలు సాధించగలం’’ అని చెబుతారామె. దానికి ఆమే గొప్ప ఉదాహరణ.

Updated Date - Jan 30 , 2024 | 11:11 PM