Share News

Bharat sankalpa yatra : సిద్ధించిన సంకల్పం

ABN , Publish Date - Jan 17 , 2024 | 03:19 AM

పథకాలు ప్రజలకు దగ్గరకు చేరినప్పుడే, ప్రభుత్వ ఆశయాలు నెరవేరతాయి. కానీ ఆ పథకాల గురించి అవగాహన లేక, వాటిని సద్వినియోగం చేసుకోలేని మారుమూల గ్రామస్థుల పరిస్థితి ఏంటి?

Bharat sankalpa yatra : సిద్ధించిన సంకల్పం

పథకాలు ప్రజలకు దగ్గరకు చేరినప్పుడే, ప్రభుత్వ ఆశయాలు నెరవేరతాయి. కానీ ఆ పథకాల గురించి అవగాహన లేక, వాటిని సద్వినియోగం చేసుకోలేని మారుమూల గ్రామస్థుల పరిస్థితి ఏంటి? ఈ దిశగా ఆలోచించిన కేంద్ర ప్రభుత్వం, పథకాలను ప్రజల దగ్గరకు తీసుకువెళ్లి, ప్రయోజనాలను సద్వినియోగం చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. ఆ కార్యక్రమమే ‘వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర’. హరియాణాలో వైభవంగా సాగుతున్న ఈ యాత్రకు హాజరైన లబ్దిదారులు ‘నవ్య’తో పంచుకున్న విశేషాలివి.

జూట్‌, పేపర్‌ బ్యాగ్స్‌తో...

నా పేరు రేఖ. మాకడోలా మా గ్రామం. మా గ్రూపు పేరు ‘నయీ ఆశా’! మా గ్రామ సంఘటన్‌ పేరు కిరణ్‌ మహిళా గ్రామ సంఘటన్‌’! ఇలాంటివి మా దగ్గర 13 గ్రూపులున్నాయి. వీటిలో 10 గ్రూపులు మా గ్రామ సంఘటన్‌తో అనుసంధానమై పని చేస్తున్నాయి. మా గ్రూపులన్నీ, కాగితపు సంచులు, జూట్‌ సంచులు, మిల్లెట్‌ ఉత్పత్తులను తయారుచేస్తాయి. ఇందుకోసం మాకు ప్రభుత్వం నుంచి 10 వేల రివాల్వింగ్‌ ఫండ్లు దొరికాయి. అలాగే గ్రామ సంఘటన్‌ నుంచి 5 లక్షల నిధులు అందాయి.

ప్రస్తుతానికి సంచులన్నిటినీ అరువు తెచ్చుకున్న కుట్టు మిషన్లతోనే కుడుతున్నాం. భవిష్యత్తులో ప్రభుత్వం నుంచి లోన్‌ అందితే సొంత కుట్టు మిషన్లను ఉపయోగించి, ఉత్పత్తులను తయారుచేసుకుంటాం! బ్యాంకులు కూడా మాకు లోన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. మా పట్ల ప్రభుత్వం ప్రతిస్పందన ఎంతో బాగుంది. బ్యాంకులు కూడా పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉన్నాయి. మేం లోను తీసుకున్న తర్వాత క్రమం తప్పకుండా తీర్చేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం కూడా మా పట్ల సానుకూలంగా వ్యవహరిస్తూ, అవసరమైనంత లోనుకు అనుమతిస్తోంది. ఇందుకోసం మేం వేటినీ తాకట్టు పెట్టవలసిన అవసరం లేదు. ఇదంతా ‘నేషనల్‌ రూరల్‌ లైవ్లీహుడ్స్‌ మిషన్‌’తో అనుసంధానవడం మూలంగా మాకు ఈ ప్రయోజనాలన్నీ దక్కుతున్నాయి. ఇంతకు ముందు మేం సాధారణ గృహిణులుగా ఇళ్లకే పరిమితమై ఉండేవాళ్లం. జాతీయ గ్రామీణ్‌ జీవితా మిషన్‌తో అనుసంధానమైన తర్వాత, మాకంటూ ఒక గుర్తింపు పొందగలిగాం! ప్రస్తుతం 200 మంది మహిళలం ఒక గ్రూపుగా ఏర్పడి, ఒక కుటుంబంగా కలిసి పని చేస్తున్నాం! మా అవసరాలను, ఇబ్బందులను కలిసి పంచుకుంటూ, ఎవరెవరు ఎలాంటి ఆసక్తిని కలిగి ఉన్నారో, జీవనోపాథికి అవసరమైన ఎలాంటి శిక్షణ అవసరత ఉందో మేం ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి, ప్రభుత్వం అందించే శిక్షణను సద్వినియోగం చేసుకోగలుగుతున్నాం. ఇలా మాలో కుట్టుపని నేర్చుకున్న కొందరు మహిళలు సొంత బొటిక్స్‌ మొదలుపెట్టారు. కొంతమంది టైలర్లుగా స్థిరపడ్డారు. కొందరు లోను ద్వారా ఉపాధి లేక ఇంటికే పరిమితమైన తమ భర్తల కోసం ఇ-రిక్షా లాంటి ట్రాన్స్‌పోర్ట్‌ వాహనాలను కూడా పొందారు. స్వయం సహాయక సంఘాల నుంచి లోన్‌ పొందిన కొందరు మహిళలు తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించగలుగుతున్నారు.

పచ్చళ్లు, మిల్లెట్‌ ఉత్పత్తులతో...

నా పేరు ఆశా యాదవ్‌. నేను మా గ్రామంలో పది గ్రూపులు ఏర్పాటు చేశాను. నాతో పాటు 150 నుంచి 200 మంది మహిళలు, 2019లో ఎన్‌ఆర్‌ఎల్‌ఎమ్‌తో అనుసంధానమయ్యాం. ప్రారంభంలో నాలుగు గ్రూపులతో మొదలైన మేం ప్రస్తుతం పది గ్రూపులకు పెరిగాం. స్వయం సహాయక సంఘాల్లోని మహిళలందరినీ సంప్రతించి, మెరుగైన జీవనానికి అవసరమైన వనరులు, అవసరతలు, వాటితో సాధించగలిగే వీలున్న స్వయం స్వావలంబనల గురించి చర్చించాం. ఆ విధంగా ఎన్‌ఆర్‌ఎల్‌ఎమ్‌ నుంచి పచ్చళ్ల తయారీలో మేం శిక్షణ పొందాం. అలా పది మంది మహిళా బృందంతో కలిసి పచ్చళ్ల తయారీ పని మొదలు పెట్టాం. నేను నా పచ్చళ్ల గురించి మార్కెటింగ్‌ చేసినప్పుడు, దాని ద్వారా ఎంతో మంది మహిళలకు ప్రభుత్వ పథకాలు, శిక్షణా కార్యక్రమాల గురించి అవగాహన ఏర్పడింది. అలాగే 2023 ప్రారంభంలో మిల్లెట్‌ పదార్థాల తయారీలో కూడా మేం శిక్షణ పొందాం! మా ఉత్పత్తులకు మంచి స్పందన దక్కుతోంది. మేం ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ ప్రభుత్వ సహాయంతోనే స్వయం స్వావలంబన సాధించగలుగుతున్నాం. ఈ పథకాల గురించి అవగాహన లేని మహిళలు ఇంతకుముందు కూలీపనులకు వెళ్లేవాళ్లు. శారీరక శ్రమతో కూడిన ఆ పనులతో వాళ్లు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉండేవాళ్లు. కానీ ఇప్పుడు మా అందరి జీవితాలు మారాయి. ఇంటి పట్టునే మేం ఉపాధిని పొందగలుగుతున్నాం. సంపాదన కోసం పుట్టింటి మీదా, అత్తింటి మీదా ఆధారపడే అవసరం లేకుండా, స్వయంకృషి మీదే ఆధారపడడం మాకెంతో గర్వకారణంగా ఉంది. ఈ అవకాశాన్ని కల్పించి, మా జీవితాలను వెలుగులోకి నడిపించిన కేంద్ర ప్రభుత్వానికి మేం రుణపడి ఉంటాం!

సురక్షితమైన శానిటరీ ప్యాడ్స్‌తో...

నా పేరు మధు. మా స్వయం సహాయక సంఘం పేరు జన్‌ కళ్యాణ్‌. మొదట్లో కొంత తడబడినా మహిళా బృందాన్ని నడిపించడం మీద పట్టు సాధించాను. ఒక్కరి సంపాదనతోనే కుటుంబాన్ని నడిపే రోజులు పోయాయి. ఏ లోటు లేకుండా పిల్లా పాపలతో కుటుంబం సజావుగా సాగాలంటే ఇంటి ఇల్లాలు కూడా ఎంతో కొంత సంపాదించడం అవసరం. ప్రస్తుతం స్వయం సహాయక బృందానికి లీడర్‌గా నేను నాతో పాటు సాటి మహిళలను కూడా స్వయం స్వావలంబన వైపు నడిపించగలుగుతున్నాను. ప్రస్తుతం నేను శానిటరీ ప్యాడ్స్‌ విక్రయిస్తున్నాను. గ్రామీణ మహిళలు నెలసరి సమయంలో అనుసరించే విధానాలతో ఎన్నో చర్మ సమస్యలు, ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నాను. ఈ సురక్షితమైన, ఆరోగ్యకరమైన ప్యాడ్స్‌ వాడకంతో ఈ సమస్యలను రూపుమాపవచ్చని అవగాహన కల్పించి, వీటిని కొనుగోలు చేసేలా ప్రోత్సహించడంతో పాటు, స్వీయ సంపాదన కోరుకునే మహిళలను జన్‌ కళ్యాణ్‌ గ్రూపులో సభ్యులుగా చేర్చగలిగాను. మేం విక్రయించే శానిటరీ ప్యాడ్స్‌లో ప్లాస్టిక్‌ ఉండదు. ఇవి పూర్తి కాటన్‌తో తయారవుతాయి. కాబట్టి ఇవి పూర్తిగా సురక్షితమైనవి.

గోగుమళ్ల కవిత

Updated Date - Jan 17 , 2024 | 03:19 AM