Share News

Permanent makeup : పర్మనెంట్‌ బ్యూటీ

ABN , Publish Date - Feb 15 , 2024 | 04:38 AM

ముఖంలోని కొన్ని లోపాలను మేక్‌పతో తాత్కాలికంగా దాచుకోవచ్చు. అవే లోపాలను మేక్‌పతో పని లేకుండా దీర్ఘకాలం పాటు దాచగలిగే చికిత్స ‘పర్మనెంట్‌ మేకప్‌’. ఈ మేకప్‌ మతలబులు ఇవే!

Permanent makeup : పర్మనెంట్‌ బ్యూటీ

ముఖంలోని కొన్ని లోపాలను మేక్‌పతో తాత్కాలికంగా దాచుకోవచ్చు. అవే లోపాలను మేక్‌పతో పని లేకుండా దీర్ఘకాలం పాటు దాచగలిగే చికిత్స ‘పర్మనెంట్‌ మేకప్‌’. ఈ మేకప్‌ మతలబులు ఇవే!

అందమైన కనుబొమల కోసం...

కనుబొమలకు ఆకర్షణీయమైన ఆకృతిని అందించడంతో పాటు, ఒత్తుగా కనిపించేలా చేయడం కోసం ఉద్దేశించిన బ్రోషేపింగ్‌ ఇది. కొందరి కనుబొమలు పలుచగా ఉంటాయి. ఇంకొందరికి ఆకృతి లేకుండా ఉంటాయి. ఇలాంటి వాళ్లు కనుబొమలను మైక్రో పిగ్మెంటేషన్‌ సహాయంతో అందంగా తీర్చిదిద్దుకోవచ్చు. కనుబొమల్లో టాటూ ఇంకుతో వెంట్రుకల రూపంలో స్ట్రోక్స్‌ ఇవ్వడం ద్వారా సహజసిద్ధ వెంట్రుకలను తలపించేలా చేయవచ్చు.

పెదవులను తీర్చిదిద్దడం కోసం...

పింక్‌ లిప్స్‌ కోరుకునేవాళ్లు, నల్లని పెదవులున్నవాళ్లు, సగం తెలుపు రంగు పెదవులు కలిగి ఉన్నవాళ్లు పర్మనెంట్‌ లిప్‌స్టిక్‌ను ఎంచుకోవచ్చు. దీన్లో రంగులను ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది. అయితే రంగు వేసిన తర్వాత తొలగించుకోవడం కష్టం కాబట్టి ఒకటికి రెండు సార్లు ఆలోచించి, రంగును ఎంచుకోవాలి. ఈ రంగు కూడా రెండు నుంచి మూడేళ్లకు వెలిసిపోతుంది. కాబట్టి మళ్లీ టచప్స్‌ అవసరమవుతాయి. రంగు ఇంక్‌ను ఇంజెక్ట్‌ చేయడం కోసం పెదవుల మీద ఎక్కువసార్లు గుచ్చడం జరుగుతుంది. కాబట్టి చికిత్స తర్వాత పెదవులు వాచే అవకాశాలుంటాయి. ఈ వాపు వారంలో తగ్గిపోతుంది. రెండు నుంచి మూడు వారాల తర్వాత అవసరమైతే రెండోసారి టచప్‌ కూడా చేయవలసి ఉంటుంది. ఈ చికిత్సతో లిప్‌ కలర్‌తో పాటు లిప్‌ లైన్‌ కూడా మెరుగు చేసుకోవచ్చు.

కనురెప్పలకు ఐ లైనర్‌...

పర్మనెంట్‌ ఐలైనర్‌ కూడా వేయించుకోవచ్చు. ఇందుకోసం నలుపు పిగ్మెంట్‌నే ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఈ చికిత్స ఎంతో సున్నితమైన కంటికి దగ్గరగా సాగుతుంది. కాబట్టి అనుభవజ్ఞులైన వైద్యులను ఎంచుకోవాలి. ఐ లైన్‌ పొడవు, వెడల్పులను కూడా ముందుగానే కచ్చితంగా అంచనా వేసి, పర్మనెంట్‌ ఐలైనర్‌ వేయించుకోవాలి.

స్కాల్ప్‌ మైక్రో పిగ్మెంటేషన్‌

కొందరికి నుదుటి దగ్గర హెయిర్‌ లైన్‌ తరిగిపోతూ ఉంటుంది. వెంట్రుకలు ఒత్తుగా తలపించేలా చేసే పౌడర్లు, స్ర్పేలు అందుబాటులో ఉన్నప్పటికీ పర్మనెంట్‌ మేక్‌పతో ఎక్కువ కాలం పాటు ఆ ప్రభావాన్ని పొందే వీలుంటుంది. నుదుటి దగ్గరి వెంట్రుకలు పలుచబడినప్పుడు పర్మనెంట్‌ మేక్‌పలో భాగంగా వెంట్రుకలను తలపించేలా ఆ ప్రదేశాన్ని రంగుతో నింపుకోవచ్చు.

కొరియన్‌ బిబి గ్లో

ఇది బ్లెమిష్‌ బామ్‌. మచ్చలను చర్మంలో కలిసిపోయేలా చేసి, మెరుపును తెచ్చిపెట్టే చికిత్స. ఈ చికిత్సలో చర్మపు రంగుకు దగ్గరగా ఉండే పిగ్మెంటును ఉపయోగిస్తారు కాబట్టి ఫలితం సంతృప్తికరంగా ఉంటుంది. ఈ చికిత్సలో బిబి క్రీమ్‌ను అప్లై చేసి, డెర్మా పెన్‌ ద్వారా ఆ క్రీమ్‌ను చర్మం పైపొరల్లోకి చొప్పించడం జరుగుతుంది. ఈ చికిత్స ఫలితం ఏళ్ల తరబడి ఉండదు. కొన్ని వారాలు, నెలల్లోనే మెరుపు తగ్గడం మొదలుపెడుతుంది. కానీ ఈ చికిత్సకు సంబంధించిన దీర్ఘకాల ప్రభావాలు, దుష్ప్రభావాల గురించిన శాస్త్రీయ ఆధారాలు ఇంకా అందుబాటులో లేవు. కాబట్టి ఈ చికిత్సను ఆశ్రయించేవారు ఆచితూచి అడుగులేయడం ఉత్తమం. ఈ చికిత్సలో భాగంగా పిగ్మెంట్‌ను చర్మం అడుగుకి ఇంజెక్ట్‌ చేయడం జరుగుతుంది.

వీళ్లు అప్రమత్తం

కొంతమందికి కిలాయిడ్‌ టెండెన్సీ, స్కారింగ్‌ టెండెన్సీ ఉంటుంది. ఇలాంటి వాళ్లకు ఆ ప్రదేశంలో కండ పెరగడం లేదా మచ్చ ఏర్పడడం జరుగుతుంది. కాబట్టి ఈ కోవకు చెందిన వాళ్లు పర్మనెంట్‌ మేక్‌పకు దూరంగా ఉండాలి. గాయం మానడంలో సమస్యలను ఎదుర్కొనేవాళ్లు కూడా అప్రమత్తంగా ఉండాలి. కొందరికి కనెక్టివ్‌ టిష్యూ డిజార్డర్లు ఉంటాయి. వాళ్లకు రియాక్షన్లు తలెత్తే అవకాశాలు ఎక్కువ. అలాగే సున్నిత చర్మం కలిగిన వాళ్లు, అలర్జీ తత్వం కలిగిన వాళ్లు కూడా దీనికి దూరంగా ఉండడమే ఉత్తమం.

దుష్ప్రభావాలు లేకుండా...

పర్మనెంట్‌ మేక్‌పతో దుష్ప్రభావాలు లేకుండా ఉండాలంటే అనుభవజ్ఞులైన డెర్మటాలజి్‌స్టతో చేయించుకోవాలి. నాణ్యమైన ఇంకు వాడకపోయినా, చికిత్సలో ఉపయోగించే నీడిల్స్‌ అశుభ్రంగా ఉన్నా ఇన్‌ఫెక్షన్లకు, రియాక్షన్లకూ ఆస్కారం ఉంటుంది. ఇంకు నాణ్యత తక్కువగా ఉంటే, అది తక్కువ కాలంలోనే వెలిసిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే పిగ్మెంట్‌ రంగు కచ్చితంగా చర్మానికి నప్పినప్పుడే ఆకర్షణీయంగా కనిపిస్తాం. కాబట్టి ఈ విషయంలో కూడా పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి.

డాక్టర్‌ స్వప్న ప్రియ,

డెర్మటాలజిస్ట్‌,

కాస్మోస్యూర్‌ క్లినిక్‌,

హైటెక్‌ సిటీ, హైదరాబాద్‌.

Updated Date - Feb 15 , 2024 | 04:38 AM