Share News

కనువిప్పు

ABN , Publish Date - Oct 25 , 2024 | 12:52 AM

స్వామి వివేకానంద వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ రాజస్థాన్‌ ప్రాంతంలోని అల్వార్‌ పట్టణానికి చేరుకున్నారు. వివేకానందుడి ఖ్యాతిని విన్న స్థానిక ప్రముఖులు ఆయన ప్రసంగాన్ని ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమానికి నాటి అల్వార్‌ రాజ్య దివాన్‌ కూడా హాజరయ్యాడు.

కనువిప్పు

స్వామి వివేకానంద వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ రాజస్థాన్‌ ప్రాంతంలోని అల్వార్‌ పట్టణానికి చేరుకున్నారు. వివేకానందుడి ఖ్యాతిని విన్న స్థానిక ప్రముఖులు ఆయన ప్రసంగాన్ని ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమానికి నాటి అల్వార్‌ రాజ్య దివాన్‌ కూడా హాజరయ్యాడు. ఆంగ్లంలో వివేకానందుడు చేసిన ప్రసంగం ఆయనను ఎంతో ఆకట్టుకుంది. ‘‘స్వామి! మీరు మా రాజమందిరానికి వచ్చి, మా మహారాజు మంగళ్‌సింగ్‌ను కలుసుకోవాలి’’ అని ఆహ్వానించాడు. వివేకానందుడు ‘సరే’ అన్నారు.

మరునాడు ఉదయం దివాన్‌తో కలిసి అల్వార్‌ రాజమందిరంలో వివేకానందుడు ప్రవేశించారు. రాజా మంగళ్‌సింగ్‌ విలాసాల్లో మునిగితేలే వ్యక్తి. అతనికి రాజుననే అహంకారం కూడా చాలా ఎక్కువ. దివాన్‌తో కలిసి తన మందిరానికి వచ్చిన వివేకానందుణ్ణి చూడగానే ‘ఇతనెవడో కుర్ర సన్యాసి. ఇతనికి ఆధ్యాత్మిక ప్రసంగాలు చేసే వయసు, అనుభవం ఎక్కడుంటాయి? అదీ ఇంగ్లీష్‌లో! ఇతనిదంతా ఉత్తుత్తి ప్రదర్శనేనని రుజువు చేస్తాను’ అనుకున్నాడు. వివేకానందుడికి స్వాగతం చెప్పి, ఆసనంలో కూర్చోమన్నాడు. ఆ తరువాత స్వామీజీ! నాకు విగ్రహారాధన అంటే పరమ చిరాకు. అది వెనుకబాటుతనానికి నిదర్శనమని నా అభిప్రాయం. కుంకుమ, పసుపు, పూలతో ఒక బొమ్మను పూజిస్తూ, అదే దేవుడని భావించే వాళ్ళను చూస్తే నాకు జాలి కలుగుతూ ఉంటుంది. ఈ విషయంలో మీ అభిప్రాయమేమిటి? అని అడిగాడు.

ఆ ప్రశ్నకు వివేకానందుడు నేరుగా సమాధానం ఇవ్వలేదు. పక్కనే టేబుల్‌ మీద ఉన్న ఒక చిత్రపటాన్ని చూసి ‘‘దివాన్జీ! మీరు ఆ చిత్రపటం మీద ఉమ్మెయ్యగలరా?’’ అని అడిగాడు. ఆ మాట వినగానే దివాన్జీ దిగ్ర్భాంతి చెందాడు. రాజు ఏమంటాడోనని భయంభయంగా చూశాడు. వివేకానందుడి మాటలు వినగానే రాజుకు ఆగ్రహం కలిగింది. దివాన్జీవైపు కోపంగా చూశాడు.

రాజు కోపాన్ని అర్థం చేసుకున్న దివాన్జీ ‘‘స్వామీ! మీరేం మాట్లాడుతున్నారు? ఆ చిత్రపటం ఎవరిదో తెలుసా? మా రాజావారి దివంగతులైన తండ్రిగారిది. ఆయన మాకు దైవంతో సమానం’’ అన్నాడు.


అప్పుడు వివేకానందుడు ‘‘రాజా! అది కేవలం ఒక వస్త్రం లేదా కాగితం. దాని మీద పెద్ద రాజావారి బొమ్మ గీశారు. దానికి రంగులు వేశారు. అంతేకదా! ఆ బొమ్మకి ఎముకలు లేవు, రక్త మాంసాలు లేవు, ఆత్మ లేదు. కానీ దాన్ని మీరు దాన్ని మీ తండ్రిగారి ప్రతిరూపంగా భావించుకుంటున్నారు. అది కేవలం రంగులతో వేసిన ఒక చిత్రంగా భావించుకోవడం మీ దృష్టిలోనూ, మీ పరివారం దృష్టిలోనూ అవివేకం. అదే విధంగా దైవ విగ్రహాన్ని దేవుడు కాదని అనడం కూడా అవివేకమే. ఆరాధించే భక్తులకు ఆ విగ్రహం స్వయానా దేవుడు కాదనే సంగతి తెలుసు. కానీ నిర్గుణంగా అంటే రూపం లేకుండా దేవుణ్ణి ఆరాధించడం అనేది సామాన్యమైన మానవులకు చాలా కష్టం. సగుణోపాసన అంటే ఒక రూపంలో దేవుణ్ణి ఆరాధించడం భక్తికి, ఆధ్యాత్మికతకు తొలి మెట్టు. ఈ మార్గంలో ఎంతో సాధన చేసిన తరువాత... దేవుడు నిర్గుణుడని, నిరాకారుడని వారు గ్రహించగలుగుతారు. అప్పటివరకూ ఈ మార్గాన్ని అనుసరించక తప్పదు. అందులో ఎలాంటి తప్పూ లేదు. అది వెనుకబాటుతనం కాదు. మూర్ఖత్వం అంతకన్నా కాదు’’ అని బదులిచ్చారు.

ఆ మాటలతో రాజా మంగళ్‌సింగ్‌ కళ్ళు తెరుచుకున్నాయి. తన ముందు ఉన్నది సామాన్యుడైన వ్యక్తి కాదనీ, వయసును మించి జ్ఞానం సంపాదించిన మహనీయుడని గ్రహించాడు. చేతులు జోడించి వివేకానందుడికి నమస్కరించాడు.

Updated Date - Oct 25 , 2024 | 12:52 AM