Share News

Youth in Politics : నవతరం నాయికలు

ABN , Publish Date - Jun 16 , 2024 | 11:59 PM

వారసత్వంగా కొందరు...సేవా దృక్పథంతో మరి కొందరు... ఇటీవలి కాలంలో యువత రాజకీయాల్లో భాగస్వాములవుతున్నారు. ముఖ్యంగా మహిళలు నేరుగా ప్రజా క్షేత్రంలోకి దూకి... సవాలు విసురుతున్నారు.

Youth in Politics : నవతరం నాయికలు

వారసత్వంగా కొందరు...

సేవా దృక్పథంతో మరి కొందరు... ఇటీవలి కాలంలో యువత

రాజకీయాల్లో భాగస్వాములవుతున్నారు. ముఖ్యంగా మహిళలు

నేరుగా ప్రజా క్షేత్రంలోకి దూకి... సవాలు విసురుతున్నారు.

అలాంటి నవతరం నాయికలే హిందీ

రాష్ట్రాలకు చెందిన శాంభవి చౌదరి, ప్రియా సరోజ్‌, సంజనా జాటవ్‌.

పాతికేళ్ల ప్రాయంలో తొలిసారి పార్లమెంట్‌లో

అడుగుపెడుతున్న ఈ ముగ్గురి నేపథ్యం ఇది...

పీహెచ్‌డీ విద్యార్థి

(శాంభవి చౌధరి, సమస్తీపూర్‌)

‘కాలేజీలో చదివే రోజుల్లో ఒకసారి పార్లమెంటు చూడడానికి వెళ్లాను. నేడు ఎన్నికైన ఒక పార్లమెంటు సభ్యురాలిగా సభలోకి అడుగు పెడుతున్నాను. తలుచుకొంటేనే మహాద్భుతంగా అనిపిస్తోంది. ఎంతో ఉత్సుకతగా ఉంది. ఎన్నికలకు ముందు నా నియోజకవర్గానికి వెళ్లినప్పుడు నేనొక సాధారణ పౌరురాలిని. ఎంపీగా తిరిగి అక్కడకు వెళ్లినప్పుడు ఎంతో భావోద్వేగానికి లోనయ్యాను’ అంటూ తన సంతోషాన్ని పంచుకున్నారు శాంభవి చౌదరి. ఆమె వయసు పాతికేళ్లు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ‘లోక్‌ జనశక్తి పార్టీ’ (రామ్‌విలాస్‌) అభ్యర్థిగా బిహార్‌లోని సమస్తీపూర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ‘మగధ్‌ విశ్వవిద్యాలయం’లో ‘రోల్‌ ఆఫ్‌ ఉమెన్‌ ఇన్‌ ఎలక్టరోల్‌ పాలిటిక్స్‌ ఇన్‌ బిహార్‌’ అంశంపై ప్రస్తుతం ఆమె పీహెచ్‌డీ చేస్తున్నారు.

అయితే శాంభవికి రాజకీయాలు కొత్తేమీ కాదు. ఆమె తాతయ్య మహావీర్‌ చౌధరి చాలాకాలం కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నారు. తండ్రి అశోక్‌ చౌధరి నితీ్‌షకుమార్‌ ప్రభుత్వంలో మంత్రి. వాస్తవానికి శాంభవి సమస్తీపూర్‌ నివాసితులు కాదు. ఎన్నికల ప్రచారంలో ఈ అంశాన్ని ఒక అస్త్రంగా ఉపయోగించుకోవాలని అనుకున్నారు ఆమె ప్రత్యర్థులు. బయటి వ్యక్తి అంటూ హోరెత్తించారు. ‘నా ఇల్లు ఇక్కడ ఉందా లేదా అన్నది ఓటర్లకు అవసరం లేదు. వాళ్లకు కావల్సింది... తమ తరఫున నిలబడి మాట్లాడగలిగే బలమైన నాయకులు. వారి సమస్యలను పరిష్కరించగలిగే సమర్థులు’ అంటూ విమర్శలను తిప్పికొట్టారు శాంభవి. ‘ఇంత చిన్న వయసులో మీరేం చేయగలరు’ అని కూడా ఆమెను ప్రజలు ప్రశ్నించారు. ‘నిజమే... నాతో పోటీపడుతున్న రాజకీయ నాయకులతో పోలిస్తే నేను చాలా చిన్నదాన్ని. కానీ నియోజకవర్గ సమస్యలపై పూర్తి అవగాహన ఉన్నదాన్ని. వాటి పరిష్కారానికి కృషి చేయాలన్న దృఢ సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చాను’ అని బదులిచ్చి ప్రజల నమ్మకాన్ని గెలుచుకున్నారు. ‘చిన్నప్పటి నుంచి రాజకీయాలు చూస్తూ పెరిగాను. కానీ ప్రజాక్షేత్రంలో నిలబడి వాళ్ల నమ్మకాన్ని పొందాలంటే ఎన్నో సమస్యలు, సవాళ్లు ఎదురవుతాయి. వాటన్నిటినీ నేను అధిగమించాను’ అంటారామె. విశేషమేమంటే... సమస్తీపూర్‌ నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు వెళుతున్న తొలి మహిళా ప్రతినిధి శాంభవి.

‘అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడతా. యువత, మహిళల సాధికారత కోసం కృషి చేస్తానని విజయానంతరం నియోజకవర్గ ప్రజలకు మాటిచ్చాను. అలాగే రవాణా సౌకర్యాలను మెరుగు పరిచి, మా రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు తెచ్చేందుకు ప్రయత్నిస్తా. తరచూ నా నియోజకవర్గాన్ని సందర్శించి, ప్రజలకు అందుబాటులో ఉంటా’ అంటున్నారు ఈ యువ నాయకి.


Sanjana-1.jpg

కానిస్టేబుల్‌ సతీమణి...

(సంజనా జాటవ్‌, భరత్‌పూర్‌)

కింది స్థాయి నుంచి ఎదిగిన యువ నాయకురాలు సంజనా జాటవ్‌. రాజస్తాన్‌లోని భరత్‌పూర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరుఫున బరిలోకి దిగారు. బీజేపీ సిటింగ్‌ ఎంపీ రామ్‌స్వరూ్‌పపై భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఇది ముఖ్యమంత్రి భజన్‌లాల్‌ శర్మ స్వస్థలం. అందుకే సంజనను ఓడించడానికి ప్రత్యర్థులు సర్వశక్తులూ ఒడ్డారు. నియోజకవర్గం మీద పట్టున్న ఆమె, తన వాగ్ధాటితో వాటన్నిటినీ తిప్పి కొట్టారు.

రాష్ట్ర కాంగ్రె్‌సలో కార్యకర్త స్థాయి నుంచి ఎంపీ వరకు అత్యంత వేగంగా ఎదిగిన నాయకురాలు సంజన. ‘నియోజకవర్గంలో పెచ్చుమీరుతున్న నేరాలు, నిరుద్యోగం, నీటి కొరత, విద్యుత్‌ అంతరాయాలు, అధ్వానమైన రోడ్లు, రైతులకు కనీస మద్దతు ధర లేకపోవడం, ఎరువులు, విత్తనాల కొరత... ఇలా అడుగడుగునా సమస్యలే. అన్నింటా మా ప్రాంతం వెనకబడిపోయింది. ఈ సమస్యలనే ప్రచార అస్త్రాలుగా ఉపయోగించాను. దానికితోడు మొదటి నుంచీ నాకు ఇక్కడి ప్రజల స్థితిగతులపై పూర్తి అవగాహన ఉంది. నన్ను నమ్మి గెలిపించిన ప్రజలకు అండగా నిలబడతాను’ అంటున్న సంజన బీఏ చదివారు. ‘లడకీ హూ... లడ్‌సక్తీ హూ’ అనే నినాదంతో, స్త్రీసాధికారత లక్ష్యంగా జనంలోకి వెళ్లారు. గత ఏడాది జరిగిన రాజస్తాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కతుమార్‌ (ఎస్‌సీ) స్థానం నుంచి పోటీ చేసి 409 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. వార్డు మెంబర్‌గా గెలిచి తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన 26 ఏళ్ల సంజన... నిత్యం జనం మఽధ్యే ఉంటూ, వారితో మమేకమయ్యారు.

సంజన భర్త కప్తాన్‌ సింగ్‌ పోలీస్‌ కానిస్టేబుల్‌. వారికి ఇద్దరు పిల్లలు. స్థానిక ‘గాంధీ జ్యోతీ కాలేజీ’లో బీఏ చదివిన ఆమె... ‘లార్డ్స్‌ యూనివర్సిటీ’ నుంచి ఎల్‌ఎల్‌బీ పట్టా పొందారు. అణగారిన వర్గాలు, మహిళల పక్షాన నిలిచి, వారి అభ్యున్నతికి పాటు పడుతున్నారు. అవే సంజన విజయానికి బాటలు వేశాయి.


Priya-Saroj-MP.jpg

వారి ప్రతినిధిగా...

(ప్రియా సరోజ్‌, మచలీషహర్‌)

ఉత్తరప్రదేశ్‌ మచలీషహర్‌ నియోజకవర్గం నుంచి గెలుపొందిన మరో పాతికేళ్ల యువతి ప్రియా సరోజ్‌. ‘సమాజ్‌వాదీ పార్టీ’ తరుఫున పోటీ చేసిన ఈమెదీ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబమే. ఆమె తండ్రి తూఫానీ సరోజ్‌ మూడుసార్లు ఎంపీ. ప్రస్తుతం కేరాకత్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే. ‘చిన్నప్పుడు నాన్నతో కలిసి చాలాసార్లు పార్లమెంటు భవనం చూశాను. కానీ ఈసారి ఎంతో ప్రత్యేకం. ఎన్నికల్లో పోటీ చేయడం, గెలవడం, ఒక సభ్యురాలిగా పార్లమెంటులో కూర్చోవడం... ఎంతో గర్వంగా ఉంది’... అంటారు ప్రియ. ఎన్నికల ప్రచారం వెనుకబడిన, అణగారిన వర్గాలు, మైనార్టీల గొంతుకగా తనను తాను అభివర్ణించుకున్న ప్రియ... అదే నినాదంతో పోటీకి దిగారు. రాజకీయాల్లోకి రాకముందే తన నియోజకవర్గం గురించి పూర్తి అవగాహన ఉంది. 2022 ఎన్నికల్లో తండ్రి కోసం ఆమె ఇంటింటికీ తిరిగి ప్రచారం చేశారు. ‘ఢిల్లీ విశ్వవిద్యాలయం’ నుంచి బీఏ పట్టా పొందిన ప్రియ... నోయిడా ‘అమిటీ యూనివర్సిటీ’లో ఎల్‌ఎల్‌బీ చదివారు. ఎన్నికల బరిలోకి దిగే ముందు సుప్రీంకోర్టులో కేసులు వాదించారు. లా అండ్‌ ఆర్డర్‌, ఇతర సామాజిక అంశాలపై అవగాహన కల్పించడం ద్వారా మహిళా సాధికారత సాధించాలనేది ఆమె ఆశయం. అలాగే కనీస మద్దతు ధర (ఎంఎ్‌సపీ) అందించి, రైతులకు అండగా నిలుస్తాననీ, ఉద్యోగ అవకాశాలు పెంచే దిశగా కృషి చేస్తాననీ హామీ ఇచ్చారు.

Updated Date - Jun 16 , 2024 | 11:59 PM