Share News

Murali Mohan Interview : ఇష్టపడ్డాను... కష్టపడ్డాను..!

ABN , Publish Date - Feb 04 , 2024 | 12:02 AM

నటుడిగా, నిర్మాతగా సినీ రంగంలోనే కాదు, వ్యాపార రంగంలోనూ ‘జయభేరి’ మోగించారు మురళీమోహన్‌. అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ విలువలకే కట్టుబడి ఉన్నానంటున్న ..

Murali Mohan Interview :  ఇష్టపడ్డాను... కష్టపడ్డాను..!

నటుడిగా, నిర్మాతగా సినీ రంగంలోనే కాదు, వ్యాపార రంగంలోనూ

‘జయభేరి’ మోగించారు మురళీమోహన్‌.

అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ విలువలకే కట్టుబడి ఉన్నానంటున్న

ఆయన సినీ ప్రస్థానంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు.

ఈ సందర్భంగా ‘నవ్య’తో ప్రత్యేకంగా పంచుకున్న విశేషాలివి.

గతంలో ఒక సినిమా విజయవంతమయితే ఆ లాభాలు పదిమందితో పంచుకొనేవారు. ఇప్పుడు లాభాలోస్తే అందరూ పంచుకుంటారు. లేకపోతే నష్టమంతా ప్రొడ్యూసర్‌ మీద తోసేస్తారు. సినిమా విషయంలో త్యాగం చేసేది, ఇల్లు తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చేది ప్రొడ్యూసరే! అతనిని బతికించుకోవాల్సిన బాధ్యత ఇండస్ట్రీదే!

50 ఏళ్ల సినీ ప్రస్థానం ఎలా అనిపిస్తోంది?

చాలా త్వరగా గడిచిపోయినట్లుంది. వెనక్కి తిరిగి చూసుకుంటే- నాకే ఆశ్చర్యంగా అనిపిస్తోంది. యవ్వనంలో నాటకాలు వేసేవాణ్ణి. కానీ నేను ఎప్పుడూ హీరో కావాలనుకోలేదు.

సినిమాల్లోకి రాకపోతే ఏం చేసేవారు?

చిన్నప్పటి నుంచి వ్యాపారం అంటే చాలా ఆసక్తి. చదువుకోవాలి కాబట్టి ఇంటర్‌ దాకా చదువుకున్నా. నేను, హీరో కృష్ణ క్లాస్‌మేట్స్‌. ఇంటర్‌లో ఆయన పాస్‌ అయ్యారు. నేను ఫెయిలయ్యా. ఆ తర్వాత బిజినెస్‌ చేయాలనుకుంటే డబ్బులు లేవు. ఉద్యోగం చేయాలనుకుంటే డిగ్రీ లేదు. ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఆ సమయంలో విజయవాడలో వ్యాపారం చేయటానికి ఒక అవకాశం వచ్చింది. నెలకు రూ.100 జీతం. లాభాల్లో 15 పైసలు వాటా. ఇలా ‘కిసాన్‌ ఇంజనీరింగ్‌ వర్క్స్‌’లో వర్కింగ్‌ పార్టనర్‌గా జీవితం ప్రారంభమయింది. వ్యాపారం బాగా నడుస్తోంది. పార్టనర్‌షిప్‌ అమ్మేస్తుంటే నా భార్యకు ఇచ్చిన ఐదెకరాల పొలం అమ్మేసి కొన్నాం. ఆ తర్వాత వ్యాపారం బాగా సాగింది. ఒక వేళ సినిమాల్లోకి రాకపోతే వ్యాపారమే కొనసాగించి ఉండేవాణ్ణి.

మరి సినిమాల్లోకి ఎలా వచ్చారు?

చిన్నప్పటి నుంచి అందరూ- ‘‘బావున్నావు... హీరో కావచ్చు కదా...’’ అంటూ ఉండేవారు. నేను ఎప్పుడూ పెద్ద ఆసక్తి చూపించలేదు. అట్లూరి పూర్ణచంద్రరావుగారు ‘జగమే మాయ’ అనే ఒక సినిమా తీస్తుంటే నాకు కూడా ఒక ఆఫర్‌ వచ్చింది. అది విలన్‌ వేషం. హీరో గిరిబాబు. నన్ను చూసిన తర్వాత- విలన్‌ వేషానికి గిరిబాబును, హీరో వేషానికి నన్ను మార్చారు. ‘వ్యాపారం బాగా సాగుతోంది..వెళ్లాలా? వద్దా?’ అనే మీమాంసలో పడ్డాను. అప్పుడు మా ఆవిడ- ‘‘లక్ష్మీదేవి తలుపు తట్టింది. ఎవరికో కానీ ఆ అదృష్టం రాదు. మీకు వచ్చింది. వద్దంటే వెళ్లిపోతుంది.. మీరు వెళ్లండి. షూటింగ్‌ అయిన వెంటనే విజయవాడ వచ్చేయండి’’ అంది. ఆ షూటింగ్‌ను నేను బాగా ఎంజాయ్‌ చేశాను. ప్రముఖ నటుడు రమణమూర్తిగారు నాతోను, గిరిబాబుతోను రిహార్సల్స్‌ చేయించేవారు. డబ్బింగ్‌ సమయంలో సాయికుమార్‌ వాళ్ల నాన్నగారు (పి.జె.శర్మ) - మాకు డైలాగ్స్‌ మాడ్యులేషన్‌లో తర్ఫీదు ఇప్పించారు. సినిమా బాగానే ఆడింది. ఆ తర్వాత గిరిబాబుకు చాలా వేషాలు వచ్చాయి. నాకు ఏడాది గ్యాప్‌ వచ్చింది. మళ్లీ విజయవాడ వచ్చేసా. ఆ తర్వాత దాసరి నారాయణరావుగారు ‘తిరుపతి’ అనే సినిమా తీసారు. అది కూడా బాగా ఆడింది. దాసరిగారితో అనుబంధం బలపడింది. ఆ తర్వాత ఆయన నాకు ఎన్నో వేషాలు ఇచ్చారు.

ఆ రోజుల్లో విజయవాడలో కమ్యూనిస్టు భావజాల ప్రభావం ఎక్కువగా ఉండేది.. మీపై ఆ ప్రభావం లేదా?

లేదు. దీనికి రెండు కారణాలున్నాయి. మొదటిది- నేను రాజకీయాలకు దూరంగా ఉండేవాణ్ణి. రెండోది మాది కాంగ్రెస్‌ ఫ్యామిలీ. నాన్నగారు- మాగంటి మాధవరావుగారు స్వాతంత్య్ర పోరాట యోధుడు. ఆయన కజిన్స్‌ అందరూ జాతీయోద్యమతో సంబంధం ఉన్నవారే. మాకు మాగంటి అన్నపూర్ణమ్మగారనే బంధువు ఉండేవారు. ఆమె ఎప్పుడూ ఇంగ్లాండ్‌ నుంచి దిగుమతి అయిన చీరలు కట్టేవారట! ఏలూరులో గాంధీగారి సభ తర్వాత- విదేశీ చీరలన్నీ తగలబెట్టి.. కేవలం ఖాదీ మాత్రమే కట్టేవారు. నేను ఇలాంటి వాతావరణంలో పెరిగాను. ఎందుకో తెలియదు కానీ... నాకు చిన్నప్పటి నుంచి వ్యాపారంపైనే ఆసక్తి ఉండేది. నాన్నగారు ఆ సమయంలో ఆదిలాబాద్‌ జిల్లాలో ఫారెస్ట్‌ కాంట్రాక్ట్స్‌ చేసేవారు. సెలవుల్లో నేను అక్కడికి వెళ్లి పనిచేసేవాణ్ణి. అక్కడి వర్కర్లు - ‘‘ చిన్న పిల్లవాణ్ణి ఫారె్‌స్టలో తిప్పుతున్నారెందుకూ?’’ అని నాన్నను అడిగేవారు. అప్పుడు నాన్న - ‘వాడు చెప్పినా వినటం లేదు.. పనిచేయనివ్వండి. జీవితమంటే తెలుస్తుంది’’ అని సమాధానం చెప్పేవారు.

పరిశ్రమను చూసి మీరు నేర్చుకున్నదేమిటి?

మా సమయంలో బాగుపడిన వారు ఉన్నారు. చెడిపోయిన వారు ఉన్నారు. కొందరిని చూసి ఎలా ఉండాలో నేర్చుకున్నా. మరి కొందరిని చూసి ఎలా ఉండకూడదో నేర్చుకున్నా. ఆ సమయంలో విలువలు, కట్టుబాట్లు కూడా అలాగే ఉండేవి. నేను హీరోగా మంచి ఫామ్‌లో ఉన్న సమయంలో ఒక తమిళం పత్రికలో- నాకు, జయచిత్రకు పెళ్లి జరగబోతోందని రాశారు. ఆ వార్తను చదవి- నాకు మొదటి అవకాశం ఇచ్చిన పూర్ణచంద్రరావుగారు ఫోన్‌ చేశారు. ఎక్కడున్నావని అడిగితే వాహినీ స్టూడియోలో షూటింగ్‌లో ఉన్నానన్నాను. ఆయన అక్కడకు వచ్చారు. ‘‘నువ్వు తప్పు చేయవని నాకు తెలుసు. అయినా ఒక వేళ తప్పు చేస్తే హెచ్చరిద్దామని వచ్చా’’ అన్నారు. ఆయన నాపై చూపించిన ఆ పుత్ర ప్రేమకు ఎలా స్పందించాలో అర్ధం కాలేదు. ‘‘మీకు అగౌరవం కలిగే ఏ పని నేను చేయను’’ అని ఆ రోజున ఆయనకు హామీ ఇచ్చాను. ఎప్పుడూ దానికే కట్టుబడి ఉన్నాను. నా సినీ జీవితమంతా ఇష్టంగా కష్టపడ్డాను. ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే- చాలా తృప్తిగా అనిపిస్తుంది.

ఈ రోజు అలాంటి పరిస్థితులు ఉన్నాయా?

లేవు. సినిమా అయిపోయిన తర్వాత ఒకరినొకరు మరచిపోతున్నారు. ఒకసారి పూర్ణచంద్రరావుగారు నాతో- ‘‘నేను ఎంతోమందిని పరిచయం చేశాను. ఏ ఒక్కరూ... ఏ ఇంటర్వ్యూలోనూ నా పేరు చెప్పరు. నువ్వు మాత్రం చెబుతున్నావు.. చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు. మనకు సినీ జీవితాన్ని ఇచ్చిన వారిని మర్చిపోతే ఎలా? వారి పట్ల జీవితాంతం కృతజ్ఞతగా ఉండాలని నేను భావిస్తాను.

మీ కెరీర్‌లో- ‘ఈ పాత్ర అనవసరంగా చేసానే’ అని బాధపడిన సందర్భాలున్నాయా?

లేదు. ఎప్పుడూ కొన్ని విలువలకు కట్టుబడే చేశాను. కానీ దాసరిగారు తీసిన ‘ముద్దబంతిపువ్వు’ అనే ఒక సినిమా మాత్రం చేదు అనుభవం మిగిల్చింది. దీనిలో నాది తాగుబోతు పాత్ర. షూటింగ్‌ సమయంలో గురువుగారు దాసరి- ‘‘దీనితో నీ ఇమేజ్‌ మారిపోతుంది.. చూసుకో’’ అన్నారు. సినిమా విడుదలయిన తర్వాత నేను, దాసరిగారు విజయవాడలో సినిమా చూడటానికి వెళ్లాం. నా తాగుబోతు సీన్లలో ప్రేక్షకులు గట్టిగా అరవటం మొదలుపెట్టారు. నాకు ఎక్కడో తేడా జరిగిందని అర్థమయింది. ఇంటర్వెల్‌ తర్వాత- నేను, గురువుగారు వచ్చేశాం. ఆ తర్వాత తాగుబోతు క్యారెక్టర్లు చేయకూడదని నిర్ణయించుకున్నా.

నెంబర్‌ వన్‌ హీరో కావాలని ఎప్పుడూ అనుకోలేదా?

లేదు. నాకు ఎప్పుడూ అలాంటి ఆశలు లేవు. కుటుంబపరమైన పాత్రల్లో నాగేశ్వరరావు, శోభనబాబు, మురళీమోహన్‌- అని అనుకొనే స్థాయికి వెళ్లాను. నేను ఎప్పుడూ పెద్ద హీరోలతో పోటీ పడలేదు. నా సినిమాల బడ్జెట్‌ తక్కువ ఉంటుంది కాబట్టి పెద్ద హీరోల సినిమాల్లో చేస్తే మంచి పేరు వస్తుందనుకొనేవాణ్ణి. అందుకే సెకండ్‌ హీరో పాత్రలు కూడా చేశా. నన్ను ఎవరు చూసినా- ఇలాంటి భర్త.. ఇలాంటి అన్నయ్య.. ఇలాంటి నాన్నగారు.. ఇలాంటి తాతయ్య ఉంటే బావుండునని అనుకుంటారు. ఆ ఇమేజ్‌ నాకు చాలు. అందుకే 50 ఏళ్లు దాటిన తర్వాత - నేను ఇకపై హీరో క్యారెక్టర్లు చేయనని చెప్పాను. ఎందుకంటే- జనం విసిగిపోయి- ‘వీడు హీరో ఏమిట్రా’ అనుకొనే పరిస్థితికి రాకూడదనేది నా ఉద్దేశం.

మీరు గతంలో 25 సినిమాలు తీసారు. ఇప్పుడు మళ్లీ తీసే ఆలోచన ఉందా?

గత రెండేళ్లుగా ప్రయత్నిస్తున్నా. నాకు నచ్చేకథలు ఇతరులకు నచ్చుతాయో లేదో తెలియదు. నా ఉద్దేశంలో సినిమాకు సామాజిక బాధ్యత కూడా ఉంది. యువతీ, యువకులను పాడుచేసే సినిమాలు తీయకూడదు. గతంలో నేను, మా తమ్ముడు కిషోర్‌, ప్రభాకరరెడ్డిగారు, సత్యన్నారాయణగారు- ఇలా అందరూ కూర్చుని కథ వినేవాళ్లం. ఏ ఒక్కరికి నచ్చకపోయినా వదిలేసేవాళ్లం. ఇప్పుడు ట్రెండ్‌ మారిపోయింది. ‘ఒసేయ్‌...’, ‘ఏరా...’ అనటం.. మగాళ్లు, ఆడవాళ్లు కలిసి మందు తాగటం, సిగరెట్లు కాల్చటం... ఇలాంటి సినిమాలు నేను తీయలేను. అంతేకాదు... పెద్ద హీరోల చుట్టూ తిరిగి... రెండేళ్ల తర్వాత డేట్స్‌ ఇస్తే సినిమా చేయాలని లేదు. హీరో మార్కెట్‌ ఎలా ఉంటుందో తెలియదు. ఇదివరకు ఆరేడు సినిమాలు ఫెయిల్‌ అయినా ఒక సక్సెస్‌ వస్తే మార్కెట్‌ ఉండేది. ఇప్పుడు రెండు సినిమాలు ఫెయిల్‌ అయితే ఎవరూ దగ్గరకు వెళ్లరు.

విలువల ఆధారంగానే...

నేను 25 సినిమాలు తీశా. ‘జయభేరి ప్రొడక్షన్‌’లో వచ్చే సినిమాలకు కొన్ని విలువలు ఉండాలనుకొనేవాడిని. మా బ్యానర్‌లో వచ్చిన చిత్రాలలో ఎక్కడడా అశ్లీలత, అసభ్యత ఉండదు. ఉమ్మడి కుటుంబాలను ప్రోత్సహిస్తాం. మహిళలను గౌరవిస్తాం. కానీ కాలం మారిపోయింది. ఇప్పుడు హీరోలకు కూడా నెగెటివ్‌ షేడ్స్‌ ఉండాలంటున్నారు. ‘అతడు’ సినిమా తీయకముందు- త్రివిక్రమ్‌ మాకు మూడు గంటల కథ చెప్పాడు. అంతా అయిన తర్వాత- ‘‘కథ బావుంది. కానీ హీరో క్యారెక్టర్‌లో నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్నాయి’’ అన్నాను. అప్పుడు త్రివిక్రమ్‌ - ‘‘హీరో శ్రీరామచంద్రుడిలా ఉండాల్సిన అవసరం లేదు. నెగిటివ్‌ నుంచి పాజిటివ్‌గా ఎలా మారాడనే విషయమే ముఖ్యం. ఇంగ్లీషు సినిమాలు చూస్తే అలాగే ఉంటాయి’’ అన్నాడు.

రఫ్‌గా ఉన్నా చూస్తున్నారు...

ఒకప్పుడు హీరో కావటం కష్టం. ‘ఆరడుగులు ఉండాలి. తెల్లగా ఉండాలి. అందంగా ఉండాలి’ అనుకొనేవారు. ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. రజనీకాంత్‌ను హీరోగా ప్రేక్షకులు ఆదరిస్తారని ఆ సమయంలో ఎవ్వరూ అనుకోలేదు. ఇప్పుడు హీరో అంటే అందంగా ఉండాల్సిన అవసరం లేదు. రఫ్‌గా ఉన్నా చూస్తారు. ఎక్కడికో ఎందుకు... మొదట చిరంజీవిగారు అంత గ్లామర్‌సగా ఉండేవారు కాదు. కానీ ఆయనకో ప్రత్యేకమైన స్టైల్‌ ఉంది. అందుకే ఆయన ప్రజల మనస్సుల్లోకి దూసుకువెళ్లిపోయారు.

విశ్వాసం ఉండేది...

ఒకప్పుడు 90 రోజుల్లో సినిమాను విడుదల చేసేసేవాళ్లం. 20 రోజులు ప్రీ-ప్రొడక్షన్‌, 30 రోజులు షూటింగ్‌, 20 రోజులు పోస్ట్‌ ప్రొడక్షన్‌ ఉండేవి. అప్పట్లో మాకు మానిటర్స్‌ ఉండేవి కావు. కాబట్టి డబ్బింగ్‌ సమయం దాకా షాట్స్‌ ఎలా వచ్చాయో తెలిసేవి కావు. డైరక్టర్స్‌, యాక్టర్స్‌... అందరం చాలా జాగ్రత్తగా ఉండేవాళ్లం. మేము తీసిన షాట్‌ మీద మాకొక విశ్వాసం ఉండేది. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఒక షాట్‌ అయిన వెంటనే అందరూ మానిటర్‌ దగ్గరకు వచ్చి చూస్తున్నారు. దాంతో మళ్లీ ఇంకో షాట్‌ తీయటం ఆలస్యమవుతోంది. దీనివల్ల వ్యయం విపరీతంగా పెరిగిపోతోంది.

ప్రేక్షకుల్లో మార్పు వచ్చింది

బెంగాలీ, మయయాళ భాషల్లో సింగిల్‌ పాయింట్‌తో సినిమాలు తీస్తారు. మనకు మాత్రం సినిమాలో అన్నీ ఉండాలి. సంపూర్ణమైన మృష్టాన్న భోజనంలా ఉండాలని ఆశిస్తారు. కానీ ఈ మధ్యకాలంలో తెలుగు ప్రేక్షకుల్లో కూడా మార్పు వచ్చింది. ఇంగ్లీషు సినిమాల మాదిరిగా ఉంటే తప్ప చూడటం లేదు.

చండ్ర రాజేశ్వరరావుగారి ఇంట్లో..

విజయవాడలో మేము ప్రముఖ కమ్యూనిస్టు నేత చండ్రరాజేశ్వరరావుగారి అవుట్‌హౌ్‌సలో అద్దెకు ఉండేవాళ్లం. ఆయనతో మాకు ఎక్కువ పరిచయం లేదు. అప్పుడప్పుడు ఇంటికి వచ్చేవారు. ఇంట్లో ఆయన మామగారు ఉండేవారు. ఆయనను నేను ఒక్కసారి మాత్రమే కలిసిన జ్ఞాపకం. ‘‘నీ గురించి విన్నా.. బిజినెస్‌ బావుందిట కదా!’’ అన్నారు. ఆ ఇంటికి పెద్ద కాంపౌండ్‌ ఉండేది. దాంట్లో మా ఆవిడ రకరకాల కూరగాయలు పండించేది. పూల చెట్లు వేసేది. పెద్దాయన వాటిని చూసి బాగా మురిసిపోయేవారు. ‘‘ఇల్లు నీదే అనుకో.. ఏమి కావాలో కోసుకో’’ అనేవారు. అప్పుడు నాకు రూ.100 జీతం. దాంట్లో రూ.40 అద్దె. వారానికి రెండు సినిమాలు చూసేవాళ్లం. వచ్చేటప్పుడు ఐస్‌క్రీం తినేవాళ్లం. మార్కెట్‌కు వెళ్లి కూరలు తెచ్చుకొనేవాళ్లం. అప్పుడు నాకొక మోటార్‌ సైకిల్‌ ఉండేది. దాని వెనక మా ఆవిడ కూర్చొని బాబును ఎత్తుకొనేది. పాపను ముందు కూర్చోపెట్టుకునేవాళ్లం. ఆ రోజులు ఎంత ఆనందంగా గడిచాయా అనిపిస్తుంది.

మార్పు తెచ్చింది చిరంజీవే!

‘మనవూరి పాండవులు’ సమయంలో నాకు మంచి మార్కెట్‌ ఉంది. నాకు తమ్ముడుగా వేసిన చిరంజీవి నా కళ్లముందే ఆకాశమంత ఎత్తు ఎదిగిపోయాడు. ఆయనను చూస్తే నాకు జెలసీ ఉండదు. నేను ఎందుకంటున్నానంటే- ఆ స్టైల్‌ భిన్నంగా ఉండేది. మంచి కళ్లు ఉండేవి. సాంగ్స్‌, ఫైట్స్‌లో వ్యవస్థనే మార్చేశాడు. రిథమిక్‌గా చేసేవాడు. మార్పును తీసుకువచ్చింది మాత్రం చిరంజీవే!

సీవీఎల్‌ఎన్‌ ప్రసాద్‌

Updated Date - Feb 04 , 2024 | 12:02 AM