Share News

లిల్లీ పూలతో లక్షలు సంపాదిస్తోంది!

ABN , Publish Date - Feb 19 , 2024 | 03:45 AM

ఆమెకు పూలంటే ఇష్టం. కుండీల్లో పూలను పెంచటం భలే ఇష్టం. ఆ ఇష్టమే కాస్త వ్యాపారంగా మార్చుకుంది. తన పేరు విజి అబి. ఉండేది కేరళలో. అందరిలా కాకుండా వాటర్‌ లిల్లీలను పెంచుతోందీమె.

లిల్లీ పూలతో లక్షలు సంపాదిస్తోంది!

ఆమెకు పూలంటే ఇష్టం. కుండీల్లో పూలను పెంచటం భలే ఇష్టం. ఆ ఇష్టమే కాస్త వ్యాపారంగా మార్చుకుంది. తన పేరు విజి అబి. ఉండేది కేరళలో. అందరిలా కాకుండా వాటర్‌ లిల్లీలను పెంచుతోందీమె. నెలకు లక్ష రూపాయలను సంపాదిస్తూ తన పూల వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటోన్న విజి అబిని ‘వాటరాఫ్‌ లిల్లీ’ అని పిలుస్తున్నారిప్పుడు.

‘‘నేనిప్పుడు నీళ్లలో పెరిగే లిల్లీ పూలను ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా ద్వారా దేశంలోనే కాకుండా ఇతర దేశాలకూ అమ్ముతాను. నెలకు కనీసం లక్ష రూపాయల సంపాదన ఉంటుంది. పిల్లలకంటే ప్రేమగా ఈ పూలను పెంచాలి. అప్పుడే ఇందులో రాణించగలం. నా వరకు ఈ వాటర్‌ లిల్లీ పూల వ్యాపారం అంత సులువేమీ కాదు. అనుభవంతోనే పూల పెంపకాన్ని నేర్చుకున్నా.

అలా పూల వ్యాపారంలోకి..

ఎందుకో తెలీదు చిన్నప్పటి నుంచి గార్డెనింగ్‌ అంటే ఇష్టం. మల్లెపూలు, రోజా, గులాబీ పూలను పెంచేదాన్ని. ఏదో ఆసక్తితో ప్రతి ఆడపిల్ల పెంచినట్లే పూల మొక్కలను పెంచేదాన్ని. కుండీల్లో నీళ్లను పోయటం, మట్టి తీసుకురావటం.. పూలను గమనించటం చేసేదాన్ని. పెళ్లయ్యాక కూడా ఇంట్లో పూలను పెంచుకునేదాన్ని. మా అబ్బాయి పుట్టాక ఖాళీగా ఉండేదాన్ని. ఉద్యోగంలో మళ్లీ చేరదామనుకున్నా. ఆ సమయంలో ఇంట్లోనే ఉండి ఏదైనా చేయాలనుకున్నా. బాబును చూసుకుంటూ పూల మొక్కలు ఎక్కువగా ఇంట్లోనే పెంచాలనుకున్నా. అందుకే ఉద్యోగానికి రాజీనామా చేశా. లిల్లీ పూల పెంపకం బావుంటుందని తెలిస్తే ఐదేళ్ల కితం తొలి వాటర్‌ లిల్లీ మొక్కలను కొన్నా. కేరళలో త్రిశూర్‌ ప్రాంతంలోని వాతావరణానికి ఆ మొక్కలు బతకలేదు. దీంతో ఇక్కడ బతికే పూలేవీ అని ఇంటర్నెట్‌లో వెతికా. ఫేస్‌బుక్‌లో వాటర్‌ లిల్లీ పూల గురించి తెలిసింది. ఇంటర్నేషనల్‌ వాటర్‌ లిల్లీ గ్రూప్స్‌తో పాటు గార్డెనింగ్‌ గ్రూప్స్‌లో జాయిన్‌ అయ్యా. వారితో మాట్లాడటం, మెసేజుల్లో సలహాలు తీసుకునేదాన్ని. వాటర్‌ లిల్లీను పెంచా. మంచి గిరాకీ ఉండటంతో.. వాటర్‌ లిల్లీల పెంపకం పూర్తి స్థాయిలో చేయాలనుకున్నా.

అందుకే సక్సెస్‌..

మా ఇంట్లోవారి ప్రోత్సాహం ఉంది. దీనికి తోడు ఈ వాటర్‌ లిల్లీ పూల కోసం మంచి వాతావరణాన్ని క్రియేట్‌ చేశా. ఇంట్లో పనులు చేసుకుని, మా అబ్బాయిని బడికి పంపించి.. ఈ లిల్లీ పూల మొక్కలను ప్రాణంగా చూసుకునేదాన్ని. నాకంటూ ఓ కొత్త ప్రపంచాన్ని ఏర్పరచుకోవాలి. అందులో నేనే డైరక్టర్‌గా ఉండాలనుకుండేదాన్ని మనసులో. అలా ఈ వాటర్‌ లిల్లీ వ్యాపారంలో నిజమైంది. మంచి సక్సెస్‌ అందుకున్నా. ఇంటి వద్దకే కాదు.. ఆన్‌లైన్‌లో ఆర్డర్స్‌ పెరిగాయి. వంద రకాల వాటర్‌ లిల్లీ మొక్కలను పెంచుతాను. ఆర్గానిక్‌ ఫామింగ్‌ చేస్తాను. దగ్గరుండి ఈ పని ప్రేమతో చేస్తాను కాబట్టే పూల గురించి ఎన్నో విషయాలు తెలిసాయి. విభిన్న పూలకోసం వెతకటం.. అంటు కట్టడం చేస్తుంటా. ఏ సీజన్‌లో ఏ పూలకు డిమాండ్‌ ఉంటే అక్కడకు సరఫరా చేస్తాను. అంతర్జాతీయ వాటర్‌ లిల్లీ మెంబర్స్‌ గుర్తించారు. కేరళలో అవార్డులు ఇచ్చారు. ప్రకృతికి మంచి చేసే ఈ పూల వ్యాపారం ఎవరైనా చేసుకోవచ్చని చెబుతా. నాకు తెలిసింది నేర్పిస్తా. విత్తనాలను, పూల మొక్కలను ఇస్తుంటా. నాలా ఈ వ్యాపారం ఇష్టం ఉండేవారికి నా వంతు సాయం చేస్తా. పూలంటే ఎవరికి ఇష్టం ఉండదు? నాకూ అంతే. అయితే కాస్త ఎక్కువ ఇష్టం. అందుకే పూల మనసును అర్థం చేసుకుని.. ఈ వాటర్‌ లిల్లీ పూలతో లక్షలు సంపాదిస్తున్నా.’’

Updated Date - Feb 19 , 2024 | 03:45 AM