Share News

కిడ్నీలు కీలకం

ABN , Publish Date - Mar 12 , 2024 | 01:14 AM

మూత్రపిండాల వ్యాధిని ముందుగానే కనిపెట్టడం కోసం క్రమం తప్పకుండా వ్యాధి నిర్థారణ పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి.

కిడ్నీలు కీలకం

ప్రపంచవ్యాప్తంగా ప్రతి వంద మందిలో పది మంది కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. ఇందుకు కారణం మూత్రపిండాల వ్యాధుల పట్ట తగినంత అవగాహన లేకపోవడమే! కాబట్టి మూత్రపిండాల సంరక్షణ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం అవసరం.

కిడ్నీలు రక్తాన్ని వడగట్టి, వ్యర్థాలను శరీరం నుంచి తొలగిస్తాయనే విషయం అందరికీ తెలిసిందే! ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేసే హార్మోన్లు, ఎములక పెరుగుదలకు ఉపయోగపడే డి విటమిన్‌ తయారీపరంగా కిడ్నీలు తోడ్పడతాయి. రక్తపోటును

నియంత్రణలో ఉంచుతూ గుండె సక్రమ పనితీరుకు సహాయపడతాయి. అలాగే శరీరంలోని, క్యాల్షియం, పొటాషియం మొదలైన పోషకాల నియంత్రణలో కూడా సహాయపడతాయి.

కిడ్నీలు దెబ్బతినే అవకాశాలు ఇవే!

మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బుల సమస్యలు ఉన్నవాళ్లలో మూత్రపిండాల సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువ.

ఊబకాయులు, అరవై ఏళ్లు పైబడినవాళ్లు, ధూమపానం అలవాటు ఉన్నవాళ్లకు కిడ్నీలు చెడిపోయే ప్రమాదం ఎక్కువ

దీర్ఘకాలం పాటు పెయిన్‌ కిల్లర్స్‌, ఇన్సులిన్‌ వాడేవాళ్లకు కూడా ముప్పు పొంచి ఉంటుంది.

కిడ్నీలో రాళ్లు, దీర్ఘకాలిక మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లు మూత్రపిండాల వ్యాధికి దారి తీస్తాయి

కిడ్నీ వ్యాధి నిర్థారణ ఇలా...

మూత్రపిండాల వ్యాధిని ముందుగానే కనిపెట్టడం కోసం క్రమం తప్పకుండా వ్యాధి నిర్థారణ పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి. వ్యాధి నిర్థారణ అయితే వ్యాధి తీవ్రం కాకుండా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. మూత్రపిండాల వ్యాధిని నిర్థారించే పరీక్షల ఖర్చు తక్కువే! రెండు పరీక్షలతో వ్యాధిని నిర్థారించుకోవచ్చు.

మూత్రంలో ప్రొటీన్‌ను పసిగట్టే పరీక్ష ప్రధానమైనది. మూత్రంలో తక్కువ ప్రొటీన్‌ పోవడం మూత్రపిండ వ్యాధికి సంకేతం. యూరిన్‌ ఆల్బ్యుమిన్‌ క్రియాటినిన్‌ రేషియో పరీక్ష ద్వారా కిడ్నీ సమస్యను కనిపెట్టవచ్చు.

కిడ్నీలో రక్తం ఏ మేరకు శుద్ధి అవుతుందో తెలిపే పరీక్ష జిఎ్‌ఫఆర్‌ పరీక్ష. ఈ పరీక్షతో కిడ్నీ పనితీరు తెలుస్తుంది. ఈ రెండు పరీక్షల్లో అవకతవకలు కనిపిస్తే, ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రతించాలి.

కిడ్నీ కేర్‌

మధుమేహం, అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవాలి.

మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లను, మూత్ర వ్యవస్థలో సమస్యలను వెంటనే పరిష్కరించుకోవాలి.

తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతో కూడిన సంతులన ఆహారం తీసుకోవాలి.

క్రమం తప్పక వ్యాయామం చేయడంతో పాటు, సరిపడా విశ్రాంతి తీసుకోవాలి

మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి.

ఇవి కూడదు

మరీ ముఖ్యంగా అధిక రక్తపోటు ఉన్నవాళ్లు ఉప్పును పరిమితంగా వాడుకోవాలి.

ధూమపానం కిడ్నీ ఫెయిల్యూర్‌ సమస్యను పెంచుతుంది. కాబట్టి ఈ అలవాటు మానుకోవాలి

వైద్యులు సూచించకపోయినా పెయిన్‌ కిల్లర్స్‌ వాడుకోకూడదు

ఆరోగ్యానికి హాని చేసే పసరు మందులు వాడకూడదు

తరచూ అధిక ప్రొటీన్‌తో కూడిన రెడ్‌ మీట్‌, ప్రాసెస్డ్‌ ఫుడ్‌ తినకూడదు

డయాలసిస్‌ - కిడ్నీ మార్పిడి

కిడ్నీ వ్యాధి ఉన్న ప్రతి ఒక్కరికీ డయాలసిస్‌ అవసరం ఉండదు. వ్యాధి ప్రారంభ దశలో సమర్థమైన చికిత్స, వ్యాయామం, ఆహారంతో వ్యాధి ముదరకుండా, అదుపులోకి తెచ్చుకోవచ్చు. క్రియాటిన్‌ పెరుగుదలను మందులతో అరికట్టవచ్చు. వ్యాధి తీవ్రత పెరిగి కిడ్నీలు పూర్తిగా పని చేయడం మానేసినప్పుడు మాత్రమే డయాలసిస్‌ లేదా కిడ్నీ మార్పిడి అవసరమవుతుంది. సరైన జాగ్రత్తలు, ఆహార నియమాలు పాటించగలిగితే, డయాలసి్‌సతో సగటు ఆయుర్దాయం 15 నుంచి 20 సంవత్సరాల వరకూ పెరిగిన దాఖలాలు ఉన్నాయి. అయితే మూత్రపిండాల వ్యాధికి డయాలసిస్‌ నివారణ కాదు. మూత్రపిండాల మార్పిడి చేసుకునేవరకూ డయాలసిస్‌ మీద ఆధారపడక తప్పదు. అయితే కిడ్నీ మార్పిడి క్లిష్టమైన వ్యవహారం. సరైన డోనార్‌ దొరికే వరకూ ఎదురుచూడవలసి ఉంటుంది. కాబట్టి మూత్రపిండాలు వ్యాధులకు గురి కాకుండా కాపాడుకోవాలి. మధుమేహం, అధిక రక్తపోటులను అదుపులో ఉంచుకుంటూ, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవాలి. మధుమేహులు, అధిక రక్తపోటు ఉన్నవారు, 50 ఏళ్లు పైబడినవాళ్లు, గుండె జబ్బులు ఉన్నవాళ్లు, ఊబకాయులు క్రమం తప్పకుండా కిడ్నీ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను కలవాలి.

డాక్టర్‌ హిమదీప్తి ఆళ్ల

నెఫ్రాలజిస్ట్‌ అండ్‌ రీనల్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ ఫిజీషియన్‌,

ఎరిటి హాస్పిటల్స్‌, గచ్చిబౌలి, హైదరాబాద్‌.

Updated Date - Mar 12 , 2024 | 01:14 AM