Share News

జ్ఞాన తీర్థ సంగమం

ABN , Publish Date - Mar 22 , 2024 | 04:14 AM

శ్రీ రాఘవేంద్రస్వామి పూర్వావతారం... విష్ణుభక్తుడు, శ్రీ నరసింహావతార కరుణాపాత్రుడు అయిన ప్రహ్లాదుడు కాగా... ఆ తదుపరి అవతారం శ్రీవ్యాసరాజ యతివరేణ్యులు.

జ్ఞాన తీర్థ సంగమం

శ్రీ రాఘవేంద్రస్వామి పూర్వావతారం... విష్ణుభక్తుడు, శ్రీ నరసింహావతార కరుణాపాత్రుడు అయిన ప్రహ్లాదుడు కాగా... ఆ తదుపరి అవతారం శ్రీవ్యాసరాజ యతివరేణ్యులు. ఆయన ఆరాధన, శ్రీ రాఘవేంద్రుల గురువు శ్రీ సుధీంద్ర తీర్థుల ఆరాధన కూడా ఫాల్గుణ మాసంలోనే జరుగుతుంది. అందులోనూ కృష్ణపక్షంలో వచ్చే తదియ నాడు... మధ్వ సంప్రదాయంలో కలికితురాయిలు అనదగిన గొప్ప యతివరేణ్యులు శ్రీ వ్యాసరాజులు, శ్రీ వాదిరాజులు, శ్రీ సుధీంద్ర తీర్థుల ఆరాధనలు జరగడం మరో విశేషం. అవి ఈ నెల 28న రాబోతున్నాయి. ‘‘అది అత్యంత పవిత్రమైన రోజు మాత్రమే కాదు... మధ్వులకు త్రివేణీ సంగమం’’ అని ప్రసిద్ధ ప్రవచనకారుడు శ్రీ బ్రాహ్మణాచార్యులు వర్ణించారు. గంగ, యమున, సరస్వతి నదులతో కూడినది మనకు తెలిసిన త్రివేణీ సంగమం... కాగా ఆ రోజు ముగ్గురు జ్ఞాన తీర్థుల సంగమం. నదీ తీర్థాలలో వచ్చే పుణ్యఫలం... భగవంతుడు మనకు ఇచ్చినప్పుడు లభిస్తుంది. కానీ తీర్థుల జ్ఞాన సంగమంలో... వారి స్మరణ ద్వారా, వారి బృందావనాల దర్శనం ద్వారా రావలసిన పుణ్య ఫలం తక్షణమే లభిస్తుంది. ఈ యతివరేణ్యులు ముగ్గురూ... మధ్వ సిద్ధాంత సేవ చేయడానికి అవతరించిన దేవతాస్వరూపుల్లో ప్రముఖులు. జ్ఞాన సంపాదనకు, భక్తి ప్రబోధాలకు, జీవితాలను అంకితం చేసిన మహానుభావులు.

ఉడుపికి సమీపంలో ఆనేగుడ్డే అనే ప్రసిద్ధ గణపతి క్షేతం ఉంది. అక్కడికి దగ్గరలోని హూవినకెరెలో సామవేద అధ్యయనం చేసిన వంశానికి చెందిన రామాచార్యులు, గౌరి అనే దంపతులు నివసించేవారు. వారు ఉత్తమమైన పుత్ర సంతానం కోసం తమ భక్తితో, జపతపాలతో భగవంతుణ్ణి మెప్పించే ప్రయత్నం చేశారు. సోణ్ణా మఠానికి చెందిన శ్రీ వాగీశ తీర్థుల దగ్గరకు వెళ్ళి... తమ కోరికను విన్నవించుకున్నారు. వారికి పుత్ర సంతానం కలుగుతుందని ఆయన దీవిస్తూ... ‘‘ఇంటి బయట బిడ్డ జన్మిస్తే మా మఠానికి ఇవ్వాలి. ఇంటి లోపల జన్మిస్తే మీరే ఉంచుకోవచ్చు’’ అని ఆదేశించారు. ‘బిడ్డ జన్మించేది ఇంట్లోనే. ప్రసవానికి బయటకు వెళ్ళేది లేదు కదా!’’ అని ఆ దంపతులు భావించారు. గౌరి గర్భం దాల్చిన తరువాత అన్ని జాగ్రత్తలనూ తీసుకొనేవారు. ఉడుపి ప్రాంతంలోని వారి ఇల్లు పొలాల మధ్య ఉంది. శార్వరి నామ సంవత్సరం మాఘ శుద్ద ద్వాదశి రోజున... ముందురోజు ఉపవాసాన్ని విరమించిన రామాచార్యులు భోజనం చేస్తూ ఉండగా... ఒక ఆవు వచ్చి పంటను మేయడం మొదలుపెట్టింది. దాన్ని అదిలించి పంపేందుకు గౌరి బయట కాలు పెట్టింది. పది అడుగులు వేయగానే ఆమెకు ప్రసవవేదన ప్రారంభమై... ఇంటి బయట పొలంలో మగబిడ్డను ప్రసవించింది. తపోజ్ఞాని అయిన శ్రీవాగీశ తీర్థులు పంపిన బంగారు పళ్ళెంలో... ఆ బిడ్డను మంత్రసానులు ఉంచారు. తమ వాగ్దానం ప్రకారం ఆ బిడ్డను మఠానికి రామాచార్యుల దంపతులు ఇచ్చేశారు. ఆ బిడ్డే మహిమాన్వితుడైన శ్రీ వాదిరాజ తీర్థులు. ఆ మఠానికి భూ వరాహ ప్రతిమను శ్రీ మధ్వాచార్యులు ఇచ్చారు. దాన్ని గుర్తు చేసేలా ఆ బిడ్డకు ‘భూ వరాహ’ అని శ్రీ వాగీశతీర్థులు నామకరణం చేశారు. ‘‘అయిదేళ్ళు వచ్చేవరకూ మీ దగ్గరే అతణ్ణి పెంచండి. తరువాత మఠానికి అప్పగించండి’’ అని రామాచార్య దంపతులకు ఆ బిడ్డను ఆయన తిరిగి ఇచ్చారు.

శ్రీ వ్యాసరాజుల జననం కూడా దాదాపు ఇదే విధంగా ఉంటుంది. కర్ణాటకలోని మైసూరుకు సమీపంలో ఉన్న అబ్బూరుకు చెందిన రామాచార్యులు, లక్ష్మీ దేవి దంపతులు... సంతానం కోసం బదరీ యాత్రకు బయలుదేరారు. మార్గమధ్యంలో రామాచార్యులు ఆరోగ్యం క్షీణించి, మంచం పట్టారు. ఆయనపై అందరూ ఆశ వదిలేసుకున్నారు. ఈలోగా... బ్రహ్మణ్య తీర్థులు అనే యతి బదరీ యాత్ర ముగించి తిరుగు ప్రయాణంలో ఉన్నారనీ, తాము ఉన్న ఊరిలోనే ఆయన బస చేస్తారనీ లక్ష్మ్మీదేవికి తెలిసింది. ఆయనను ఆమె దర్శించుకోగా ‘‘దీర్ఘ సుమంగళీభవ అనీ, సుపుత్ర ప్రాప్తిరస్తు’’ అని దీవించారు. వాగీశ తీర్థుల మాదిరిగానే... ఇంట్లో బిడ్డ జన్మిస్తే మీరే ఉంచుకోవచ్చనీ, బయట జన్మిస్తే మఠానికి అందించాలనీ ఆయన ఆదేశించారు. కేవలం ఆయన మాటతో రామాచార్యులు సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందారు. సత్య లోకంలో బ్రహ్మ దేవుని వద్ద ఉంటూ, పరమాత్ముని పూజకు రోజూ పూలను తెచ్చే శంఖుకర్ణుడు తన రెండవ జన్మగా... శ్రీ వ్యాసరాజులుగా వారి ఇంట పుట్టాడు. ఈ జననం కూడా ఇంటి బయటే జరిగింది. ఆ బిడ్డను బ్రహ్మణ్య తీర్థులే శుద్ధ జలంతో కడిగి, దేవుడికి అభిషేకించిన పాలను మొదటగా తాగించారు.

ఈ ఇద్దరు యతివరేణ్యుల జననం, ఇతర సంస్కార విషయాల్లో సారూర్యత మనకు కనిపిస్తుంది. ఇద్దరి జననం ఇంటి బయటే జరిగింది. వారి గురువులు పరమాత్మ సంకల్పాన్ని ఎరిగినవారై... వారు పుట్టగానే భూమిని స్పృశించకుండా బంగారు పళ్ళాలను పంపారు. ఇద్దరికీ ఎనిమిదేళ్ళ వయసులోనే సన్యాసాశ్రమ స్వీకారం జరిగింది. వారిద్దరూ తిరుమల శ్రీనివాసుడికి సేవలు అందిచారు. ఇరువురూ అద్వితీయమైన ఉద్గ్రంథాలను రచించారు. సుప్రసిద్ధమైన కీర్తనలు రాశారు. శ్రీ వ్యాసరాజుల వారి శిష్యులే శ్రీ వాదిరాజులు. ఇక సాక్షాత్తూ శ్రీ రాఘవేంద్రులకే గురువుగా ప్రసిద్ధికెక్కినవారు శ్రీ సుధీంద్రతీర్థులు. ఆ ముగ్గురి ఆరాధన ఒకే రోజు. ఆ మహిమాన్వితులైన చరిత్రలను సంపూర్ణంగా తెలుసుకొని, మననం చేసుకోవడం ద్వారా వారి అనుగ్రహం లభిస్తుంది. తద్వారా

ఆ శ్రీహరి అనుగ్రహానికి పాత్రులం కాగలం.

ఫ మధ్వ ప్రచార పరిషత్‌

9440258841

మధ్వ సంప్రదాయంలో ఉన్నవారికి ఫాల్గుణ మాసం అత్యంత విశేషమైనది. ఈ మాసంలో విష్ణుప్రీతి కోసం వ్రతాలు చేస్తారు. అంతేకాకుండా... ఈ సంప్రదాయంలోని అనేకమంది యతుల ఆరాధనోత్సవాల సమాహారం ఈ మాసం. ఉత్తరాది మఠానికి చెందిన శ్రీ సత్యబోధ తీర్థులు, శ్రీ సత్యవ్రత తీర్థులు, శ్రీ సత్య సంతుష్ట తీర్థులు, సోణ్ణా మఠానికి చెందిన శ్రీ వాదిరాజ తీర్థుల ఆరాధనలు ఈ మాసంలోనే వస్తాయి. అలాగే తుంగభద్ర నదీ తీరాన వెలసిన మంత్రాలయ మహాప్రభువు శ్రీ రాఘవేంద్ర స్వామి పట్టాభిషేక, ఆరాధన ఉత్సవాలూ ఈ మాసంలోనే జరుగుతాయి.

Updated Date - Mar 22 , 2024 | 04:14 AM