జగన్నాథ రథోత్సవం జగదానందపర్వం...
ABN , Publish Date - Jul 05 , 2024 | 12:30 AM
జగన్నాథుడు, సుభద్ర, బలదేవుడు తమతమ రథాల్లో ఆసీనులై... భక్తులకు దర్శనం ఇవ్వడానికి ఊరేగింపుగా కదలివచ్చే మహోత్సవం శ్రీ జగన్నాథ రథయాత్ర.

7న శ్రీ జగన్నాథ రథోత్సవం
జగన్నాథుడు, సుభద్ర, బలదేవుడు తమతమ రథాల్లో ఆసీనులై... భక్తులకు దర్శనం ఇవ్వడానికి ఊరేగింపుగా కదలివచ్చే మహోత్సవం శ్రీ జగన్నాథ రథయాత్ర. ఒడిశా రాష్ట్రంలోని అత్యంత పురాతనమైన శ్రీజగన్నాథుడి దివ్యథామం... జగన్నాథపురి (పూరీ) క్షేత్రంలో ప్రతి యేటా కన్నుల పండుగగా జరిగే వేడుక ఇది. పూరీ ప్రధాన ఆలయం నుంచి గుండీచా ఆలయం వరకూ కొనసాగే ఈ రథయాత్రలో... జగన్నాథుడు, బలదేవుడు, సుభద్ర... నందిఘోష, తాళధ్వజ, దేవదళన అనే తమతమ రథాలను అధిరోహిస్తారు. హరేకృష్ణ ఉద్యమ సంస్థాపకాచార్యులైన శ్రీల ప్రభుపాదులు... జగన్నాథ రథయాత్రను యావత్ ప్రపంచానికీ పరిచయం చేశారు. ఆయన ప్రచార ప్రభావం వల్ల అనేక ఖండాల్లోని భక్తులు ఈ విశిష్టమైన రథయాత్రను ఏటా నిర్వహిస్తున్నారు.
భక్తుల కోసం కదలివచ్చే స్వామి...
జగన్నాథుడంటే... నంద మహారాజు పుత్రుడై అవతరించిన, సాక్షాత్తూ దేవదేవుడైన శ్రీకృష్ణుడే. శ్రీకృష్ణుని నిత్య లీలల్లో పాలు పంచుకొనేందుకు వివిధ పాత్రల్లో అవతరించే ఆయన పరివ్యాప్త స్వరూపం... ఆయన సోదరుడైన బలదేవుడు, బలరాముడు లేదా బలభద్రుడు. సుభద్రమ్మ శ్రీకృష్ణుని సోదరి. జగన్నాథుడంటే సమస్త జగత్తుకూ నాథుడు. ‘జగత్’ అంటే ‘కదిలేది’ అని అర్థం. అది ఈ విశ్వాన్ని సూచిస్తుంది. అందుకే జగన్నాథుడంటే విశ్వానికంతటికీ ప్రభువు. వివిధ కారణాల వల్ల స్వామి కృపను పొందేందుకు ఆలయానికి రాలేకపోయిన వారిని సైతం కరుణించడం కోసం... ఏడాదికి ఒకసారి ఆ స్వామే స్వయంగా బయటకు వస్తాడు. ఈ విధంగా ఆయనను సేవించే గొప్ప అవకాశం ప్రతి ఒక్కరికీ లభిస్తుంది. భక్తియుత భావనతో చేసే ఈ సేవ... మోక్షదాయకమై... భగవద్ధామానికి చేరుస్తుంది. ‘రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే’... అంటే ‘‘రథాన్ని అధిరోహించిన జగన్నాథుణ్ణి ఎవరైతే దర్శిస్తారో వారు పునర్జన్మ నుండి విముక్తిని పొందుతారు’’ అనే శాస్త్రవచనాన్ని.. లండన్ రథయాత్ర సందర్బంగా శ్రీల ప్రభుపాదుల వారు భక్తులందరికీ తెలియజేశారు. జగన్నాథుణ్ణి కీర్తిస్తూ ఆదిశంకరాచార్యులు ఎనిమిది శ్లోకాలతో రచించిన ‘శ్రీజగన్నాథాష్టకం’ సుప్రసిద్ధమైనది. ‘‘జగన్నాథుడు తన రథంపై వెళుతున్నప్పుడు... అడుగడుగునా ప్రార్థనలు, కీర్తనలు బిగ్గరగా వినిపిస్తాయి. వారి స్తోత్రాలను వింటూ అత్యంత ప్రసన్నుడైన ఆ జగన్నాథుడు... దయాసముద్రుడు, సమస్త లోకాలకూ నిజమైన స్నేహితుడు. అమృతోద్భవ సమయాన జన్మించిన ఆ లక్ష్మీదేవీ పతి అయిన జగన్నాథుడు నా కన్నుల ప్రయాణంలో ఎల్లప్పుడూ ఎదురుగా ఉండుగాక’’ అని ఆదిశంకరులు ప్రస్తుతించారు.
ఆ రూపాలు దైవ సంకల్పమే...
నేడు మనం దర్శిస్తున్న జగన్నాథ, బలదేవ, సుభద్రా రూపాలు... వారివారి మహాభావ ప్రకాశ తత్త్వానికి ప్రతిరూపాలు. దేవశిల్పి అయిన విశ్వకర్మ... వారి రూపాలను ఇలా ప్రత్యేకమైన ఆకృతిలో మలచడం కూడా ఆ జగన్నాథుడి సంకల్పమే. దీనికి కారణాలు ‘స్కాంద పురాణం’లోని ‘ఉత్కళకాండ’లో ఉన్నాయి. ఒక రోజు సూర్యగ్రహణం సంభవించినవేళ... శ్రీకృష్ణుడు, బలరాముడు తమ సోదరి సుభధ్రతోనూ... కుటుంబ, సపరివార సమేతంగానూ కురుక్షేత్రంలో పుణ్యస్నానాలు చేయడానికి ద్వారకనుంచి బయలుదేరి వెళ్ళారు. ఆ సమయంలో... బృందావనం నుంచి వచ్చిన నంద యశోదలు, రాధారాణి మొదలైన వ్రజవాసులందరినీ అక్కడ కలుసుకున్నారు. యాత్రికులందరూ తమతమ కుటీరాలను అక్కడ ఏర్పాటు చేసుకున్నారు. బలరాముని తల్లి అయిన రోహిణి తన కుటీరంలో... శ్రీకృష్ణుడి భార్యలకు శ్రీకృష్ణ, బలరాముల బృందావన బాల్య లీలలను వివరించడం మొదలుపెట్టింది. అటువైపు ఎవరూ రాకుండా చూడాలని సుభద్రను కాపలాగా ఉచింది. ఇంతలో శ్రీకష్ణుడు, బలరాముడు అక్కడికి వచ్చారు. లోపల జరుగుతున్నది వారికి సుభద్ర చెప్పింది. ముగ్గురూ ద్వారం దగ్గరే నిలబడి, రోహిణి చెబుతున్న విషయాలను వినసాగారు. గోపికలు, వ్రజవాసులతో కూడిన తమ బాల్య మధుర ఘట్టాలను విని బలరామకృష్ణులు పరవశించారు. వారి నేత్రాలు విశాలమయ్యాయి, శిరస్సు విస్తరించింది, కరచరణాలు లోపలికి చొచ్చుకుపోయాయి. వారిలోని అంతర్గతమైన మాధుర్య భావనలు... బాహ్యంగానూ వ్యక్తమై వారి శరీరాకృతులను మార్చేశాయి. వారిరువురినీ చూసిన సుభద్ర... అదే రీతిలో పారవశ్యానికి లోనయింది. ఆ దివ్యరూపాలను దర్శించిన నారదముని,... అదే రూపాల్లో ఈ లోకంలో కొలువు తీరాలని కోరగా... శ్రీకృష్ణుడు సమ్మతించాడు. ద్వారకాపురవాసులు శ్రీకృష్ణుణ్ణి ఐశ్వర్య భావనతో సేవిస్తే... బృందావన వ్రజవాసులు మాత్రం మాధుర్య ప్రేమ భావనలతో ఆరాధించారు. వారు చూసిన ఆ మధురప్రేమకు ప్రతిరూపాలై వెలిశారు జగన్నాథ, బలదేవ, సుభద్రలు. శ్రీకృష్ణుడి జన్మతిథి శ్రావణ బహుళాష్టమి అయినప్పటికీ... ఆనాడు కురుక్షేతంలో మహాభావ ప్రకాశ తత్త్వాన్ని వ్యక్తపరుస్తూ జగన్నాథుడిగా ఆయన ఆవిర్భవించిన... జ్యేష్ట పౌర్ణమినే... జగన్నాథుడి జన్మతిథిగా పరిగణించడం మరో విశేషం.
జగన్నాథ రథయాత్రలో ఎలా పాల్గొనాలి?
జగన్నాథుడి రథోత్సవం భగవంతుణ్ణి సేవించే సదవకాశాన్ని భక్తకోటికి అందిస్తుంది. రథంపై ఆసీనుడైన స్వామిని కనులారా దర్శించుకోవచ్చు. తాడును పట్టుకొని రథాన్ని లాగవచ్చు. వివిధ ధూప దీప హారతుల మధ్య దేదీప్యమానంగా వెలుగొందే స్వామిని వీక్షించవచ్చు. స్వామికి అమితానందం కలిగించే విధంగా నృత్య సంకీర్తనలు చేయవచ్చు. రథం వెళ్ళే మార్గాన్ని శుభ్రపరచి, రంగురంగుల ముగ్గులతో అలంకరించవచ్చు. వివిధ రకాల పుష్పాలు, ఫలాలు, కొబ్బరికాయలు, రుచికరమైన మధుర పదార్థాలను స్వామికి నివేదించవచ్చు. భక్తిపూర్వకంగా చేసే సేవ ఏపాటిదైనా... అది మనల్ని ఆధ్యాత్మికంగా మరింత పురోగమింపజేస్తుంది. అటువంటి సేవాభాగ్యాన్ని ఏ విధమైన తారతమ్యాలూ లేకుండా ప్రతి ఒక్కరికీ అనుగ్రహిస్తున్న జగన్నాథుడు... పతితపావన సార్థక నామధేయుడు.
శ్రీసత్యగౌర చంద్రదాస ప్రభూజీ
అధ్యక్షుడు, హరే కృష్ణ మూవ్‌మెంట్,
హైదరాబాద్, 9396956984