Share News

డైలాగ్‌ రాక్షసి అని పిలిచేవారు

ABN , Publish Date - Mar 25 , 2024 | 12:43 AM

నాటక రంగంలో ఒక నటిగా కన్నా దర్శకురాలిగా పేరు సంపాదించుకోవడం చాలా కష్టం.

డైలాగ్‌ రాక్షసి అని పిలిచేవారు

పోలీసు అధికారి అవ్వాలని కోరుకున్నా...

తల్లితండ్రుల ప్రోత్సాహంతో రంగస్థలం

వైపు అడుగులు వేశారు

ప్రొఫెసర్‌ భళ్లమూడి పద్మప్రియ.

చివరకు దాన్నే ఆమె కెరీర్‌గా మలుచుకుని...

నేడు ఎందరో ఔత్సాహికులను నాటక రంగానికి అందిస్తున్నారు. నటిగా రెండు వందలకు పైగా నాటకాలు... రెండు వేలకు పైగా ప్రదర్శనలు...

దర్శకురాలిగా ఎన్నో ప్రయోగాలు. తెలుగు వర్సిటీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా బహుముఖ సేవలు అందిస్తున్న పద్మప్రియ ప్రస్థానం ‘నవ్య’కు ప్రత్యేకం.

‘‘నాటక రంగంలో ఒక నటిగా కన్నా దర్శకురాలిగా పేరు సంపాదించుకోవడం చాలా కష్టం. మగవాళ్ల కంటే చాలా భిన్నంగా, మరింత సృజనాత్మకంగా ప్రతిభను చాటగలిగినప్పుడే రంగస్థలంలో మనకంటూ ఒక గుర్తింపు లభిస్తుంది. అందుకు పురుషులకంటే మరింత ఎక్కువ కష్టపడాలి కూడా. అప్పుడే మనదైన ముద్రతో రాణించగలం. నామటుకు నేను నలభైకు పైగా నాటకాలకు దర్శకత్వం వహించాను. ‘పద్మప్రియ నాటకాలన్నీ దేనికదే ప్రత్యేకమనే’ ప్రశంసలను ప్రేక్షకుల నుంచి అందుకొన్నాను. జాలర్ల జీవిత ఇతివృత్తంగా సాగే ‘మోరియా’ నాటక ప్రదర్శన కోసం రవీంద్ర భారతి వేదిక మీద ఏకంగా సముద్రం సెట్‌ వేశాను. పురాతన గ్రీకు నాటకం ‘యాంటిగోన్‌’లో పాత్రధారులకు గోనె సంచులతో కాస్ట్యూమ్స్‌ డిజైన్‌ చేయడంతోపాటు ఆ నాటకాన్ని ఆరుబయట ప్రయోగాత్మకంగా ఎన్విరాన్‌మెంటల్‌ థియేటర్‌ ప్రక్రియలో ప్రదర్శించాను. ‘కౌముది మహోత్సవం’, ‘అంతర్యుద్ధం’, ‘కట్టు బానిస’, ‘కాగితం పులి’... ఇలా నా దర్శకత్వంలోని ప్రతి నాటకాన్నీ సందర్భానుసారంగా లైటింగ్‌ ఎఫెక్టులు, విభిన్నమైన రంగాలంకరణ లాంటి మోడ్రన్‌ థియేటర్‌ టెక్నిక్స్‌తో వినూత్నంగా చూపించడానికి ప్రయత్నించాను. వాస్తవికేతర నాటకాలను ఎంపిక చేసుకోవడం... వాటికి సింబాలిజం, ఎక్స్‌ప్రెషనిజం, ఎగ్జిస్టెన్షియలిజం లాంటి ఆధునిక పద్ధతులను మిళితం చేయడం నాకు ఇష్టం. నా దర్శకత్వంలోని ప్రతి నాటకానికీ సెట్‌, కాస్ట్యూమ్స్‌లను నేనే డిజైన్‌ చేసుకొంటాను.

ఔట్‌ ఆఫ్‌ ది బాక్స్‌ ఆలోచించేలా...

ఔత్సాహిక నాటకాలకు భిన్నంగా రంగస్థలంపై విభిన్న ప్రయోగాలు చేయడానికి అవసరమైన కొత్త చూపును నాకు ఇచ్చింది మాత్రం హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీనే. అక్కడ నేను థియేటర్‌ ఆర్ట్స్‌ మొదటి సంవత్సరం చదువుతున్న సమయంలో మా ప్రొఫెసర్‌ డీఎ్‌సఎన్‌ మూర్తి నాకు ఒక సన్నివేశాన్ని ఇచ్చి డైరెక్టు చేయమన్నారు. అప్పటికే కొన్ని వందల నాటకాల్లో నటించిన అనుభవం ఉన్న నాకు ఇదొక లెక్కా అనుకొని, ఠపీమని చేసి చూపించాను. ‘పక్కా పరిషత్‌ నాటకంలా చేశావు. ఇది చేయడానికైతే ఇక్కడి వరకు రానక్కర్లేదు. విభిన్నంగా ఆలోచించాలి కదా’ అన్నారు మూర్తి సర్‌. ఆ మాటలు నన్ను ఔట్‌ ఆఫ్‌ దిబాక్స్‌ ఆలోచించేలా చేశాయి. రంగస్థలంపై ప్రయోగాలు చేయడానికి ప్రేరణ కలిగించాయి. అదే యూనివర్సిటీలో తర్వాత ‘రంగస్థల శిక్షణతో వ్యక్తిత్వ వికాసం’ అంశం మీద పీహెచ్‌డీ కూడా పూర్తి చేశాను. తెలుగు నాటకరంగంలో మొట్టమొదటగా పీహెచ్‌డీ చేసిన మహిళను నేనే అని తెలిసి సంబరపడ్డాను.

పట్టాభిరాం సహకారంతో...

నా పరిశోధన కూడా చాలా సవాళ్లతోనే సాగింది. ‘రంగస్థల శిక్షణతో వ్యక్తిత్వవికాసం’ టాపిక్‌ తీసుకొంటానని మా గైడ్‌ ప్రొఫెసర్‌ బిట్టు వెంకటేశ్వర్లుతో చెప్పినప్పుడు... ‘చాలా మంచి అంశం. కాకపోతే దీని మీద రిఫెరెన్స్‌ పుస్తకాలంటూ ప్రత్యేకంగా ఏమీ లేవు. థీసెస్‌ రాయడానికి కూడా చాలా కష్టమవుతుంది’ అని ఆయన అన్నారు. ‘మరెవ్వరూ చెయ్యలేదు కనుకే నేను చేస్తాను’ అని మా గైడ్‌ను ఒప్పించిమరీ అదే టాపిక్‌ ఎంపిక చేసుకున్నాను. వ్యక్తిత్వ వికాస నిపుణుడు బీవీ పట్టాభిరామ్‌ను కలిసి, మొదట ఆయన సూచించిన వ్యక్తిత్వవికాస పుస్తకాలన్నీ చదివాను. తర్వాత కొద్ది రోజులు ఆయనతో పాటు కౌన్సెలింగ్‌ సెషన్స్‌లో కూర్చొని విన్నాను. అలా క్రమశిక్షణ, సమయపాలన, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ అభివృద్ధి, ఏకాగ్రత పెరుగుదల, సమష్టి తత్వం... లాంటి లక్షణాలు రంగస్థల శిక్షణతో పెంపొందుతాయని రూఢీ చేస్తూ వాటన్నింటినీ థీసె్‌సలో సవివరంగా రాశాను. వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడే రంగస్థల ఆటలు కూడా బోలెడున్నాయి. అందుకే ప్రతి ఒక్క ఇంటర్నేషనల్‌ స్కూల్లో ఇప్పుడు థియేటర్‌ ట్రైనర్‌ను తప్పనిసరిగా నియమిస్తున్నారు. అలా నేనూ ఒక కార్పొరేట్‌ పాఠశాలలో కొంతకాలం పని చేశాను. సిగ్గు, బిడియం లాంటివాటిని అధిగమించడానికి, స్పీచ్‌ను మరింత మెరుగుపరుచుకోడానికి రంగస్థల శిక్షణ చాలా తోడ్పడుతుంది. కొన్ని రకాల మానసిక సమస్యలకు కూడా ఇది గొప్ప ఉపశమనం. కనుక వర్క్‌షాప్స్‌ ద్వారా చాలామందికి రంగస్థల నటనలో శిక్షణ ఇచ్చాను.

అలా మొదలైంది...

నా బాల్యం చాలావరకు ప్రసిద్ధ నాటక ఉద్యమకర్త ఏఆర్‌ కృష్ణ గారింట్లోనే గడిచింది. అమ్మానాన్నకు ఆయనే పెద్ద దిక్కు కావడంతో స్కూలుకు సెలవులు వస్తే చాలు నేను కృష్ణ తాతయ్య వాళ్ల ఇంటికి వెళ్లేదాన్ని. ఆయన ఒడిలో కూర్చొని నాటకాల రిహార్సిల్స్‌ చూసేదాన్ని. అప్పుడప్పుడూ తాతయ్య నాతోనూ డైలాగులు చెప్పిస్తుండేవారు. పదేళ్ల వయసులో అనుకొంటా... కృష్ణ తాతయ్య దగ్గర ఒక చిల్డ్రన్స్‌ థియేటర్‌ వర్క్‌షాప్‌ పూర్తి చేసి ‘మళ్లీ మళ్లీ పుడితే గిడితే’ నాటకంలో మొట్ట మొదటిసారి రంగస్థలం మీద నటించాను. తర్వాత పదో తరగతిలో ఉండగా ‘రసరంజని’ నిర్వాహకుల్లో ఒకరైన సోమేశ్వరరావు దర్శకత్వంలో ‘కాకి ఎంగిలి’ నాటకంలో కథానాయికిగా నటించాను. అది నాకు మంచి గుర్తింపు తెచ్చింది. ఇక అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడలేదు.

‘రంగస్థల సావిత్రి’ అనేవారు...

రెండు వందలకుపైగా నాటకాల్లో... దాదాపు రెండు వేల ప్రదర్శనల్లో నటించాను. అతి తక్కువ సమయంలో సంభాషణలు కంఠతా చెప్పడం నా ప్రత్యేకత. అది చూసి చాట్ల శ్రీరాములు గారు నన్ను ‘డైలాగ్‌ రాక్షసి’ అని పిలిచేవారు. మరొక నాటకరంగ ప్రముఖుడు డీఎస్‌ దీక్షిత్‌ గారు ఒక జాతీయ సదస్సులో నన్ను ‘రంగస్థల సావిత్రి’ అంటూ కొనియాడారు. జేవీ రమణమూర్తి, మొదలి నాగభూషణశర్మ, కోటా శంకర్రావు లాంటి రంగస్థల హేమాహేమీల దర్శకత్వంలో... రాళ్లపల్లి, సుత్తివేలు, పీజేశర్మ, సాక్షి రంగారావు, తనికెళ్ల భరణి, జేవీ సోమయాజులు, రఘుబాబు తదితర ప్రముఖులతో కలిసి రంగస్థలం మీద పని చేయడం నాకు లభించిన అరుదైన అవకాశం. రంగస్థల నటిగా నాలుగు సార్లు నంది అవార్డు, ఒక జాతీయ పురస్కారాన్ని అందుకున్నాను.

జాతీయ స్థాయి ప్రదర్శనే లక్ష్యం...

వినోదం స్మార్ట్‌ఫోన్‌ రూపంలో ప్రతిఒక్కరికీ అరచేతిలోకి వచ్చిన తర్వాత నాటకాల హవా కాస్త తగ్గిన మాట వాస్తవమే. అయితే మంచి ఇతివృత్తంతో ఈ కాలానికి తగినట్టు సాంకేతిక పరిజ్ఞానంతో ప్రయోగాత్మకంగా రూపొందించిన నాటకాలను మాత్రం ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ఇదివరకు నాటకాల్లో నటించే ఆడవాళ్లంటే సమాజంలో చాలామందికి చులకనా భావం. ఇప్పుడు పరిస్థితి మారింది. కానీ అమ్మాయిలు ఇటువైపు రావడానికి మొగ్గు చూపడం లేదు. సినిమా, టెలివిజన్‌ రంగాలవైపు వెళ్లడానికి ఎక్కువమంది ఇష్టపడుతున్నారు. టాటాప్లే డీటీహెచ్‌లో హిందీ ఇతర భాషల నాటకాలు కొన్ని రికార్డు చేసి మరీ ప్రసారం చేస్తున్నారు. అలా తెలుగు నాటకాలను కూడా చేయగలిగితే బావుంటుంది. ఓటీటీ లాంటి వేదికలతో కొత్త నటీనటులకు అవకాశాలు పెరిగాయి. తెలుగు విశ్వవిద్యాలయంలో రంగస్థల కళలు కోర్సు చేసిన మా విద్యార్థులు చాలామంది ఇప్పుడు వెబ్‌సిరీ్‌సలు, ఓటీటీ సినిమాలకు పని చేస్తున్నారు. సినిమా, రంగస్థలం దేని ప్రత్యేకత దానిదే. తెలుగునాట నాటక రంగం ఒక పరిశ్రమగా ఎదిగే రోజు రావాలి. మన తెలుగు నాటకాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లాలన్నది నా ఆశయం. అందుకోసం నావంతు కృషి చేస్తున్నాను.

సాంత్వన్‌ ఫొటోలు: రాజ్‌కుమార్‌

అదే పెద్ద సవాలు...

నాటక రంగంలో పని చేసే ఆడవాళ్ల సమస్యల గురించి చర్చకు వచ్చిన సందర్భాలు ఇంతవరకు పెద్దగా లేవు. కారణం ఈ రంగంలో నటీమణులుగా మినహా మిగతా విభాగాల్లో మహిళలు పెద్దగా లేకపోవడమే. రంగస్థలంలో మనకు ఉన్న మహిళా దర్శకులను వేళ్ల మీద లెక్కించవచ్చు. నాటక ప్రదర్శన ప్రదేశాలలో చాలా సందర్భాలలో కాస్ట్యూమ్స్‌ మార్చుకోడానికి, కాసేపు విశ్రాంతి తీసుకోడానికి కూడా ఆడవాళ్లకు సరైన వసతులుండవు. ఇక మరుగుదొడ్లు లాంటి సౌకర్యాల సంగతి సరేసరి. ఈ రంగంలోకి రావాలంటే కుటుంబం అనుమతి తప్పనిసరి. రిహార్సిళ్లు, ప్రదర్శనలంటూ... ఇంటికి చేరడానికి ఒక వేళపాళ అంటూ ఉండదు. కనుక ఇటు వృత్తి జీవితాన్ని అటు కుటుంబ బాధ్యతలనూ సమన్వయం చేసుకోవడం ఈ రంగంలోని ఆడవాళ్లకు అతిపెద్ద సవాల్‌. దానికితోడు ఇక్కడ ప్రతి మహిళ తన భద్రత, కన్వీనియెన్స్‌ చూసుకుంటూ పని చేయాలి. కనుక నాటక రంగంలోని మహిళలకు కొన్ని వెసులుబాట్లు అవసరం.

అమ్మానాన్న ప్రోత్సాహం

సాధారణంగా పిల్లలు, ముఖ్యంగా ఆడపిల్లలు నటన వైపు వెళతామంటే తల్లితండ్రులు వారిస్తుంటారు. నా విషయంలో మాత్రం అందుకు పూర్తి విరుద్ధం. నన్ను నాటక రంగం వైపు వెళ్లమని ప్రోత్సహించింది మా నాన్న భళ్లమూడి కృష్ణమూర్తి, అమ్మ కల్యాణి. వారిద్దరూ రంగస్థల నటులు. అలా ఒకరికొకరు పరిచయం కావడంతో, ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. మా నాన్న ఎయిరిండియాలో ఉద్యోగం చేస్తూనే మరో వైపు నాటక సంఘాన్ని నెలకొల్పి క్రమం తప్పకుండా ప్రదర్శనలిచ్చేవారు. మొదట మా అక్కను నాటక రంగంవైపు తీసుకెళ్లాలి అనుకొంటే, కొన్ని పరిస్థితులవల్ల అది కుదరలేదు. దాంతో నన్ను రంగస్థలానికి పరిచయం చేశారు.

‘అమ్మాయిని ఇంజనీరింగో మెడిసినో చదివించాలి కానీ నాటకాల్లోకి పంపించడమేంటి? ఇదేం విడ్డూరం’ అని ఇరుగుపొరుగు చాలామంది అమ్మను సూటిపోటి మాటలన్నారు. నేను కూడా కిరణ్‌ బేడీలాంటివారి స్ఫూర్తితో మొదట పోలీసు అధికారి అవ్వాలి అనుకున్నాను. ‘కాస్త కష్టపడితే ఎవరైనా పోలీసు కావచ్చు. కానీ అందరూ నటులు కాలేరు’ అన్న అమ్మ మాటలు నాకు ఇప్పటికీ జ్ఞాపకం. తర్వాత అమ్మ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో రంగస్థల కళలు శాఖలో అధ్యాపకురాలిగా చేరారు. ప్రస్తుతం అదే యూనివర్సిటీలో అమ్మకు సహోద్యోగిగా నేను అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పని చేస్తుండటం నాకు లభించిన అరుదైన అవకాశం.

Updated Date - Mar 25 , 2024 | 12:43 AM