Share News

ఇది సెన్సార్‌బోర్డు ‘వ్యూహ’మా?

ABN , Publish Date - Jan 07 , 2024 | 04:49 AM

ఈ మధ్య సినిమాలు చూస్తుంటే సెన్సార్‌ బోర్డు... నిబంధనల్ని మార్చిందేమో అనిపిస్తోంది. ఒకవేళ కొత్త నిబంధనలు ఏమన్నా తీసుకువచ్చిందేమో... నాకైతే తెలియదు.

ఇది సెన్సార్‌బోర్డు ‘వ్యూహ’మా?

ఈ మధ్య సినిమాలు చూస్తుంటే సెన్సార్‌ బోర్డు... నిబంధనల్ని మార్చిందేమో అనిపిస్తోంది. ఒకవేళ కొత్త నిబంధనలు ఏమన్నా తీసుకువచ్చిందేమో... నాకైతే తెలియదు. ఎందుకంటే ఈ మధ్య సినిమాల్లో వయోలెన్స్‌, బూతులు ‘కట్స్‌’ లేకుండా అలాగే వచ్చేస్తున్నాయి. ఇవన్నీ సమాజం మార్పుతో ఏర్పడిన పరిస్థితులు అయ్యుండవచ్చు. కానీ మా రోజుల్లో సెన్సార్‌ బోర్డు చాలా కఠినంగా వ్యవహరించేది. మనిషిని పోలిన మనిషిని పెట్టినా... ఎవరైనా జీవించివున్న ప్రముఖుల పేరు వాడినా అనుమతించేవారు కాదు. అప్పట్లో ఒక సినిమాలో ఎన్టీఆర్‌ గారు... సత్యనారాయణకు సత్యసాయిలా గెటప్‌ వేశారు. దానికి సెన్సార్‌ బోర్డు అభ్యంతరం తెలిపింది. నాలుగైదు నెలలు పోరాడి, చివరకు మార్పులు చేసి దాన్ని వదిలారు. అలాగే ఫ్యామిలీ ప్లానింగ్‌, ఎమర్జెన్సీ మీద, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మీద విమర్శనాత్మకంగా రామారావు గారు చాలా చిత్రాలు తీశారు. మాదాల రంగారావు గారు ఓ సినిమా విడుదల కోసం ఏడాదికి పైగా కోర్టుల చుట్టూ తిరిగారు. ఆర్‌ నారాయణమూర్తి గారు కూడా తన రెండు మూడు చిత్రాలకు అలానే కోర్టుకు వెళ్లి సర్టిఫికెట్లు తెచ్చుకున్నారు. నా ‘మన్మథ సామ్రాజ్యం’లో ‘పీఎం, ఎఫ్‌ఎం’ అనే రెండు పదాలు వాడామని సెన్సార్‌ బోర్డువాళ్లు నన్ను ఆరు నెలలు తిప్పారు. చివరకు ఆ పదాలు తీసేదాకా ఒప్పుకోలేదు. ‘మినిస్టర్‌’ అనచ్చు కానీ, ఫైనాన్స్‌, ప్రైమ్‌ మినిస్టర్‌ అని వాడకూడదన్నారు. తరువాత ‘స్వర్ణక్క’లో ‘రాస్కెల్‌’ అంటే... ముఖ్యమంత్రి అలాంటి భాష వాడకూడదని ఆ పదం కట్‌ చేయమన్నారు. అప్పట్లో అంత కఠినంగా వ్యవహరించేవారు సెన్సార్‌ బోర్డువారు. ఇప్పుడైతే ‘రాస్కెల్‌’ కాదు... అసలు ఆ ‘నాలుగు అక్షరాల ఆంగ్ల పదం’ లేకుండా సినిమాలో మగవాళ్లు, ఆడవాళ్లు మాట్లాడుకోవడంలేదు. ఆ పదం లేకపోతే మోడ్రన్‌గా అనిపించుకోదని భావిస్తున్నట్టున్నారు.

ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే... ఇటీవల కొన్ని చిత్రాలు వస్తున్నాయి. జీవించివున్న రాజకీయ నాయకుల వేషధారణలో, వాళ్ల పేర్లనే పెట్టి, వాళ్ల మీదే సినిమాలు తీస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైన విషయం. గతంలో మేం ఫిలిమ్‌ చాంబర్‌లో ఉన్నప్పుడు ‘చిరంజీవి’ అని ఒక టైటిల్‌ రిజిస్ర్టేషన్‌కు వచ్చింది. ‘చిరంజీవి గారు ఒక సెలబ్రిటీ. మీ సినిమాలో ఏం చూపిస్తారో మాకు తెలియదు కాబట్టి ఆయన నుంచి నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ తీసుకురండి. అప్పుడు టైటిల్‌ రిజిస్టర్‌ చేస్తాం’ అని చెప్పాం. సెన్సార్‌ బోర్డు కూడా వారికి అదే సూచించింది.

కానీ ఇప్పుడు ఏంచేస్తున్నారు? ఆ మధ్య ‘యాక్సిడెంటల్‌ ప్రైమ్‌మినిస్టర్‌’ అని మాజీ ప్రధాని మన్‌మోహన్‌సింగ్‌ గారి మీద ఎవరో సినిమా తీశారు... అచ్చం ఆయనలానే గెటప్‌ వేసి. అలానే ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ కూడా. ఇప్పుడు ‘వ్యూహం’. కోర్టు కేసులతో ఆగినట్టుంది.

భావప్రకటనా స్వేచ్ఛ అనేది వంద శాతం అందరికీ ఉంటుంది. ఏది కావాలనుకొంటే అది చెప్పచ్చు. ఏది కావాలనుకొంటే అది తీయచ్చు. అయితే ఎదుటివాడికి కూడా అదే హక్కు ఉంటుంది కదా. మన హక్కులను మనం పరిరక్షించుకోవాలని ఎలా అనుకొంటున్నామో... ఎదుటివారి హక్కులకు మనవల్ల భంగం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనదే కదా. రాజకీయ నాయకుల విషయమే తీసుకొందాం... ఒక నాయకుడు నాకు నచ్చవచ్చు. మీకు నచ్చకపోవచ్చు. నేను అనుకున్న నాయకుడు మంచివాడు అయ్యుండచ్చు... మీరు అనుకున్న నాయకుడు దుర్మార్గుడై ఉండవచ్చు... నా దృష్టిలో. అలాగే మీ కోణంలో అది రివర్స్‌ అవ్వచ్చు. మన దృక్కోణాన్ని తెలియజేయడానికి వేదిక సినిమా కాదు. విడిగా బహిరంగ సభల్లోనో, మరెక్కడో ఆ పార్టీల తరుఫున వెళ్లి, మన అభిప్రాయాన్ని చెప్పవచ్చు. ఎవరినైనా విమర్శించవచ్చు. కానీ... దాన్ని తీసుకువచ్చి సినిమాల్లో పెట్టడంవల్ల కలిగే ప్రయోజనం ఏంటి? గతంలో ఎన్టీఆర్‌ గారి మీద చాలా చిత్రాలు తీశారు. ఒక సంవత్సరంలో నాలుగైదు సినిమాలు ఆయనపై వచ్చాయి. అయినా ఆ ఏడాది ఎన్టీఆర్‌ ఎన్నికల్లో గెలిచారు. వాటివల్ల ఆయనకు నష్టమేం జరగలేదు. మొన్న ‘యాత్ర’, ‘కథానాయకుడు’ తదితర బయోపిక్స్‌ తీశారు. మరి వీటిల్లో వాళ్ల గెట్‌పలతోనే చేశారు కదా అని మీరు అడగవచ్చు. బయోపిక్స్‌ అనుకున్నప్పుడు సంబంధిత కుటుంబ సభ్యల అనుమతి తీసుకొంటారు. ఇప్పుడు కూడా ఎవరి కథైతే చెబుదామనుకున్నారో... వాళ్ల కుటుంబాల సమ్మతితో చేసుకోవచ్చు. ఆ తరువాత మీకు నచ్చింది తీసుకోవచ్చు. అలాకాకుండా వాళ్ల అనుమతి లేకుండా... వాళ్లను పోలిన మనుషులనే పెట్టి, వాళ్ల పేర్లే పాత్రలకు పెట్టి, వాళ్లను మనం కించపరచడం ఎంతవరకు సబబు? ఆ హక్కు మనకు ఉందా? అలాంటి చిత్రాల విడుదలకు సెన్సార్‌ అనుమతించవచ్చా? నాకు తెలిసినంతవరకు ఆ అవకాశం లేదు. కానీ సెన్సార్‌వారు ఓకే చెబుతున్నారు.

సినిమా అనేది అందరూ చూసేలా ఉండాలి. అప్పుడైతేకానీ సినిమాకు డబ్బు రాదు. మనం ఒక పార్టీకో, ఒక వర్గానికో చెందినవారం కాదు. అలాంటప్పుడు ఒక వర్గాన్ని ఆకాశానికెత్తుతూ... రెండో వర్గానికి దూరంగా ఉండడం అవసరమా? దానివల్ల మనకు వచ్చేదేమైనా ఉంటుందా? బహుశా ఒక పార్టీ నాకు... మరో పార్టీ మీకు డబ్బు ఇచ్చివుండవచ్చు... సినిమా చేయమని. అలా తీసినందువల్ల డబ్బు పోవడం తప్పిస్తే ఏ ప్రయోజనమూ ఒనగూరదు. ఎందుకంటే మనం మన చిత్రం ద్వారా ఏదైతే చెప్పదలుచుకున్నామో అవన్నీ యూట్యూబ్‌ల్లో కనిపిస్తాయి. మనం తీసుకొనేది కూడా అక్కడి నుంచే కదా. కొత్తగా కథలైతే రాసేది ఉండదు. ఒకవేళ తీసినా వాళ్ల పేర్లు పెట్టకుండా సెటైరికల్‌గా చేసుకోవచ్చు. కానీ ఒకరిని కించపరిచే సినిమాలవల్ల పరిశ్రమపై ప్రతికూల ప్రభావం పడుతుంది. నిజానికి ఇలాంటి చిత్రాలతో పరిశ్రమకు ఎలాంటి సంబంధం ఉండదు. కానీ బయటివారికి అవేవీ తెలియవు కదా. ఎవరో వచ్చి మీరెందుకు ఆపలేదని అడుగుతాడు. ఇంకొకొరు ఇంకోటేదో అంటారు.

కనుక ఈ తరహా ముద్ర పరిశ్రమపై పడకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఒక సినిమా తీస్తున్నామంటే... అది ప్రజల్లోకి వెళ్లాలి. బాగా ఆడాలి. అప్పుడే డబ్బులు వస్తాయి. అదే సమయంలో సామాజిక బాధ్యత కూడా మనపై ఉంటుందని గ్రహించాలి. లేదు... ‘నా డబ్బు... నా ఇష్టం. నాకు సామాజిక బాధ్యత లేదు. దానికోసం నేను ఇక్కడికి రాలేదు. నా ఇష్టం వచ్చింది నేను చేస్తాను’ అనుకొంటే చేసుకోవచ్చు. అయితే దానివల్ల ఏ రకంగానూ లాభం ఉండదు... నష్టమే తప్ప.

సాధారణంగా ఇక్కడకు ఒక ప్యాషన్‌తో వస్తాం. ఒక ప్యాషన్‌తో సినిమాలు తీస్తాం. ఆ ప్యాషన్‌ చచ్చిపోయి... ద్వేషాన్ని పెంచుకొంటూ... ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడం అనేది ఎవరికీ ఆమోదయోగ్యం కాదు. అదే సమయంలో ఎన్టీ రామారావు గారు చెప్పినట్టు... ఇటువంటి సినిమాలను అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడో విన్నాను... అప్పట్లో రామారావు గారి మీద ఏదో సినిమా చేసినందుకు కోట శ్రీనివాసరావును జనం కొట్టారని. ఆ తరువాత రామారావు గారికి ఎక్కడో కోట ఎదురుపడి మన్నించమని అడిగితే... ‘ఏం పర్లేదు బ్రదర్‌’ అంటూ స్పోర్టివ్‌గా తీసుకున్నారట. అలాగే ఎక్కడో కృష్ణగారు కలిస్తే... ‘నా మీద ఇంకా ఎన్ని సినిమాలు తీస్తావ్‌’ అని అడిగారట. అలా క్రీడాస్ఫూర్తితో ఉండాలి కానీ... కోర్టులకు వెళ్లి, కేసులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే... ప్రచార ఆర్భాటమే కానీ ఆ సినిమాలవల్ల కలిగే ప్రయోజనం ఏమీ ఉండదు. తీసేవాళ్లకు తీయడం దండగ. వాటి మీద కోర్టుల చుట్టూ తిరగడం అంతకంటే దండగ. ఇరువురికీ సమయం వృథా తప్ప మిగిలేదేమీ ఉండదనేది నా అభిప్రాయం.

Updated Date - Jan 07 , 2024 | 04:49 AM