దైవ బలం లేనప్పుడు...
ABN , Publish Date - Nov 28 , 2024 | 11:58 PM
దురదృష్టవంతులను ఆపదలు ఎలా వెంటాడతాయో... ఖర్వాటో దివసేశ్వరస్య కిరణైః సంతాడితో మస్తకే వాంఛన్దేశమనాతపం విధి వశాత్తాలస్య మూలం గతః తత్రాప్యస్య మహాఫలేన పతతా భగ్నం సశబ్దం శిరః

దురదృష్టవంతులను ఆపదలు ఎలా వెంటాడతాయో...
ఖర్వాటో దివసేశ్వరస్య కిరణైః సంతాడితో మస్తకే
వాంఛన్దేశమనాతపం విధి వశాత్తాలస్య మూలం గతః
తత్రాప్యస్య మహాఫలేన పతతా భగ్నం సశబ్దం శిరః
ప్రాయో గచ్ఛతి యత్ర దైవహతక స్తత్రైవ యాంత్యాపదః ... అనే ఈ శ్లోకంలో భర్తృహరి వర్ణించాడు.
ఆ శ్లోకాన్ని...
ధర ఖర్వాటుడొకండు సూర్య కర సంతప్త ప్రధానాంగుడై
త్వర తోడన్ బరువెత్తి చేరి నిలచెన్ తాళ ద్రుమచ్ఛాయ త
చ్ఛిరమున్ తత్ఫల పాత వేగమున విచ్చెన్ శబ్ద యోగంబుగా
బొరి దైవోపహతుండు వోవు కడకుం పోవుంగదా యాపదల్ ... అంటూ ఏనుగు లక్ష్మణకవి తెలుగువారికి అందించాడు.
భావం: మండు వేసవి కాలంలో ఒక వ్యక్తి ప్రయాణం చేస్తున్నాడు. మధ్యాహ్న సూర్యుడు నడినెత్తిన ఉన్నాడు. పైగా ఆ వ్యక్తికి బట్టతల. ఎండ కారణంగా తలమాడిపోతూ ఉంటే తట్టుకోలేక.. సొమ్మసిల్లిపోతున్నాడు. ఎండ బారి నుంచి తప్పించుకోవడానికి నీడ కోసం వెతికాడు. కొంతసేపటికి ఒక తాటి చెట్టు కనిపించింది. దాని కింద నీడ ఎక్కువగా లేకపోయినా... గత్యంతరం లేక ఆ చెట్టు కింద నిలబడ్డాడు. ఇంతలో ఆ చెట్టు నుంచి ఒక తాటి పండు రాలి... సరిగ్గా అతని తలమీద పడింది. పెద్ద శబ్దంతో ఆ బాటసారి తల బద్దలై... అతను అక్కడికక్కడే మరణించాడు. ‘దైవ బలం లేని దురదృష్టవంతులకు ఎక్కడికి వెళ్ళినా ఆపదలు తప్పవు’ అంటున్నాడు అ శ్లోకంలో భర్తృహరి.