Share News

రక్తపోటు అదుపు తప్పితే?

ABN , Publish Date - Feb 13 , 2024 | 12:41 AM

సెరెబ్రోవ్యాస్క్యులర్‌ ఆరోగ్యం మీద కూడా హైపర్‌టెన్షన్‌ ప్రభావం చూపిస్తుంది.

 రక్తపోటు అదుపు తప్పితే?

అధిక రక్తపోటుకు సైలెంట్‌ కిల్లర్‌ అని పేరు. నిశ్శబ్దంగా అంతర్గత అవయవాలను నాశనం చేసే ఈ రుగ్మతను వీలైనంత త్వరగా కనిపెట్టి, మందులతో అదుపులో పెట్టుకోవడం అవసరం. లేదంటే అధిక రక్తపోటుతో ఎన్నో ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి.

గుండెకు చేటు

హైపర్‌టెన్షన్‌తో గుండె మీద భారం పడుతుంది. బలంగా రక్తాన్ని సరఫరా చేయవలసి రావడం మూలంగా గుండె కండరాలు మందంగా మారతాయి. ఫలితంగా హార్ట్‌ ఫెయిల్యూర్‌ అవకాశాలు పెరుగుతాయి. నిరంతర ఒత్తిడి మూలంగా రక్తనాళాలు దెబ్బతిని, అథెరోస్క్లెరోసిస్‌ తలెత్తుతుంది. ఫలితంగా గుండెపోటుకు గురయ్యే పరిస్థితి నెలకొంటుంది.

మెదడుకు నష్టం

సెరెబ్రోవ్యాస్క్యులర్‌ ఆరోగ్యం మీద కూడా హైపర్‌టెన్షన్‌ ప్రభావం చూపిస్తుంది. పెరిగిన రక్తపోటు వల్ల మెదడులోని సూక్ష్మ రక్తనాళాలు దెబ్బతిని స్ట్రోక్‌ అవకాశాలు పెరుగుతాయి. అలాగే వ్యాస్క్యులర్‌ ఎడీమా తలెత్తి జ్ఞాపకశక్తి కుంటుపడుతుంది.

మూత్రపిండాల మీద ప్రభావం

రక్తపోటును నియంత్రించడంలో మూత్రపిండాలు కీలక పాత్ర పోషిస్తాయి. అయితే రక్తపోటు అదుపు తప్పితే, మూత్రపిండాల పనితీరు దెబ్బతింటుంది. క్రానిక్‌ కిడ్నీ డిసీజ్‌కు దారి తీసి, వ్యర్థాలను వడకట్టలేని పరిస్థితి తలెత్తి, ఎలకొ్ట్రలైట్‌ సంతులనం దెబ్బతింటుంది.

కంటి చూపు తగ్గుతుంది

అధిక రక్తపోటు కళ్లలోని సూక్ష్మ రక్తనాళాలను దెబ్బ తీస్తుంది. ఫలితంగా హైపర్‌టెన్సివ్‌ రెటినోపతి తలెత్తి చూపు సమస్యలు మొదలవుతాయి. చికిత్స అందించకపోతే, ఆ సమస్య క్రమేపీ శాశ్వత అంధత్వానికి దారి తీస్తుంది.

పెరిఫెరల్‌ ఆర్టీరియల్‌ డిసీజ్‌

అధిక రక్తపోటు అథెరోస్క్లెరోసి్‌సకు దారి తీస్తుంది. ప్లేక్‌ పేరుకుపోవడం మూలంగా ధమనులు ఇరుకుగా, గట్టిగా మారిపోయే పరిస్థితి ఇది. ఈ సమస్యతో కరొనరీ ఆర్టెరీలతో పాటు చేతులు, కాళ్లలోకి ప్రయాణించే ధమనులు కూడా దెబ్బతిని పెరిఫెరల్‌ ఆర్టీరియల్‌ డిసీజ్‌ మొదలవుతుంది. అవయవాలకు రక్తసరఫరా తగ్గడం వల్ల నొప్పి మొదలవుతుంది. అలాగే గాయాలు మానే వేగం నెమ్మదిస్తుంది. ఇన్‌ఫెక్షన్‌ సోకే అవకాశాలు పెరుగుతాయి.

Updated Date - Feb 13 , 2024 | 12:41 AM