Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

తెలుగులో తొలి బంజార పీహెచ్‌డీ నాదే

ABN , Publish Date - Mar 04 , 2024 | 03:52 AM

ప్రతిష్టాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మొట్ట మొదటి బంజారా మహిళా ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తుండటం ఒకెత్తు అయితే,

తెలుగులో తొలి బంజార పీహెచ్‌డీ నాదే

గిరిజన తండాలో పుట్టిపెరిగిన సూర్యా ధనంజయ్‌ ఉస్మానియా విశ్వవిద్యాలయం సీనియర్‌ ప్రొఫెసర్‌గా ఎదిగిన తీరు మహిళా లోకానికి స్ఫూర్తి పాఠం. పెళ్లితో ఆగిన చదువును తన భర్త ధనంజయ్‌ ప్రోత్సాహంతో పూర్తిచేసి స్వయంకృషి, పట్టుదలకు ప్రతిరూపంగా నిలిచారు. ఆమె పర్యవేక్షణలో ఇరవైకుపైగా పీహెచ్‌డీలు వెలువడటం బోధనా రంగంలో అరుదైన విషయం. ‘‘బంజారా భాషా సాహిత్యాల అభివృద్ధే నా లక్ష్యం’’ అంటున్న ప్రొఫెసర్‌ సూర్య విద్యార్థి, ఉద్యోగ జీవిత ప్రస్థానంలోని కొన్ని విశేషాలను ‘నవ్య’తో చెబుతున్నారిలా.!

‘‘ప్రతిష్టాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మొట్ట మొదటి బంజారా మహిళా ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తుండటం ఒకెత్తు అయితే, నా పర్యవేక్షణలో ఇరవైకి పైగా పీహెచ్‌డీలు, మూడు పోస్టు డాక్టోరల్‌ డిగ్రీలు వెలువడటం మరొక ఎత్తు. ఒక గిరిజన తండా నుంచి వచ్చిన నాకు సగటు విద్యార్థి ఎదుర్కొనే కష్టాలన్నీ తెలుసు కనుక నా విద్యార్థులతో నేను మాత్రం ఆధిపత్య ధోరణితో వ్యవహరించకూడదని ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన తొలి రోజే నిశ్చయించుకొన్నాను. పిల్లల అభిరుచి మేరకే పరిశోధనాంశాలను ఎంపిక చేసుకొనే అవకాశమిచ్చాను. నా అభిప్రాయాలను ఎన్నడూ వాళ్ల మీద రుద్దలేదు. కనుకనే ఎరుకల, చెంచు, మాదిగ, మైనార్టీ... ఇలా విస్మృతికి లోనైన అణగారిన వర్గాల సాహిత్యం మీద పీహెచ్‌డీ పరిశోధనలు వెలుగుచూశాయి. తెలంగాణ పాట, ఈగ బుచ్చిదాసు సంకీర్తనలు తదితర వైవిధ్యభరితమైన అంశాలమీద నా విద్యార్థులు అధ్యయనం చేశారని చెప్పడానికి గర్విస్తున్నాను. ‘పంచమహాకావ్యాల్లో స్త్రీ పాత్రలు’ లాంటి ప్రాచీన సాహిత్యాంశాలమీదా నా పర్యవేక్షణలో పరిశోధనలు వచ్చాయి. బంజారా సాహిత్యం మీద తెలుగులో పీహెచ్‌డీ పరిశోధన చేసిన మొట్టమొదటి మహిళను నేనే. తద్వారా మా సంస్కృతి, జీవన విధానాన్ని బయట ప్రపంచానికి పరిచయం చేయగలిగానన్న తృప్తి నాకుంది.

తెలుగు సాహిత్యంతో పరిచయం...

మాది నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలంలోని భల్లూనాయక్‌ తండా. పదిమంది పిల్లల్లో నేను తొమ్మిదో సంతానం. వ్యవసాయం జీవనాధారమైన మాకు పేదరికం కూడా వెన్నంటే ఉండేది. నేను పుట్టినప్పుడు... ‘మళ్లీ ఆడపిల్లే... వడ్లగింజో, సారాచుక్కో పోస్తే సరి’ అని బంధువులు సలహా ఇచ్చారట. దానికి ఒప్పుకోని మా అమ్మానాన్న నన్ను ఉన్నంతలో అపురూపంగానే పెంచారు. మా నాన్న భల్లూ నాయక్‌కు చదువంటే ఇష్టం. ఆయన చొరవతోనే మా తండాలో ఒక పూరిపాకలో ఏకోపాధ్యాయ పాఠశాల ప్రారంభమైంది. నాకు నాలుగేళ్ల వయసప్పుడు మా నాన్న అనారోగ్యంతో కన్నుమూశారు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఆ బడి కూడా మూతపడింది. దాంతో ఏడేళ్లు కూడా లేని నేను రోజూ ఏడు కిలోమీటర్లు కాలినడకన చదువుకోడానికి మరో తండాకు వెళ్లేదాన్ని. ఆరో తరగతికి మా అక్క కూతురితో కలిసి మిర్యాలగూడ బాలికల పాఠశాలలో చేరాను. అప్పుడు స్థానిక ఎస్సీ హాస్టల్‌లో ఉండేవాళ్లం. మా పాఠశాలలో వెయ్యిమంది విద్యార్థినులుంటే అందులో మేమిద్దరమే బంజారా అమ్మాయిలం. మా మాతృభాష బంజారా అయినా, తెలుగు మాధ్యమంలో నా చదవు సజావుగా సాగడానికి ఉపాధ్యాయులు బాగా ప్రోత్సాహించారు. మా వసతిగృహంలో రోజూ రాత్రిపూట అమ్మాయిలమంతా ఒకచోట చేరి కథలు, నవలలు కలిసి చదివేవాళ్లం. అలా నాకు తెలుగు సాహిత్యంతో సాన్నిహిత్యం ఏర్పడింది. ఆ అభిరుచే నన్ను ఇవాళ ఈ స్థానంలో నిలిపిందేమో.

డిస్టెన్స్‌లో డిగ్రీ...

మా తండాలో అమ్మాయిలకు పన్నెండేళ్లలోపే పెళ్లి చేయడం ఆనవాయితీ. నేనా ఊరు దాటివెళ్లి చదువుతున్నాను. దాంతో ఇరుగు పొరుగు వారంతా అమ్మను ‘పిల్లకు పెళ్లెప్పుడు చేస్తావు’ అని సూటిపోటిమాటలతో పొడవసాగారు. నన్ను బాగా చదివించాలి అనుకున్న అమ్మకు నిర్ణయం మార్చుకోక తప్పలేదు. ఇంటర్‌ మొదటి సంవత్సరంలో ఉండగా నాకు ధనంజయ్‌ నాయక్‌తో వివాహమైంది. ‘నా కూతరిని చదివించాలి’ అని అమ్మ ఆయన దగ్గర ముందే మాట తీసుకొన్నదట. అప్పుడు ధనంజయ్‌ ఉస్మానియా యూనివర్సిటీలో ఎమెస్సీ జియాలజీ చదువుతున్నారు. పెళ్లి తర్వాత వెంటనే పిల్లలు, కుటుంబ బాధ్యతలతో నా చదువుకు బ్రేక్‌ పడింది. ఆయనకు పోస్టు గ్రాడ్యుయేషన్‌ పూర్తి అవ్వగానే, ఉస్మానియాలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా ఉద్యోగం వచ్చింది. అయితే, ఇక నా చదువు అటకెక్కిందనుకొన్న సమయంలో, ధనంజయ్‌ ప్రోత్సాహంతో అంబేడ్కర్‌ ఓపెన్‌ వర్సిటీ డిగ్రీలో చేరాను. ప్రతి ఆదివారం తరగతులకు వెళితే, పిల్లల ఆలనాపాలనా ఆయన చూసేవారు. పరీక్షల సమయంలోనూ ఇంటి బాధ్యతలన్నీ తానే చూసుకొనేవారు. నా చదువుకు తొలి ప్రాధాన్యత ఇచ్చేవారు. నాకు అర్థంకానివి చెబుతూ, దగ్గర కూర్చొబెట్టుకొని మరీ చదివించేవారు. అలా మంచి మార్కులతో డిగ్రీ పట్టా అందుకున్నాను.

చదవలేనన్నాను...

నేను పోస్టుగ్రాడ్యుయేషన్‌ మాత్రం రెగ్యులర్‌గా చేయాలనేది నా భర్త సంకల్పం. దాంతో కోఠి మహిళా కాలేజీలో ఎమ్మే తెలుగులో చేరాను. తెలుగు అంటే ఏదో రోజూ మనం చదివేది, మాట్లాడేదే కదా. సులభంగా ఉంటుందనుకొన్నా. తీరా నాలుగు రోజులు గడిచాక ‘వ్యాకరణం’ ఎంత కష్టమో అర్థమైంది. ఇంటికొచ్చి నా వల్లకాదు అన్నాను. ‘కష్టంగా ఉందని వదిలేస్తే, ఇష్టమైన జీవితాన్ని పొందలేమని’ ధనంజయ్‌ నాకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అప్పుడు మేమూ ఓయూ క్వార్టర్స్‌లోనే ఉండేవాళ్లం. మా ఇంటి పక్కనే ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి, మరో వైపు తంగెడ కిషన్‌రావు, ఇంకో వైపు రుకునుద్దీన్‌ లాంటి తెలుగు పండితులుండేవారు. అలాంటి అరుదైన అవకాశాన్ని సద్వినియోగపరుచుకోమని సూచించారు. రోజూ కాలేజీ నుంచి వచ్చిన తర్వాత కసిరెడ్డి వెంకటరెడ్డి సర్‌ దగ్గరకెళ్లి వ్యాకరణం పాఠాలు చెప్పించుకొనేదాన్ని. తర్వాత గురువుగారి సహ అధ్యాపకురాలిగా నేను చదివిన కోఠి మహిళా కళాశాలలోనే చేరడం జీవితంలో మరిచిపోలేని ఒక మధురానుభూతి. నాకు ఎంఫిల్‌, పీహెచ్‌డీలలో పర్యవేక్షకుడిగా ఉన్న ఆచార్య మసన చెన్నప్పతో పాటు సినారె, ఆచార్య ఎన్‌ గోపీ తదితర పెద్దల సహకారం మరిచిపోలేనిది. వారంతా నన్ను కూతురిలా భావించి ప్రోత్సహించారు. అలాంటి గొప్ప ఆచార్యులు, పండితులు పరిచయం కావడం నా అదృష్టం.

రామాయణాల్లోని ఆశ్రమాలు...

మారుమూల తండాలో పుట్టి పెరిగిన నేను ఎమ్మే తెలుగులో పట్టా పొందాను. నా మాతృభాష బంజారా అయినా... ‘రామాయణం అరణ్యకాండలోని ఆశ్రమాలు- శ్రీరాముని దర్శనాలు’ అంశంమీద ఎంఫిల్‌ పరిశోధన చేశాను. అందుకు శ్రీవాల్మీకి ‘రామాయణం’ సంస్కృతం, గోన బుద్ధారెడ్డి ‘రంగనాథ రామాయణం’, మొల్ల ‘రామాయణం’ చదివాను. అందులో శ్రీరాముడు సందర్శించిన ఆశ్రమాలు, వాటి స్థితిగతులు, మహర్షులు, విద్యా వాటికలు... లాంటి సునిశిత అంశాలను థీసె్‌సలో రాశాను. ప్రాచీన సాహిత్యం మీద కొంతవరకు సాధికారత సాధించగలిగాను. అది నేను పొందిన విజయం అనుకొంటాను. అమెరికా ఫోక్లోర్‌ సొసైటీ ఆహ్వానం మేరకు అక్కడికెళ్లి ‘బంజారాల వస్త్ర, ఆభరణాల ప్రాముఖ్యత’ మీద పత్ర సమర్పణ చేశాను. మా తండా జీవితాలు ఇతివృత్తంగా కథలు, నానీలు, కవిత్వం... ఇలా పదికిపైగా పుస్తకాలు రాశాను. ఇరవైకుపైగా పుస్తకాలకు సంపాదకత్వం వహించాను. తద్వారా మా వాళ్ళ గొంతుకను వినిపిస్తున్నాను. తెలుగు సాహిత్య చరిత్రలో బంజారా సాహిత్యాన్ని నమోదు చేయగలిగాను. తెలంగాణ ప్రభుత్వం నుంచి ‘ఉమెన్‌ అచీవర్‌’ అవార్డు అందుకొన్నాను.

అమ్మ స్మారకంగా...

ఉన్నత విద్య అభ్యసిస్తున్న క్రమంలోనే ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం వచ్చింది. అంతటితో తృప్తి చెందలేదు. ప్రొఫెసర్‌ కావాలి అనుకొన్నాను. అదే లక్ష్యంగా కొన్నేళ్లు కష్టపడ్డాను. నా కల సాకారమైంది. పాతికేళ్లుగా బోధనా రంగంలో కొనసాగుతున్నాను. ఉస్మానియా తెలుగు శాఖ అధ్యక్షురాలిగా నాలుగేళ్లు బాధ్యతలు నిర్వర్తించాను. బిరుదురాజు రామరాజు తర్వాత అంతకాలం హోదాలో కొనసాగింది నేనే అని తెలిసి ఉప్పొంగిపోయాను. రాయప్రోలు సుబ్బారావు అధ్యక్షుడిగా 1919లో మొదలైన మా తెలుగు శాఖకు శతాబ్ది ఉత్సవాలను నిర్వహించడం నాకు లభించిన మరొక గొప్ప అవకాశం.

నన్ను మరొకరు వేలెత్తి చూపిండానికి అవకాశం లేకుండా, స్వీకరించిన ప్రతి బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నాను.

అబ్బాయిలనే పెద్దగా బడికి పంపని ఆ రోజుల్లో నన్ను పదో తరగతి వరకు చదివించింది మా అమ్మ ఽధాళ్వీబాయి. నన్ను విద్యావంతురాలిని చేయాలని ఆమె ఎంతగా కలలు కన్నదో నాకు తెలుసు. అక్షరం ముక్క రాకున్నా ఆమె ప్రేమతత్వం మహత్తరమైనది. అదే నన్ను విజయతీరాలకు చేర్చింది. అందుకే మా అమ్మ స్మారకంగా ‘యాడి’ (అమ్మ) చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా కష్టాల్లో ఉన్న విద్యార్థులకు తోచిన సహాయం చేస్తున్నాను. ఉజ్వల్‌ క్రియేషన్స్‌ ద్వారా యువ రచయితలను ప్రోత్సహించాలని, వారి రచనలు ముద్రిస్తున్నాం.

సాంత్వన్‌

నా భర్తతోనే నాకు అస్తిత్వ స్పృహ...

నా అసలు పేరు సూర్య. పెళ్లి అయ్యాక పేరు చివర ధనంజయ్‌ చేరింది. ‘పేరు చివర మొగుడి పేరు తగిలించుకొన్నావు. నీకంటూ సొంత అస్తిత్వం లేదా’ అని కొందరు హేళనగా మాట్లాడుతుంటారు. బలమైన కుటుంబ నేపథ్యముండి, ఉన్నత చదువులు చదివి కూడా భార్యను వంటింటికే పరిమితం చేస్తున్న మగవాళ్లు మనచుట్టూ బోలెడుమంది కనిపిస్తారు. అలాంటిది తండా నుంచి వచ్చిన నా భర్త ముఫ్ఫై ఏళ్ళ కిందట నేను చదువుకోడానికి, తద్వారా స్వావలంబన సాధించడానికి అడుగడుగునా అండగా నిలిచి నన్ను ముందుకు నడిపించారు. నా భర్త ధనంజయ్‌తోనే నాకు అస్తిత్వ స్పృహ కలిగిందని నమ్ముతాను. ఆయన ప్రోత్సాహం

లేనిదే భల్లూ నాయక్‌, ధాళ్వీబాయిల బిడ్డ సూర్య... ప్రొఫెసర్‌ సూర్యగా ఎదిగేది కాదు. మాకు ఇద్దరబ్బాయిలు, ఒక అమ్మాయి. చిన్న అబ్బాయి నెదర్లాండ్‌లో ఎల్‌ఎల్‌ఎమ్‌ చేస్తున్నాడు. పెద్దబ్బాయి సాఫ్ట్‌వేర్‌ రంగంలో స్థిరపడ్డాడు. అమ్మాయి మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌గా ఉద్యోగం చేస్తూ, ఓయూ ఇంజనీరింగ్‌ కళాశాలలో రోబాటిక్స్‌ మీద పీహెచ్‌డీ చేస్తోంది. నా చదువును ప్రోత్సహిస్తూ, ధనంజయ్‌ కూడా జియాలజీ, న్యాయశాస్త్రాలలో పీహెచ్‌డీ చేశారు. కమర్షియల్‌ ట్యాక్స్‌ డిపార్టుమెంట్‌లో అసిస్టెంట్‌ కమిషనర్‌గా పదివీ విరమణ చేశారు. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు లాయర్‌గా ప్రాక్టీసు చేస్తున్నారు.

అదే నా ఆశయం..

నాకు ధాళ్వీబాయి జన్మనిస్తే... ఆగిన నా చదువు తిరిగి కొనసాగేలా అవకాశమిచ్చిన డాక్టర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం పునర్జన్మనిచ్చింది.

ఉస్మానియా విశ్వవిద్యాలయం జీవితాన్నిచ్చింది. గిరిజన సాహిత్య అధ్యయన కేంద్రాన్ని నెలకొల్పాలి. తద్వారా

చరిత్రలో నమోదు కాని సంచార, గిరిజన సాహిత్యాన్ని వెలుగులోకి తేవాలి. బంజారా భాషా సాహిత్యాల అభివృద్ధికి కృషి చేయాలి అన్నది నా ఆశయం. ఆ దిశగా ప్రయత్నిస్తున్నాను.

Updated Date - Mar 04 , 2024 | 03:52 AM